న్యూయార్క్ నేలమాళిగలో దాచిన వేల టన్నుల బంగారాన్ని వెనక్కి తీసుకెళ్లాలని యూరప్ దేశాలు ఎందుకు అనుకుంటున్నాయి?

ఫొటో సోర్స్, Fotos: New York Fed / Montaje: Caroline Souza

    • రచయిత, గిల్లెర్మో డి. ఓల్మో
    • హోదా, బీబీసీ న్యూస్
  • చదివే సమయం: 7 నిమిషాలు

వివిధ దేశాలకు చెందిన కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాలు, ఇతర సంస్థలకు చెందిన దాదాపు 5 లక్షలకు పైగా బంగారు కడ్డీలు(గోల్డ్ బార్స్) న్యూయార్క్‌లోని లిబర్టీ స్ట్రీట్‌లో ఉన్న అమెరికా ఫెడరల్ రిజర్వ్ ప్రధాన కార్యాలయ నేలమాళిగ(బేస్‌మెంట్)‌లో భద్రపరిచి ఉన్నాయి. ఇది భూమికి 25 మీటర్ల లోతులో ఉంటుంది.

ఫెడరల్ రిజర్వ్‌ను "ఫెడ్" అని కూడా పిలుస్తారు. ఇది అమెరికా కేంద్ర బ్యాంక్.

ఈ ఫెడరల్ రిజర్వ్ ఖజానాను 90 టన్నుల ఉక్కు స్థూపంతో(స్టీల్ సిలెండర్)తో భద్రపరిచారు. దీన్ని ఒకసారి మూసేస్తే, మరుసటి రోజు వరకు దాని భారీ తాళాలను తెరవలేరు.

ఇది ఫెడరల్ రిజర్వ్ బంగారు ఖజానా(గోల్డ్ వాల్ట్). ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు నిల్వ కేంద్రం. ఇందులో సుమారు 6,300 టన్నుల గోల్డ్ బార్స్ ఉన్నాయి. వీటి ప్రస్తుత విలువ ఒక ట్రిలియన్ డాలర్ల (సుమారుగా రూ.93 లక్షల కోట్ల రూపాయలు)కు పైగా ఉంటుంది.

ఇది అమెరికా జీడీపీలో సుమారు నాలుగు శాతం.

ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
Sorry, we can’t display this part of the story on this lightweight mobile page.

అనేక దేశాలు తమ బంగారాన్ని ఇక్కడ నిల్వ ఉంచడం వల్ల, ఈ బంగారు ఖజానా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వంలో కీలకపాత్ర పోషిస్తుంది.

ప్రపంచ రాజకీయాల్లో అస్థిరత, ద్రవ్యోల్బణం కారణంగా ఆర్థికపరమైన గందరగోళం, మూలధన విలువ పడిపోవడం వంటి సందర్భాల్లో బంగారాన్ని చాలాకాలంగా ఒక సురక్షిత పెట్టుబడిగా భావిస్తున్నారు. అందువల్ల, ఈ విలువైన లోహం ప్రపంచవ్యాప్తంగా, మరీముఖ్యంగా యూరోపియన్ దేశాల కేంద్ర బ్యాంకుల నిల్వలలో కీలక భాగంగా ఉంది.

"ఇది వారి అత్యంత ముఖ్యమైన ఆస్తులలో ఒకటి, ఎందుకంటే బ్యాంకులు, కంపెనీలు చివరగా రుణాలు పొందేందుకు, ప్రతికూల ప్రపంచ రాజకీయ సంఘటనల నేపథ్యంలో విదేశీ మారక మార్కెట్లలో జోక్యం చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది" అని అమెరికాలోని బర్క్లీ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ ద్రవ్య వ్యవస్థ నిపుణులు బారీ ఐచెన్‌గ్రీన్ బీబీసీతో అన్నారు.

అమెరికా, ఫెడరల్ రిజర్వ్‌ను ఈ కీలక ఆస్తులకు అత్యంత విశ్వసనీయ సంరక్షకులుగా దశాబ్దాలుగా పరిగణిస్తూ వస్తున్నారు.

ముఖ్యంగా, సోవియట్ యూనియన్ వల్ల తమకు ముప్పు పొంచివుందని భావించిన అనేక యూరోపియన్ దేశాలు, ఫెడరల్ రిజర్వ్‌‌లో భారీ మొత్తంలో బంగారాన్ని నిల్వచేసుకున్నాయి.

అయితే, డోనల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, యూరోపియన్ నేతలు, నిపుణులు అక్కడ నిల్వ ఉన్న తమ బంగారాన్ని వెనక్కి తీసుకొచ్చే దిశగా యోచిస్తున్నట్లు సంకేతాలిచ్చారు.

ఇటీవలి నెలల్లో అంతర్జాతీయ కట్టుబాట్లను ట్రంప్ పట్టించుకోకపోవడం, సుంకాలు విధించడం, గ్రీన్‌ల్యాండ్‌పై డెన్మార్క్ సార్వభౌమాధికారం, ఇరాన్‌పై యుద్ధం వంటి అనేక అంశాలలో డోనల్డ్ ట్రంప్, యూరోపియన్ మిత్రదేశాల మధ్య విభేదాలు తలెత్తాయి.

ఈ విభేదాలు అమెరికాలో నిల్వ ఉన్న యూరోపియన్ బంగారం భద్రతపై ఆందోళనలను పెంచాయి.

ఫొటో సోర్స్, Harry Benson / Getty

ఫొటో క్యాప్షన్, సోవియట్ యూనియన్ నుంచి ఉన్న ముప్పుకు భయపడి, యూరోపియన్ దేశాలు 1950వ దశకం ప్రారంభంలోనే తమ బంగారాన్ని అమెరికాలో నిల్వ చేయడం మొదలుపెట్టాయి.

యూరోపియన్ బంగారం అమెరికాకు ఎలా చేరింది?

పాశ్చాత్య ఆంక్షల ప్రభావం నుంచి రక్షణ కోసం, రష్యా కేంద్ర బ్యాంకు తన బంగారు నిల్వలను స్వదేశంలోనే ఉంచుతుంది. కానీ అనేక యూరోపియన్ దేశాలు ఇప్పటికీ తమ బంగారు నిల్వలను విదేశాల్లోనే ఉంచుతున్నాయి.

ఈ దేశాలలో చాలా వరకు తమ బంగారాన్ని న్యూయార్క్ గోల్డ్ వాల్ట్‌లో భద్రపరిచాయి.

1950వ దశకంలో యూరోపియన్ బంగారం అక్కడికి చేరడం మొదలైంది.

"ఆ సమయంలో జర్మనీ, ఇతర యూరోపియన్ దేశాలు అమెరికాకు ఎక్కువగా ఎగుమతి చేసేవి. వారికి బంగారం, డాలర్లలో చెల్లింపులు జరిగేవి" అని ఐచెన్‌గ్రీన్ అన్నారు.

"బంగారాన్ని నౌక లేదా విమానంలో తరలించడం, రవాణా భద్రత కోసం బీమా చేయించడం ఖర్చుతో కూడుకున్నది. అందువల్ల ఈ దేశాలు ఫెడరల్ రిజర్వ్ వాల్ట్‌లో ఉంచడం మంచిదని భావించాయి. ఎందుకంటే అక్కడ ఉంచడానికి ఎలాంటి ఫీజులూ లేవు."

1944లోబ్రెటన్ వుడ్స్‌‌లో రూపొందించిన వ్యవస్థ బంగారంతో ముడిపడి ఉన్న డాలర్‌కు స్థిర మారకపు రేటు సృష్టించింది, అందువల్ల బంగారం, డాలర్ నమ్మదగిన ఆస్తులుగా మారాయి.

యుద్ధం తర్వాత, బలహీనపడిన యూరోపియన్ శక్తులు యూఎస్ ఫెడరల్ రిజర్వ్ పర్యవేక్షణలో ఉచితంగా ఈ ఆస్తులను నిల్వ చేయడం ద్వారా లాభం పొందాయి. మరోవైపు సోవియట్ ముప్పును దృష్టిలో ఉంచుకుని, అమెరికా సంరక్షణే అత్యుత్తమైందిగా భావించేవారు.

ఫొటో సోర్స్, Chip Somodevilla / Getty

ఫొటో క్యాప్షన్, ట్రంప్‌తో ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ (కుడివైపు).

కానీ, ఇప్పుడు సోవియట్ యూనియన్ పతనమైంది. ట్రంప్ వైట్ హౌస్‌లో తిరిగి అధికారంలోకి రావడం, అమెరికా - యూరప్ మధ్య దశాబ్దాలుగా ఉన్న స్నేహాన్ని దెబ్బతీసింది.

ప్రపంచంలో అమెరికా తర్వాత బంగారు నిల్వలు భారీగా ఉన్న రెండో దేశం జర్మనీ. ఎక్కువ సమస్యలు పొంచివున్న దేశాలలో జర్మనీ ఒకటి. దీంతో, అక్కడ ఆందోళనలు ఎక్కువగా వినిపించాయి.

న్యూయార్క్‌లోని జర్మన్ సెంట్రల్ బ్యాంక్ వద్ద ఉన్న బంగారాన్ని తిరిగి స్వదేశానికి తీసుకురావాలని బుండెస్‌బ్యాంక్ మాజీ ప్రధాన పరిశోధకుడైన ఆర్థికవేత్త ఇమాన్యుయేల్ మోంచ్ డిమాండ్ చేశారు.

ఫెడరల్ రిజర్వ్ వద్ద దాదాపు 200 బిలియన్ డాలర్ల విలువైన 1,200 టన్నుల బంగారం ఉన్నట్లు జర్మన్ మీడియా అంచనా వేసింది.

ఈ బంగారాన్ని తిరిగి స్వదేశానికి తీసుకురావడం జర్మనీకి మరింత వ్యూహాత్మక స్వేచ్ఛనిస్తుందని మోంచ్ భావిస్తున్నారు.

"ప్రస్తుత ప్రపంచ రాజకీయ పరిస్థితుల దృష్ట్యా అంత భారీ మొత్తంలో బంగారాన్ని అమెరికాలో ఉంచడం ప్రమాదకరమని అనిపిస్తోంది" అని ఆయన అంటున్నారు.

"ట్రంప్ అంచనాకు అందని వ్యక్తి, ఆదాయాన్ని పెంచుకోవడానికి ఏదైనా చేయగలడు. అందుకే ఫెడరల్ రిజర్వ్ ఖజానాలో మన బంగారం ఉండడం ఇకపై సురక్షితం కాదు" అని జర్మన్ పన్ను చెల్లింపుదారుల సంఘం అధ్యక్షులు మైఖేల్ జేగర్ అన్నారు.

"గ్రీన్‌ల్యాండ్‌కు సంబంధించి రెచ్చగొట్టే చర్యలు కొనసాగితే పరిస్థితి ఏంటి? బుండెస్‌బ్యాంక్ తన బంగారాన్ని కోల్పోయే ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి అది తన నిల్వలను స్వదేశానికి తిరిగి తీసుకురావాలి" అని ఆయన సూచించారు.

ఛాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ పార్టీ అయిన సీడీయూ సభ్యులతో పాటు ఇతర రాజకీయ శక్తులు కూడా ఇదే తరహా ఆందోళన వ్యక్తం చేశాయి.

ఫొటో సోర్స్, New York Fed

ఫొటో క్యాప్షన్, ఈ ఖజానాలో పలు యూరోపియన్ దేశాలకు చెందిన బంగారం ఉంది.

అయితే బుండెస్‌బ్యాంక్ అధ్యక్షుడు జోచిమ్ నాగేల్ ఈ ఆందోళనలను తగ్గించే ప్రయత్నం చేశారు. గతేడాది అమెరికాలో జరిగిన అంతర్జాతీయ ద్రవ్య నిధి సమావేశంలో మాట్లాడిన ఆయన, "ఆందోళన చెందాల్సిన అవసరమేమీ లేదు" అని అన్నారు.

ఫిబ్రవరిలో ఒక పత్రికా సమావేశంలో ఈ విషయంపై ఆయన మళ్లీ మాట్లాడాల్సి వచ్చింది. "ఈ విషయం నన్ను రాత్రిళ్లు నిద్రపోనివ్వడం లేదు. అయినప్పటికీ, యూఎస్ సెంట్రల్ బ్యాంక్‌లోని నా సహోద్యోగులపై నాకు పూర్తి విశ్వాసం ఉంది" అని ఆయన అన్నారు.

కానీ, ఈ విషయంపై ఫెడరల్ రిజర్వ్ గానీ, ట్రంప్ ప్రభుత్వం గానీ ఎలాంటి ప్రకటనా చేయలేదు.

"నాకు ఇప్పటివరకు ఎలాంటి భరోసా కలిగించే మాట వినిపించలేదు. కానీ ఇది సమయానుకూలంగా జరుగుతుందని అనుకుంటున్నా " అని విశ్లేషకులు ఐచెన్‌గ్రీన్ అన్నారు.

ఫెడరల్ రిజర్వ్‌ను బీబీసీ సంప్రదించింది. కానీ ఎటువంటి స్పందన రాలేదు. ఆ సంస్థ మౌనం, దాని చైర్మన్ జెరోమ్ పావెల్‌కు, ప్రభుత్వానికి మధ్య సంబంధాలలో నెలకొన్న ఉద్రిక్తతను ప్రతిబింబిస్తోంది.

వడ్డీ రేట్లను తగ్గించడానికి నిరాకరించినందుకు ట్రంప్ ఆయనపై పదేపదే దాడి చేశారు. పావెల్‌పై న్యాయ శాఖ క్రిమినల్ విచారణ కూడా మొదలుపెట్టింది.

ఫెడరల్ రిజర్వ్ స్వాతంత్య్రాన్ని దెబ్బతీసి, దాన్ని "అధ్యక్షుడి మాట వినేలా" చేయడానికి కార్యనిర్వాహక విభాగం నుంచి "బెదిరింపులు, ఒత్తిడి" వస్తున్నాయని ఆయన విమర్శించారు.

ఫొటో సోర్స్, New York Fed

ఫొటో క్యాప్షన్, 1971లో అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్... డాలర్‌ను బంగారంగా మార్చుకునే వీలును రద్దు చేశారు.

1960లలో ఏం జరిగింది?

జర్మనీ మాత్రమే కాదు, ఇటలీ, స్విట్జర్లాండ్ బంగారు నిల్వలు కూడా న్యూయార్క్‌లోని ఫెడరల్ రిజర్వ్ వద్ద ఉన్నాయి.

2014లో, ఫెడరల్ రిజర్వ్‌లో తమ బంగారు నిల్వలను 51 శాతం నుంచి 31 శాతానికి నెదర్లాండ్స్ తగ్గించుకుంది. ఆ సమయంలోనే జర్మనీ కూడా తన బంగారు నిల్వల్లో కొంత స్వదేశానికి తీసుకొచ్చింది. కానీ, ఎక్కువ భాగం గోల్డ్ వాల్ట్‌లోనే ఉండిపోయాయి.

"అది గ్రీకు రుణ సంక్షోభం, యూరో సంక్షోభం ఉన్న సమయం. యూరోపియన్లు తమ కరెన్సీకి, బ్యాంకు డిపాజిట్లకు ఏదైనా పటిష్టమైన ఆధారం ఉండాలని కోరుకున్నారు" అని ఐచెన్‌గ్రీన్ వివరించారు.

1960వ దశకంలో డాలర్ విలువ అకస్మాత్తుగా పడిపోతుందనే భయంతో ఫ్రాన్స్ అధ్యక్షుడు చార్లెస్ డి గాల్, ఫెడరల్ రిజర్వ్ వద్ద ఉన్న తమ దేశ బంగారాన్ని తిరిగి స్వదేశానికి తీసుకొచ్చారు.

కాలం ఆయన నిర్ణయం సరైందని నిరూపించింది. 1971లో అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ డాలర్‌ను బంగారంగా మార్చుకునే వీలును రద్దు చేశారు. ఇది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన అంతర్జాతీయ ద్రవ్య వ్యవస్థను బలహీనపరిచింది.

ఫలితంగా న్యూయార్క్‌లో ఉంచిన గోల్డ్ బార్స్ డాలర్ విలువ రాత్రికి రాత్రే గణనీయంగా పడిపోయింది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జర్మనీ ప్రపంచంలోనే అధిక మొత్తంలో బంగారు నిల్వలను కలిగివున్న రెండో దేశంగా ఉంది.

ఫెడరల్ రిజర్వ్ బంగారు ఖజానాలో గతంతో పోలిస్తే ఇప్పుడు తక్కువ బంగారం ఉంది.

న్యూయార్క్ ఖజానాలో నిల్వ ఉన్న అంతర్జాతీయ బంగారు నిల్వలు 1973 నుంచి క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ఆ ఏడాది 12,000 టన్నులకు పైగా గరిష్ట స్థాయికి చేరాయని ఫెడరల్ రిజర్వ్ డేటా వెల్లడించింది.

అయినప్పటికీ, బంగారాన్ని అక్కడే ఉంచాలనే ఆలోచనకు యూరోపియన్లు ఇప్పటికీ మద్దతు ఇస్తున్నారు.

"బంగారాన్ని తిరిగి తీసుకురావడం ప్రస్తుత పరిస్థితిలో అగ్నికి ఆజ్యం పోయడం లాంటిదని, ఊహించని పరిణామాలకు దారితీయవచ్చు" అని బ్రిటిష్ వార్తాపత్రిక 'ది గార్డియన్'తో మాట్లాడుతూ, జర్మనీలోని ఐఎఫ్‌ఓ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్ రీసర్చ్‌కు చెందిన క్లెమెన్స్ ఫస్ట్ అన్నారు.

అయితే, యూరోపియన్ బంగారం సంరక్షుడిగా అమెరికా ఫెడరల్ రిజర్వ్‌ విశ్వసనీయతపై తలెత్తిన సందేహాలు, దశాబ్దాల నాటి ప్రపంచ వ్యవస్థలో మరో చీలికకు కారణమయ్యే ప్రమాదముంది.

"అంతర్జాతీయ ద్రవ్య వ్యవస్థ చరిత్రలో, అత్యంత దృఢమైన పునాదులు కూడా కదలడం ప్రారంభించే సమయాలు ఉంటాయి" అని గతేడాది ఒక ప్రసంగంలో ఈసీబీ అధ్యక్షురాలు క్రిస్టీన్ లగార్డ్ మాటలు కొంతమంది నాయకులపై ప్రభావం చూపించి ఉండొచ్చు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)