మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు మృతి

ఫొటో సోర్స్, Janasena
- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 4 నిమిషాలు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు బుధవారం ఉదయం మరణించారు.
భాస్కరరావు వయసు 90 ఏళ్లు. ఆయన వృద్ధాప్య సమస్యలతో చికిత్స పొందుతూ మరణించినట్లు జనసేన పార్టీ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. హైదరాబాద్ పంజాగుట్ట స్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు ప్రకటించారు.
ప్రజలసందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని జూబ్లీహిల్స్ నివాసంలో ఉంచారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో నాదెండ్ల భాస్కర రావు పేరు ప్రముఖమైనది. ఆయన కేవలం నెల రోజుల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు.
భాస్కరరావు పలుమార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా కూడాపనిచేశారు. ఆయన కుమారుడు మనోహర్ ప్రస్తుతం జనసేన తరపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ఉన్నారు.
భాస్కర రావు న్యాయశాస్త్రం చదువుకున్నారు. అనంతరం రాజకీయాల్లోకి వచ్చారు. విజయవాడ నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు.


ఫొటో సోర్స్, facebook/TDP.Official
ఎన్‌టీఆర్‌తో కలిసి...
ఎన్‌టీఆర్‌తో చేయికలిపి 1982లో తెలుగుదేశం పార్టీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. ఎన్‌టీఆర్‌కు అనేక విషయాల్లో సలహాదారుగా కూడా ఉండేవారని సన్నిహితులు చెబుతారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 1984లో ఎన్‌టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలుగుదేశంలో చీలిక తెచ్చి, కాంగ్రెస్‌పార్టీ మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు. 1984 ఆగస్టు 16 నుంచి భాస్కరరావు నెలరోజులపాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు. తదుపరి రాజీనామా చేశారు.
తెలుగుదేశం పార్టీ స్థాపనలో తనది కీలక పాత్ర అని నాదెండ్ల తరచూ చెప్పుకునేవారు. కారణాలు ఏమైనా, ఎన్‌టీఆర్ 1984 ఆగస్టులో చికిత్స కోసం అమెరికా వెళ్లిన సమయంలో తెలుగుదేశం నుంచి కొందరు ఎమ్మెల్యేలను చీల్చి, కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఆయనముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.
చికిత్స తరువాత తిరిగి వచ్చిన ఎన్‌టీఆర్ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దేశవ్యాప్తంగా అనేక రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు ఎన్‌టీఆర్ కు మద్దతుగా నిలిచాయి. ఈ పరిణామాలతో కేంద్రం గవర్నర్‌ను మార్చింది. భాస్కరరావుకు తగినంత మంది ఎమ్మెల్యేలు మద్దతు లేకపోవడంతో, కొత్త గవర్నర్ తిరిగి ఎన్‌టీఆర్‌తోనే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. నాదెండ్ల ను తెలుగుదేశం నుంచి తొలగించారు.

ఫొటో సోర్స్, janasena/nadendlabaskararao fb
ప్రజాస్వామ్య తెలుగుదేశం ఏర్పాటు
తెలుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చాక, ఆయన ప్రజాస్వామిక తెలుగుదేశం పార్టీ ప్రారంభించారు. కానీ ఎన్నికల్లో ఓడిపోయారు. తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరి, సుదీర్ఘ కాలంకొనసాగారు. 1998లో కాంగ్రెస్ పార్టీ తరపున ఖమ్మం ఎంపీగా గెలిచారు.
వాకింగ్ విత్ డెస్టినీ పేరుతో భాస్కరరావు ఆత్మకథ రాసుకున్నారు. ఆయన జీవితం మలిదశలో కూడా పలు ఇంటర్వ్యూలలో ఎన్టీఆర్‌పై ఘాటైన విమర్శలు చేసేవారు భాస్కరరావు 2019లో బీజేపీలో చేరారు.
''నాదెండ్ల భాస్కర రావు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న వారిలో, పార్టీని ప్రారంభించినవారిలో ఒకరు. పార్టీ నిర్మాణంలో దోహదం చేశారు. యన్టీఆర్ ప్రజాకర్షణ ఒక కోణం అయితే, నాదెండ్ల పార్టీ నిర్మాణంలో భాగస్వామి అయింది కూడా ముఖ్యమే. అయితే తరువాత డీవియేషన్స్ వచ్చాయి. రాజకీయాల్లో అందరూ యాంబిషియస్ గా ఉంటారు. ఆయన కూడా ఉండేవారు. అంతకుముందు ఒక రకంగా తెలుగుదేశంలో నంబర్ 2 గానూ ఉన్నారు. ఆ తరువాత జరిగిందంతా తెలిసిందే.'' అని బీబీసీతో చెప్పారు సీనియర్ పాత్రికేయులు భండారు శ్రీనివాస రావు.
''నాదెండ్ల ముఖ్యమంత్రిగా రాజీనామా చేసే సమయంలో కూడా ఏ హడావుడీ లేకుండా చాలా సాధారణంగా రాజ్ భవన్ కి వచ్చి వెళ్లిపోయాకే ఆయన రాజీనామా ఇచ్చారని తెలిసింది. ఆ తరువాత బర్కత్ పురాలో ఒక భవనంలో సొంత పార్టీ నడిపించారు కానీ గెలవలేకపోయారు. తక్కువ సమంయలో ఎంత వివాదాలకు కేంద్రం అయ్యారో, తదనంతర కాలంలో, చాలా కాలంపాటు అంత వివాదరహితుడుగా ఉండిపోయారు'' అని భాస్కర రావు గురించి సీనియర్ పాత్రికేయులు భండారు శ్రీనివాస రావు గుర్తు చేసుకున్నారు.
భాస్కర రావు తన ఆత్మకథలో రాసుకున్న వివరాల ప్రకారం, ఆయనకు ఇద్దరు కుమారులు. మురళీధర్, మనోహర్. ఆయన భార్య పేరు లలిత. వారి వివాహం సత్యసాయి సమక్షంలో జరిగింది.హైదరాబాద్ లోని వివేక వర్ధిని కాలేజీలో భాస్కరరావు బీఏ చదివారు. ఆపై న్యాయశాస్త్రం చదివారు.
1935 జూన్ 23న గుంటూరులో భాస్కర రావు జన్మించారు. ఆయన సొంతూరు కొల్లూరు మండలం దోనెపూడి.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

































