ధురంధర్2: ఈ సినిమా తర్వాత భారత గూఢచారులను పట్టుకునేందుకు పాకిస్తాన్‌లో ప్రత్యేక ఆపరేషన్ అంటూ వైరలైన వీడియో నిజమేనా?

ఫొటో క్యాప్షన్, ల్యారీ ప్రాంతం
    • రచయిత, షుమైలా ఖాన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 9 నిమిషాలు

'ధురంధర్: ది రివెంజ్' సినిమా మార్చిలో వెండి తెరపైకి వచ్చినప్పుడు, అందులోని కొన్ని కల్పిత సన్నివేశాలు నిజజీవితంలోకి రావడానికి ఎంతో సమయం పట్టలేదు.

భారత గూఢచారులను పట్టుకోవడానికి ల్యారీ ( కరాచీ నగరంలోని ఒక ప్రాంతం)లో భద్రతాదళాలు ఒక 'గ్రాండ్ ఆపరేషన్' నిర్వహిస్తున్నట్లు కనిపించే ఒక వీడియో వైరల్ అయ్యింది.

అది భారత్‌లో కూడా విపరీతంగా ట్రోల్ అయ్యింది.

ఆ సినిమాలోని గూఢచారి కథాంశం నుంచే ఈ ఆపరేషన్ వీడియో కూడా స్ఫూర్తి పొందిందని అనేక సోషల్ మీడియా పోస్టుల్లో రాశారు.

ఈ వీడియో మూలాలను బీబీసీ స్వతంత్రంగా ధ్రువీకరించట్లేదు. అయితే, ఆ వీడియో క్లిప్ మాత్రం చాలా ఉత్కంఠభరితంగానే ఉంది.

Sorry, we can’t display this part of the story on this lightweight mobile page.
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

వీడియోకి, ల్యారీకి ఏమిటి సంబంధం?

ఆ వీడియోలో సన్నివేశం ఏమిటంటే, ల్యారీలో రోడ్డుపక్కన మంచంపై నిద్రిస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు నిద్రలేపుతారు. ఆయనను చెక్ చేసి, తర్వాత వదిలేస్తారు. అయితే, గూఢచారిని కనుక్కునే ప్రయత్నంగా కనిపించినప్పటికీ వాస్తవం మాత్రం అదికాదు.

ఆ తనిఖీలలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నవారిలో యూనస్ అమీన్ ఒకరు. ఆయనతో బీబీసీ మాట్లాడింది.

తానొక పౌల్ట్రీ వ్యాపారినని, అలాగే మాదక ద్రవ్యాల నిరోధానికి కృషిచేస్తున్న ఒక స్వచ్ఛంద సంస్థలో వలంటీర్‌గా పనిచేస్తున్నానని ఆయన చెప్పారు.

డ్రగ్స్ నుంచి విముక్తి, సామాజిక అవగాహన కార్యక్రమాలపై దృష్టి సారించే 'యాంటీ నార్కోటిక్స్ అండ్ క్రైమ్ కంట్రోల్' (ఏఎన్‌సీసీ) సంస్థ ఆపరేషనల్ డైరెక్టర్‌గా ఆ వీడియోలో యూనస్ అమీన్ కనిపిస్తుంటారు.

ఆ వీడియోకి, గూఢచర్యానికి గానీ, లేదా కనీసం ల్యారీ ప్రాంతానికి ఎటువంటి సంబంధం లేదని ఆయన చెప్పిన వివరాలను బట్టి తెలుస్తోంది.

ఆ ఆపరేషన్ కేవలం మాదకద్రవ్యాలకు బానిసలైనవారిని గుర్తించి, వారిని పునరావాస కేంద్రాలకు పంపించడానికి క్రమబద్ధంగా నిర్వహించే ఆపరేషన్లలో భాగమని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, ANCC

ఫొటో క్యాప్షన్, యూనస్ అమీన్

‘గ్రాండ్ ఆపరేషన్’ అనేది తప్పు

''మాదకద్రవ్యాలకు బానిసైన వారిని గుర్తించి, వారిని పునరావాస కేంద్రాలకు పంపించడానికి మేము ఐదేళ్ల కిందటే పోలీసులతో కలిసి ఈ ఆపరేషన్లు ప్రారంభించాం'' అని యూనస్ అమీన్ చెప్పారు.

అంతేకాదు, ఆ వీడియో వాస్తవానికి హైదరాబాద్‌కు సంబంధించినదని, ల్యారీ కాదని ఆయన వెల్లడించారు.

''గూఢచారుల కోసం నిర్వహిస్తున్న ఎటువంటి శోధనలతోనూ ఈ ఆపరేషన్‌కు సంబంధం లేదు'' అని ఆయన అన్నారు.

'గ్రాండ్ ఆపరేషన్స్' అని చెబుతూ ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్న ఈ తనిఖీలు, వాస్తవానికి మాదకద్రవ్యాల వినియోగదారులను గుర్తించి, వారిని పునరావాస కేంద్రాలకు పంపడానికి జరుగుతున్న ప్రయత్నాలలో భాగమని యూనస్ చెప్పారు.

ఈ ప్రక్రియలో కొన్నిసార్లు 'ఈధి వెల్ఫేర్ ఫౌండేషన్' సహాయం కూడా తీసుకుంటామని యూనస్ చెప్పారు.

అవగాహన కల్పించడానికే ఇలాంటి వీడియోలు తీస్తామని, సంచలనాల కోసం కాదని ఆయన చెప్పారు.

''మేము టిక్‌టాకర్స్ కాదు. కానీ ప్రజలు మా వీడియోలను తీసుకుని సందర్భం లేకుండా వాటిని వైరల్ చేస్తున్నారు'' అని ఆయన అన్నారు.

ల్యారీ తెరవెనుక కన్నీటి పోరాటాలు

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వాదనలకు అతీతంగా, ల్యారీలోని ఆసుపత్రులు, ఇళ్లలో అసలు విషయం వెలుగుచూస్తోంది.

ఒక పునరావాస కేంద్రం వెలుపల మధ్యవయస్కుడు ఒకరు వేచి ఉన్నారు. జీవితం చిన్నాభిన్నమైపోయిన తన స్నేహితుడికి చికిత్స అందించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు.

''ఏడాదిగా ఆయన ఐస్ (క్రిస్టల్ మెత్) వాడుతున్నారు. ఇంతకుముందు రహస్యంగా వాడేవారు. ఇప్పుడు బహిరంగంగానే వాడుతున్నాడు. రాత్రిపూట నిద్రపోకుండా బయటకు వెళ్తున్నారు. ఆయన్ను జాగ్రత్తగా అనుసరిస్తే మాకు తెలిసిందేమిటంటే.. ఆయనకు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందని'' అని చెప్పారు.

''ఒకప్పుడు మంచి సంపాదన, భార్యాపిల్లలతో సంతోషంగా ఉన్న అతనే ఇప్పుడు తన వ్యసనానికి డబ్బులు సరిపోనప్పుడు దొంగతనాలు చేస్తున్నాడు'' అని ఆయన వెల్లడించారు.

అక్కడికి అడుగుల దూరంలోనే కళ్లు తప్ప ముఖమంతా ముసుగు వేసుకున్న ఓ మహిళ ఉన్నారు. ఆ ప్రాంతంలో చాలామందికి తెలిసిందే అయినా తన కథను ఆమె వివరించారు.

ఒకప్పుడు ఆటోడ్రైవర్‌గా పనిచేస్తూ, ఇంటికి చేదోడువాదోడుగా ఉన్న ఆమె 20 ఏళ్ల కొడుకు, ఇప్పుడు రాత్రంతా వీధుల్లో తిరుగుతూ గడుపుతున్నారు.

''అతను నిద్రపోలేడు, అతని వల్ల మేము కూడా నిద్రలేకుండా గడుపుతున్నాం'' అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన కొడుకు ఎంతలా మారిపోయాడనేది ఆమెను అన్నిటికన్నా ఎక్కువగా కలచివేస్తున్న విషయం.

''ఒకప్పుడు అంతా తానై ఇంటిని పోషించేవాడు. మాదకద్రవ్యాలు ఇప్పుడు అతన్ని నాశనం చేశాయి'' అని ఆమె వాపోతున్నారు.

ఆయన్ను సరైన దారిలో పెట్టడానికి చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదని ఆమె చెబుతున్నారు.

''ఈ వ్యసనం వదిలిపోవట్లేదు. రోజురోజుకూ శక్తిహీనుడైపోతున్న కొడుకును అలా చూడటం చాలా బాధగా ఉంది'' అని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు.

ఫొటో క్యాప్షన్, ముహమ్మద్ ఇక్బాల్

‘ఎక్కడ చూసినా అదే వ్యసనం’

వయసుపైబడిన ముహమ్మద్ ఇక్బాల్ వంటి స్థానికులు, ఇది తరాల మధ్య వచ్చిన పెనుమార్పులా భావిస్తున్నారు.

''గతంలో ఎప్పుడూ పరిస్థితి ఇంత దారుణంగా లేదని, ఎక్కడ చూసినా వ్యసనం కనిపిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

''తరాలకు తరాలే నాశనమైపోతున్నాయి'' అని ఆయన హెచ్చరించారు.

గ్యాంగ్ వార్‌లు ముగిసిపోయిన తర్వాత కూడా మాదక ద్రవ్యాలు ఎలా చలామణి అవుతున్నాయని ఆయన సందేహం వ్యక్తంచేశారు.

ఫొటో క్యాప్షన్, బహదాది పోలీసుస్టేషన్

గ్యాంగ్‌లు కనుమరుగైన తర్వాత కొత్త సవాలు

ఒకప్పుడు ల్యారీ పేరు చెబితే గ్యాంగ్‌లు, ఆధిపత్య పోరు, సాయుధ ఘర్షణలకు స్పష్టమైన ప్రతిరూపంగా ఉండేది. అవి క్రమేపీ తెరమరుగయ్యాయి. కానీ, ఇప్పుడు ఎదుర్కొంటున్న సవాళ్లు అంతకంటే భయంకరమైనవని నాటి రోజులను చూసిన స్థానికులు చెబుతున్నారు.

ఈ ప్రాంతంలో డ్రగ్స్ మహమ్మారి ఎలా వేళ్లూనుకుపోయిందో చౌదరి అస్లాం 'ల్యారీ టాస్క్‌ఫోర్స్'లో పనిచేసిన ఇన్‌స్పెక్టర్ మునావర్ హుస్సేన్ చెబుతున్నారు.

''ఓపియం ఒక్కటే గతంలో ప్రధానమైన మత్తుపదార్థంగా ఉండేది. కానీ ఇప్పుడు ప్రజలు ఐస్, క్రిస్టల్ మెత్ వాడుతున్నారు. పెద్దపెద్ద డ్రగ్స్ అడ్డాలను ధ్వంసం చేసినప్పటి నుంచి, ఈ సమస్య ఇప్పుడు గల్లీ స్థాయిలలో కొనసాగుతోంది'' అని చెప్పారు.

‘డ్రగ్స్ రహస్యంగా అమ్మకాలు’

డ్రగ్స్ అమ్మకాలు తగ్గిపోయాయంటే అవి పూర్తిగా కనుమరుగైనట్లు కాదని స్థానిక జర్నలిస్టు సుల్తాన్ మాధ్రో అన్నారు.

''2005 నుంచి 2013 వరకు, మాదకద్రవ్యాల వ్యాపారులకు ల్యారీ స్వర్గధామంగా ఉండేది. ఇప్పుడు పాన్ డబ్బాలు, బడ్డీ కొట్లు ఎంత బహిరంగంగా ఉన్నాయో, అప్పట్లో డ్రగ్స్ కూడా అలాగే అమ్ముడయ్యేవి. ఇప్పుడు వివిధ పద్ధతులలో రహస్యంగా సాగుతున్నాయి. ఇటీవలి కాలంలో మహిళలు కూడా డ్రగ్స్ విక్రయిస్తూ దొరికారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు పోలీసు రికార్డుల్లో నమోదయ్యాయి'' అని చెప్పారు.

చికిత్స, మార్పు సంకేతాలు...

పది లక్షల కంటే ఎక్కువ జనాభా కలిగిన ల్యారీలో ఆరు నుంచి ఎనిమిది చిన్న, పెద్ద పునరావాస కేంద్రాలు ఉన్నాయి. ఇవి కేవలం ఆ పరిసరాలకే కాకుండా, చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా సేవలను అందిస్తున్నాయి.

వీటిలో బెనజీర్ షహీద్ ఏఎన్‌ఎఫ్ మోడల్ అడిక్షన్ ట్రీట్‌మెంట్ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్ ఒకటి. ఇది యాంటీ నార్కోటిక్స్ ఫోర్స్, సింధ్ ప్రభుత్వ సంయుక్త పర్యవేక్షణలో నడుస్తోంది.

100 పడకల సామర్థ్యంతో 2010లో స్థాపించిన ఈ కేంద్రం పురుషులు, మహిళలు, యువతకు సేవలను అందిస్తోంది. గత కొన్నేళ్లుగా పరిస్థితి మెరుగుపడిందని అక్కడి వైద్యులు చెబుతున్నప్పటికీ, సవాళ్లు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

ఈ కేంద్రం ప్రారంభమైనప్పటి నుంచి అక్కడ సేవలందిస్తున్న డాక్టర్ ముహమ్మద్ అలీ, ప్రస్తుత మార్పును జాగ్రత్తగా విశ్లేషించారు.

"ఇప్పుడు పరిస్థితి బాగా మెరుగుపడింది. గతంలో ఒకే రోజులో 50 నుంచి 60 మంది పేషెంట్లు వచ్చేవారు. ఇప్పుడు వారానికి కేవలం 10 నుంచి 15 మంది మాత్రమే చేరుతున్నారు. పరిస్థితిలో మెరుగుదల కనిపిస్తున్నప్పటికీ, దాని అర్థం ఈ సంక్షోభం పూర్తిగా పరిష్కారమైనట్లు కాదు'' అని ఆయన అన్నారు.

ఫొటో క్యాప్షన్, అబ్దుల్ సమీ

ల్యారీ వాస్తవ పరిస్థితుల మధ్య సంఘర్షణ...

డ్రగ్స్ ఒక యుద్ధం అయితే, ప్రజల దృష్టిలో ఉన్న అభిప్రాయం మరో యుద్ధం. దశాబ్దాలుగా, ల్యారీ అంటే హింసకు పర్యాయపదంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఒక ముద్ర పడిపోయింది. 'ధురంధర్: ది రివెంజ్' వంటి సినిమాలు పాతబడిన హింసను, అరాచకాన్ని మళ్లీ మళ్లీ చూపిస్తూ ఆ తప్పుడు ముద్రను బలపరుస్తున్నాయని చాలామంది ల్యారీ నివాసితులు నమ్ముతున్నారు.

చాలా ఏళ్లుగా ల్యారీలో నివసిస్తున్న అబ్దుల్ సమీ, ఈ చిత్రాల చిత్రీకరణను తప్పుబట్టారు.

"సినిమాలో చూపించినట్లు ఇక్కడ తీవ్రవాదులు బహిరంగంగా ఆయుధాలు పట్టుకుని తిరగలేదు. ఇక్కడ అసలు ప్రభుత్వమే లేనట్లు, ఇదొక అరాచకారణ్యం అన్నట్లు చూపించారు. కానీ వాస్తవం అది కాదు" అని అన్నారు.

ఫొటో క్యాప్షన్, డానిష్ సూమ్రో

‘క్రీడల్లో ల్యారీ మినీ బ్రెజిల్’

మరికొందరు ల్యారీకి ఉన్న మరో కోణాన్ని గుర్తుచేస్తున్నారు.

''క్రీడల వల్ల ప్రపంచవ్యాప్తంగా ల్యారీ పేరుపొందింది. దీనిని 'మినీ బ్రెజిల్' అని పిలుస్తారు. ల్యారీ గుర్తింపు ఫుట్‌బాల్, అంతే తప్ప ధురంధర్ సినిమా కాదు" అని సామాజిక కార్యకర్త డానిష్ సూమ్రో అన్నారు.

అయినప్పటికీ, ఈ ఆగ్రహం వెనుక ఒక వ్యంగ్య విమర్శ కూడా ఉంది. "ధురంధర్ 1, ధురంధర్ 2 చిత్రాలు భారతీయ సినిమాలు. పాకిస్తాన్ వ్యతిరేక సినిమాలు అక్కడ బాగా ఆడుతాయి. మాకైతే అవి కామెడీ సినిమాల్లా అనిపిస్తాయి. వాస్తవం ఏంటంటే, అవి ల్యారీ పేరు చెప్పుకుని భారీగా వ్యాపారం చేశాయి. మా పేరు మీద అంత సంపాదించినప్పుడు, మాకు కూడా అందులో వాటా ఇవ్వాలి. మాకు ఆ హక్కు ఉంది" అని సామాజిక కార్యకర్త ముహమ్మద్ హషీమ్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

‘అలాంటి ల్యారీని కట్టించి ఇవ్వండి’

సినిమాలో చూపించిన 'శుభ్రమైన, అభివృద్ధి చెందిన ల్యారీ'ని ఉద్దేశించి ''సినిమాలో మీరు ల్యారీని ఎలాగైతే చూపించారో, మాకు అటువంటి ల్యారీని కట్టించి ఇవ్వండి'' అని మహ్మద్ ఇర్ఫాన్ అనే యువకుడు డిమాండు చేశారు.

ప్రస్తుతం ల్యారీ ఒక క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. పేదరికం పెరిగింది. మౌలిక సదుపాయాలు అంతంతమాత్రమే. కనీస సదుపాయాలు సరిగా లేవు. గతకాలపు గ్యాంగ్ వార్‌ల నీడలు, సంవత్సరాల తరబడి నిర్లక్ష్యం ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. కానీ అసలు వాస్తవం చాలా క్లిష్టమైనది. ఒకవైపు తప్పుడు సమాచారం, అంటుకున్న సామాజిక ముద్ర, మరోవైపు తమకు తాము కొత్తగా నిర్వచించుకోవడానికి ప్రయత్నిస్తున్న ఒక సమాజం మధ్య ల్యారీ కొట్టుమిట్టాడుతోంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)