ట్రంప్ ప్రకటనలు : ముసురుకుంటున్న ‘ఇన్‌సైడర్ ట్రేడింగ్ ’ అనుమానాలు
ఫొటో సోర్స్, Bloomberg via Getty Image
- రచయిత, నిక్ మార్ష్
- హోదా, బిజినెస్ రిపోర్టర్
- చదివే సమయం: 6 నిమిషాలు
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏదైనా కీలక ప్రకటన చేయడానికి కొద్దిసేపటి ముందే ట్రేడర్లు లక్షల డాలర్లు పెట్టుబడులు పెడుతూ వచ్చారు.
ఈమేరకు బీబీసీ పలు ఆర్థిక మార్కెట్లలో ట్రేడింగ్ పరిమాణాల డేటాను పరిశీలించింది. వాటిలో కొన్నింటినీ మార్కెట్లను ప్రభావితం చేసిన అధ్యక్షుడి కీలక ప్రకటనలతో సరిపోల్చింది.
అధ్యక్షుడి సోషల్ మీడియా పోస్టు లేదా మీడియా ఇంటర్వ్యూ బయటకు రావడానికి కొన్ని గంటలు, కొన్నిసార్లు నిమిషాల ముందు ట్రేడింగ్ ఒక్కసారిగా పెరుగుతున్న ఓ స్థిరమైన సరళిని బీబీసీ గుర్తించింది.
కొంతమంది విశ్లేషకులు, ఇది సాధారణ ప్రజలకు అందుబాటులో లేని సమాచారంపై ఆధారపడి పెట్టుబడులు పెట్టే అక్రమ ఇన్‌సైడర్ లక్షణాలు చూపుతోందంటున్నారు.
అధ్యక్షుడి చర్యలను ముందుగానే అంచనా వేయడంలో కొంతమంది ట్రేడర్లు ఆరితేరారని మరికొందరు చెబుతున్నారు.
దీనికి సంబంధించి ఓ ఐదు ముఖ్యమైన ఉదాహరణలు ఇక్కడ చూద్దాం.
9 మార్చి 2026: 'యుద్ధం దాదాపుగా పూర్తయింది'
ఇరాన్‌తో అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం మొదలైన 9 రోజుల తర్వాత, 'ఈ యుద్ధం దాదాపుగా ముగిసినట్లే' అని సీబీఎస్ న్యూస్‌కు ఫోన్ ద్వారా ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ చెప్పారు.
ఆ సమయంలో ఫ్యూచర్స్ మార్కెట్‌లో చమురు లావాదేవీల్లో కొన్ని భారీ మార్పులు నమోదయ్యాయి.
18:29 జీఎంటీ: చమురుపై భారీగా పెట్టుబడులు
19:16 జీఎంటీ: యుద్ధం దాదాపు ముగిసిందంటూ ట్రంప్ ప్రకటన
19:17 జీఎంటీ: చమురు ధరల్లో 25 శాతం క్షీణత
ఈ ఇంటర్వ్యూ వివరాలను సదరు రిపోర్టర్ ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా, ఈ విషయం ప్రజలందరికీ 19:16 జీఎంటీ గంటలకు తెలిసింది.
ఈ యుద్ధం ఊహించినదానికంటే చాలా ముందే ముగియవచ్చన్న వార్తకు ఆయిల్ ట్రేడర్లు స్పందించి చమురు విక్రయాలు ప్రారంభించడంతో ధరలు దాదాపు 25 శాతం పడిపోయాయి.
అయితే, రిపోర్టర్ ఈ ట్వీట్ చేయడానికి ముందే, దాదాపు 47 నిమిషాల పాటు చమురు ధరలు తగ్గుతాయనే అంచనాతో భారీగా పెట్టుబడులు పెట్టినట్టు మార్కెట్ డేటా సూచిస్తోంది. అంటే 18:29 జీఎంటీ గంటలకే భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తోంది.
చమురు ధరల మార్పులతో ఆ పెట్టుబడులు పెట్టిన ట్రేడర్లు మిలియన్ల కొద్దీ డాలర్లను ఆర్జించి ఉంటారు.
23 మార్చి 2026: 'శత్రుత్వానికి సంపూర్ణ ముగింపు’
ఇరాన్ పవర్ ప్లాంట్లను 'ధ్వంసం చేస్తామని' బెదిరించిన రెండు రోజులకే ట్రంప్ మార్చి 23న మరో ప్రకటన చేశారు.
'అమెరికా, ఇరాన్ మధ్య గత రెండు రోజులుగా అత్యంత సానుకూల, ఫలప్రదమైన చర్చలు జరిగాయని తెలియజేయడానికి సంతోషిస్తున్నా. మధ్యప్రాచ్యంలో మా మధ్య ఉన్న శత్రుత్వానికి పూర్తి, సంపూర్ణ పరిష్కారం కనుగొనే దిశగా ఈ చర్చలు సాగాయి' అని ట్రూత్ సోషల్‌లో ట్రంప్ పోస్ట్ చేశారు.
ట్రంప్ చేసిన పోస్టు దౌత్యవేత్తలకు, ట్రేడర్లకు ఆశ్చర్యాన్ని కలిగించింది.
10:48-10:50 జీఎంటీ: చమురుపై పెట్టుబడులు ఒక్కసారిగా పెరిగాయి.
11:04 జీఎంటీ: శత్రుత్వానికి పూర్తి పరిష్కారం దిశగా చర్చలు అంటూ ట్రంప్ పోస్ట్ చేశారు.
11:05 జీఎంటీ: చమురు ధరలు 11 శాతం పడిపోయాయి
వెంటనే స్టాక్ మార్కెట్లు ఊపందుకున్నాయి. అప్పటివరకు పెరుగుతూ పోయిన అమెరికా చమురు ధర ఒక్కసారిగా పడిపోయింది.
ట్రంప్ పోస్ట్ చేయడానికి 14 నిమిషాల ముందు అమెరికా చమురు ధరలపై అసాధారణంగా పెట్టుబడులు పెట్టారని అప్పట్లో బీబీసీ రిపోర్ట్ చేసింది.
ఇదే ధోరణి బ్రెంట్ ముడి చమురు ట్రేడింగ్‌లో కూడా కనిపించింది.
‘‘ఇది నిస్సందేహంగా అసాధారణంగా ఉంది’’ అని ఓ చమురు నిపుణుడు అప్పుడే బీబీసీకి చెప్పారు.
9 ఏప్రిల్ 2025: 'లిబరేషన్ డే' విరామం
మధ్యప్రాచ్యంలో ఈ యుద్ధం సమయంలోనే కాకుండా, ఇతర సందర్భాల్లోనూ మరికొన్ని ట్రేడింగ్ కార్యకలాపాలు అనుమానాలు రేకెత్తించాయి.
ట్రంప్ నిరుడు ఏప్రిల్ 2న అమెరికాకు లిబరేషన్ డే అంటూ ప్రపంచంలోని అన్ని దేశాల వస్తువులపై భారీ సుంకాలను విధించారు.
దీంతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి.
కానీ, ఒక వారం తర్వాత ట్రంప్ మరో ప్రకటన చేశారు. చైనాకు తప్పా మిగతా అన్ని దేశాలకు ఈ సుంకాల నుంచి 90 రోజుల 'విరామం' ఇస్తున్నట్లు ట్రంప్ ప్రకటించగానే స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి. ఎస్ అండ్ పీ ఇండెక్స్ సూచీ ఒక్కరోజులోనే 9.5 శాతం పెరిగింది. ఇది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్ద రోజువారీ పెరుగుదలల్లో ఒకటి.
18:00 బీఎస్‌టీ: స్టాక్ మార్కెట్ పుంజుకుంటుందంటూ పెట్టుబడులు ప్రారంభం
18:18 బీఎస్‌టీ: టారిఫ్‌లకు కాస్త విరామం ఇస్తున్నట్లుగా ట్రంప్ ప్రకటన
18:19 బీఎస్‌టీ: స్టాక్ మార్కెట్లలో చరిత్రాత్మక పెరుగుదల ప్రారంభం
ఈ ప్రకటనకు ముందే ట్రేడింగ్ అసాధారణంగా జరిగింది.
అంతకుముందు రోజు ఓ ఫండ్‌లో వందల్లో ఉన్న కాంట్రాక్టులు ఆ రోజున మాత్రం నిమిషానికి పదివేల కాంట్రాక్టులు ట్రేడయ్యాయి.
కొంతమంది ట్రేడర్లు 2 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ పెట్టి, దాదాపు 20 మిలియన్ డాలర్ల లాభం పొందారు.
అధ్యక్షుడి ప్రకటనలు, అమెరికా ప్రజల ప్రయోజనాలను పణంగా పెడుతూ ఆయన స్నేహితులను, అడ్మినిస్ట్రేషన్‌లోని సన్నిహితులను సంపన్నులుగా మార్చుతున్నాయా అనే కోణంలో దర్యాప్తు చేయాలంటూ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌చేంజ్ కమిషన్ (ఎస్‌ఈసీ)కి అమెరికా సెనెట్‌లోని పలువురు సీనియర్ డెమోక్రాట్లు ఆ వారం చివర్లో ఒక లేఖ రాశారు.
ఎస్‌ఈసీ ఈ ఆరోపణలను పరిశీలించిందా? అని బీబీసీ ప్రశ్నించినప్పుడు ఎస్‌ఈసీ ప్రతినిధి స్పందించడానికి నిరాకరించారు.
ఈ కథనంలో పేర్కొన్న అసాధారణ ట్రేడింగ్ కార్యకలాపాలపై స్పందించాల్సిందిగా కోరినప్పటికీ వైట్‌హౌస్ కూడా స్పందించలేదు.
ఫొటో సోర్స్, Reuters
3 జనవరి 2026: అమెరికా అదుపులోకి మదురో
డిసెంబర్ 2025: బర్డెన్‌సమ్-మిక్స్ పేరుతో అకౌంట్ ఏర్పాటు
2 జనవరి 2025: మదురో పదవీచ్యుతుడు అవుతాడంటూ ఈ అకౌంట్‌లో 32,000 డాలర్ల పెట్టుబడి
3 జనవరి 2026: అమెరికా అదుపులోకి మదురో, 436,000 డాలర్లు ఆర్జించిన బర్డెన్‌సమ్-మిక్స్ ఖాతా
ఆన్‌లైన్ ప్రెడిక్షన్స్ మార్కెట్లు ఇటీవల కాలంలో సాధించిన వృద్ధి పరిశీలకుల దృష్టిని ఆకర్షించింది.
పాలీమార్కెట్, కల్షీ వంటి బ్లాక్‌చెయిన్ ఆధారిత ప్లాట్‌ఫారమ్‌లు యూజర్లకు వాతావరణ వివరాల నుంచి అమెరికా విదేశాంగ విధానం వరకు ఇలా ప్రతీదాని గురించి ఊహాగానాలు చేసే అవకాశాన్ని కల్పిస్తాయి.
అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ కుమారుడు డోనల్డ్ ట్రంప్ జూనియర్ ఈ పాలీమార్కెట్‌లో ఇన్వెస్టర్. అడ్వైజరీ బోర్డులో సభ్యుడు కూడా. కల్షీ ప్లాట్‌ఫారానికి వ్యూహాత్మక సలహాదారుగానూ వ్యవహరిస్తారు. వీటి గురించి స్పందన కోసం బీబీసీ ఆయనను సంప్రదించింది.
ఒక యూజర్ 2025 డిసెంబర్‌లో పాలీమార్కెట్‌లో బర్డెన్‌సమ్-మిక్స్ పేరిట ఒక అకౌంట్ రూపొందించారు. 2026 జనవరి చివరికల్లా వెనెజ్వెలా అధ్యక్షుడు నికోలస్ మదురో పదవీచ్యుతుడు అవుతాడంటూ ఆ అకౌంట్ నుంచి డిసెంబర్ 30న తొలి బెట్ వచ్చింది.
ఇదే విషయంపై డిసెంబర్ 30 నుంచి జనవరి 2 మధ్య మొత్తం 32,500 డాలర్ల పందెం కాసింది.
మదురోను అమెరికా దళాలు అదుపులోకి తీసుకొని, తర్వాతి రోజు ఆయన పదవీచ్యుతుడు అయ్యాక ఈ అకౌంట్ 436,000 డాలర్లు గెలుచుకుంది.
ఆ తర్వాత కొద్దిసేపటికే, ఆ అకౌంట్ యూజర్‌నేమ్ మారింది. మళ్లీ దాన్నుంచి ఎలాంటి బెట్ రాలేదు.
28 ఫిబ్రవరి: ఇరాన్‌పై దాడులు
ఫిబ్రవరి 2026: పాలీమార్కెట్‌లో ఆరు ఖాతాల సృష్టి
28 ఫిబ్రవరి: ఖాతాదారులంతా కలిసి 1.2 మిలియన్ డాలర్లు గెలుచుకున్నారు
పాలీమార్కెట్ ప్లాట్‌ఫారమ్‌పై ఫిబ్రవరిలో ఆరు ఖాతాలు పుట్టుకొచ్చాయని బ్లాక్‌చెయిన్ అనాలిసిస్ వెబ్‌సైట్ బబుల్‌మ్యాప్స్ తెలిపింది.
వారంతా, ఫిబ్రవరి 28లోగా ఇరాన్‌పై అమెరికా దాడి చేస్తుందంటూ పందేలు వేశారు. అదే రోజు తెల్లవారుజామున ఈ దాడులను అమెరికా అధ్యక్షుడు ధ్రువీకరించడంతో ఆ ఖాతాలన్నీ కలిసి 1.2మిలియన్ డాలర్లు సంపాదించాయి.
ఆ ఆరుగురిలో అయిదుగురు యూజర్లు మళ్లీ ఇప్పటివరకు ఇంకో పందెం కాయలేదు. కానీ, ఒక యూజర్ మాత్రం, ఏప్రిల్ 7 నాటికి అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ జరుగుతుందంటూ పందెం కాసి 1,63,000 డాలర్లు సంపాదించినట్లు ఆ ఖాతాలోని వివరాల ద్వారా తెలుస్తోంది.
కాల్పుల విరమణ గురించి అమెరికా, ఇరాన్ ఏప్రిల్ 7న ప్రకటించాయి.
తాము మార్కెట్ సమగ్రతను కాపాడతామని, నియంత్రణ సంస్థలతో కలిసి పనిచేస్తామని బీబీసీకి పాలీమార్కెట్ తెలిపింది.
ఇన్‌సైడర్ ట్రేడింగ్‌ను అరికట్టడానికి పాలీమార్కెట్, కల్షి సంయుక్తంగా కొత్త నిబంధనలను రూపొందించాయి.
ఈ ప్రెడిక్షన్ మార్కెట్లు, కమోడిటీ ఫ్యూచర్స్ ట్రేడింగ్ కమిషన్ (సీఎఫ్‌టీసీ) పరిధిలోకి వస్తాయి.
ఇన్‌సైడర్ ట్రేడింగ్, మోసాలను తాము ఎంతమాత్రం సహించబోమని ఈ సంస్థ చైర్మన్ ఇటీవల అన్నారు.
అంతర్గత సమాచారాన్ని ప్రెడిక్షన్ మార్కెట్లలో బెట్లు వేయడానికి ఉపయోగించొద్దని హెచ్చరిస్తూ తమ సిబ్బందికి వైట్‌హౌస్ గత నెలలో ఒక ఇంటర్నల్ మెయిల్ పంపినట్లు తెలిసింది.
ఫొటో సోర్స్, Getty Images
నిరూపించడం కష్టం
అమెరికాలో 1933లో సెక్యూరిటీస్ చట్టం ఆమోదం పొందినప్పటి నుంచి ఇన్‌సైడర్ ట్రేడింగ్ చట్టవిరుద్ధ చర్యగా మారింది.
అమెరికా ప్రభుత్వ అధికారులకు కూడా 2012లో దీన్ని వర్తింపచేశారు. కానీ ఇప్పటివరకు ఈ చట్టం కింద ఎవరిపైనా విచారణ జరగలేదు.
ఈ నిబంధనలను అమలు చేయడం చాలా కష్టమని ఈఎస్‌ఎస్‌ఈసీ బిజినెస్ స్కూల్‌కు చెందిన ప్రొఫెసర్, ఫైనాన్షియల్ రెగ్యులేషన్ లా నిపుణుడు పాల్ ఔడిన్ అన్నారు.
'సమాచారాన్ని లీక్ చేసిన వ్యక్తి ఎవరో కనిపెట్టలేనంతవరకు, ఫైనాన్షియల్ సంస్థలు ఎవరినీ విచారించలేవు. ట్రంప్ ఏం ప్రకటించబోతున్నారో ఎవరో ఒకరికి ముందే తెలుసని మార్కెట్‌లో జరుగుతున్న భారీ లావాదేవీలను చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. అయినప్పటికీ, ఎవరిపై అభియోగాలు నమోదయ్యే అవకాశం లేదనే చెప్పొచ్చు' అని ఆయన వివరించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
ముఖ్యమైన కథనాలు
ఫీచర్లు
పాపులర్
కంటెంట్ అందుబాటులో లేదు