'నవ వధువు‌ను హత్య చేసిన తండ్రి', సీఐ సస్పెన్షన్‌కు గురైన మాచర్ల యువతి మర్డర్ కేసులో అసలేం జరిగింది?

మాచర్ల, చౌడమ్మ, తండ్రి శ్రీనివాసరావు

ఫొటో సోర్స్, Kiran, Macherla

ఫొటో క్యాప్షన్, చౌడమ్మ(మృతురాలు), తండ్రి శ్రీనివాసరావు
    • రచయిత, గరికిపాటి ఉమాకాంత్‌
    • హోదా, బీబీసీ కోసం
  • చదివే సమయం: 4 నిమిషాలు

(హెచ్చరిక: కలచివేసే అంశాలున్నాయి)

ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా మాచర్లకు చెందిన యువతి చౌడమ్మ మృతి కేసు స్థానికంగా అలజడి రేపింది.

"ఇంట్లో నుంచి వెళ్లిపోయి తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్న కూతురిని 'మాట్లాడుకుందాం' అంటూ ఇంటికి తీసుకొచ్చి, కన్నతండ్రే హత్య చేశారు" అని మాచర్ల పోలీసులు బీబీసీకి తెలిపారు.

ఈ కేసులో నిందితులకు సహకరించారన్న ఆరోపణలతో మాచర్ల పట్టణ సీఐ వెంకట రమణను సస్పెండ్‌ చేసినట్లు పల్నాడు జిల్లా అడిషనల్‌ ఎస్పీ సంతోష్‌ బీబీసీకి వెల్లడించారు.

అసలు ఈ కేసులో ఏం జరిగింది? కన్నకూతురిని తండ్రే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారా? ఈ కేసులో పోలీసులపై వచ్చిన ఆరోపణలేంటి?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఈ కేసు గురించి విచారణాధికారి, మాచర్ల రూరల్‌ సీఐ నఫీజ్‌ బాషా‌తో బీబీసీ మాట్లాడింది. ఆయన తెలిపిన వివరాల ప్రకారం..

"మాచర్ల పట్టణానికి చెందిన కామనబోయిన చౌడమ్మ, నాగరాజు ప్రేమించుకున్నారు, ఇద్దరూ యాదవ సామాజికవర్గానికి చెందిన వారు, పైగా మేజర్లు కావడంతో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

అయితే, ఆర్థికంగా తమ కంటే తక్కువ స్థాయిలో ఉన్న నాగరాజుకి కుమార్తెనిచ్చి పెళ్లి చేయడానికి చౌడమ్మ తండ్రి శ్రీనివాసరావు అలియాస్‌ చంద్ర శ్రీను ఇష్టపడలేదు.

దీంతో చౌడమ్మ మార్చి 4న ఇంట్లో నుంచి వెళ్లిపోయి, మార్చి 13న గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఓ గుడిలో నాగరాజును పెళ్లి చేసుకున్నారు" అని సీఐ నఫీజ్‌ బాషా తెలిపారు.

తండ్రి ఫిర్యాదుతో బలవంతంగా స్టేషన్‌కి తీసుకొచ్చి..

ఈ నేపథ్యంలో, తన కుమార్తె కనిపించడం లేదని, అలానే ఇంట్లో విలువైన బంగారు ఆభరణాలూ కనిపించడం లేదంటూ చౌడమ్మ తండ్రి శ్రీనివాసరావు మార్చి 5న మాచర్ల టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

పెళ్లి చేసుకుని నరసరావుపేటలో ఉంటున్న చౌడమ్మ, నాగరాజు దంపతుల వద్దకు మార్చి 14న సీఐ వెంకటరమణ వెళ్లారు.

"మీపై కేసు ఉంది, మాచర్ల టౌన్ స్టేషన్‌కు రావాలని సీఐ చెప్పగా... తాము మేజర్లమనీ, ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నట్లు చౌడమ్మ బదులిచ్చింది. అయినా సరే ఒత్తిడి చేయడంతో మార్చి 14 రాత్రి మాచర్ల టౌన్‌ స్టేషన్‌కి వచ్చాం " అని చౌడమ్మ భర్త నాగరాజు బీబీసీకి తెలిపారు.

"ఆ రాత్రంతా స్టేషన్‌లోనే ఉన్నాం. మరుసటి రోజు 15న సీఐ వెంకటరమణ, చౌడమ్మ తండ్రి శ్రీనివాసరావు మాపై ఒత్తిడి చేశారు. చౌడమ్మను ఇంటికి తిరిగి రావాలని, ఇద్దరికీ అందరి సమక్షంలో పెళ్లి చేస్తామని చెప్పారు.

అందుకు చౌడమ్మ అంగీకరించలేదు. ఇంటి నుంచి ఏమీ తీసుకెళ్లకుండానే కూతురు బంగారం తీసుకెళ్లిందని పోలీసులకు ఫిర్యాదు చేసిన తండ్రిని ఎలా నమ్మాలని, తాను వెళ్లనని చెప్పింది. కేవలం నాలుగు రోజులుండి, తిరిగి 19న నాగరాజు వద్దకు వెళ్లిపోవచ్చని సీఐ ఒత్తిడి చేయడంతో 15వ తేదీ రాత్రి, తప్పని స్థితిలో వెళ్లింది'' అని నాగరాజు బీబీసీకి వెల్లడించారు.

ఈ విషయంలో శ్రీనివాసరావు నుంచి సీఐ వెంకటరమణ డబ్బులు తీసుకుని, ఆమెను అప్పగించినట్టు వచ్చిన ఆరోపణలపై విచారణ చేస్తున్నామని పల్నాడు జిల్లా అడిషనల్‌ ఎస్పీ సంతోష్‌ బీబీసీకి తెలిపారు.

మాచర్ల పరువు హత్య కేసు, పల్నాడు, ఆంధ్రప్రదేశ్

ఫొటో సోర్స్, Kiran, Macherla

కూతురిని హత్య చేసినట్లు విచారణలో తేలింది: పోలీసులు

ఇంటికి వచ్చిన చౌడమ్మ ఈనెల 18న ఆత్మహత్య చేసుకున్నట్టు ఆమె తండ్రి శ్రీనివాసరావు మాచర్ల టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లోనే ఫిర్యాదు చేశారు. ఈ మేరకు టౌన్‌ పోలీసులు చౌడమ్మది తొలుత ఆత్మహత్యగా, ఆ తర్వాత అసహజ మరణంగా కేసు నమోదు చేశారు.

అయితే, చౌడమ్మ మరణంపై అనుమానాలు వ్యక్తం కావడంతో పాటు పోలీసులపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. దీంతో శ్రీనివాసరావుని అదుపులోకి తీసుకుని విచారించగా, హత్య విషయం వెలుగులోకి వచ్చినట్లు మాచర్ల టౌన్‌ పోలీసులు బీబీసీకి తెలిపారు.

"ఇంటికి వెళ్లినప్పటి నుంచి శ్రీనివాసరావు తన కూతుర్ని ఇబ్బంది పెట్టారు. 19వ తేదీన భర్త వద్దకు వెళ్లిపోవాల్సి ఉండగా.. 18న ఇంట్లో ఎవరూ లేని సమయంలో శ్రీనివాసరావు దిండుతో ఊపిరాడకుండా చేసి తన కూతుర్ని హత్య చేసినట్లు విచారణలో తేలింది" అని పోలీసులు చెప్పారు.

శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నామని, ఆయనకు ఎవరైనా సహకరించారా? అనే కోణంలోనూ విచారణ చేస్తున్నట్లు ఈ కేసును దర్యాప్తు చేస్తున్న మాచర్ల రూరల్‌ సీఐ నఫీజ్‌ బాషా బీబీసీకి తెలిపారు.

సోమవారం సాయంత్రం ఈ ఘటనపై పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.

టౌన్‌ సీఐ వెంకట రమణ, మాచర్ల

ఫొటో సోర్స్, Kiran, Macherla

ఫొటో క్యాప్షన్, సస్పెండైన మాచర్ల టౌన్‌ సీఐ వెంకట రమణ

సీఐ సస్పెన్షన్‌..

పెళ్లి చేసుకుని వచ్చిన దంపతులను విడదీసి, చౌడమ్మను ఒంటరిగా ఇంటికి పంపించడంతో పాటు, ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు పక్కాగా విచారణ చేపట్టకుండా హత్య కేసును అసహజ మరణంగా నమోదు చేసిన టౌన్‌ సీఐ వెంకట రమణను ఏప్రిల్‌ 4న సస్పెండ్‌ చేసినట్లు పల్నాడు జిల్లా అడిషనల్‌ ఎస్పీ సంతోష్‌ బీబీసీకి తెలిపారు.

"డబ్బులు తీసుకుని సీఐ అలా చేశారని, కొందరిని ఇబ్బంది పెట్టారనే ఆరోపణలున్నాయి, వాటిపై కూడా విచారణ చేస్తున్నాం" అన్నారాయన.

ఈ విషయమై సీఐ వెంకటరమణతో మాట్లాడేందుకు బీబీసీ యత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.

'అన్యాయం చేశారు'

నమ్మి పుట్టింటికి వెళ్లిన తన భార్యను చంపేసి అన్యాయం చేశారని, దీనిపై ఇప్పుడు మాట్లాడి ఏం ప్రయోజనమని చౌడమ్మ భర్త నాగరాజు బీబీసీతో అన్నారు.

చౌడమ్మ తనతో వచ్చిన రోజు మొదలు.. తన తల్లిదండ్రులు, బంధువులు, సన్నిహితులను పోలీసులు అదుపులోకి తీసుకుని టార్చర్‌ పెట్టారని ఆరోపించారు. తన వైపు ఎవరూ నిలబడకుండా ఒంటరిని చేసి చౌడమ్మను చంపేశారని, తన జీవితం నాశనమైపోయిందని, ఈ విషయమై ఇక ఎవరితో మాట్లాడటం కూడా ఇష్టం లేదని ఆయన వ్యాఖ్యానించారు.

కాగా, ఈ విషయమై చౌడమ్మ తల్లి, బంధువులతో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించింది. కానీ, వారు అందుబాటులోకి రాలేదు.

నిందితుడు శ్రీనివాసరావు, ఆయన తరపు దగ్గరి బంధువులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో వారూ అందుబాటులోకి రాలేదు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)