పాకిస్తాన్‌లో అమెరికా, ఇరాన్ మధ్య రెండో విడత చర్చలు జరగనున్నాయా?

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల పరిష్కారానికి పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ ఇప్పుడు ప్రధాన వేదికగా మారింది. హార్ముజ్ జలసంధిలో కాల్పుల కలకలం రేగిన కొన్ని గంటల్లోనే ఇస్లామాబాద్ అసాధారణ ఆంక్షలతో హైఅలర్ట్‌లోకి వెళ్లిపోయింది.
పాకిస్తాన్‌లో జరుగుతున్న ఏర్పాట్లను బట్టి మరోసారి చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.
అంతేకాదు, ఇస్లామాబాద్, రావల్పిండి పరిసర ప్రాంతాల్లో తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ప్రజా రవాణా, సరకు రవాణాపై పోలీసులు ఆంక్షలు సైతం విధించారు.
ఇస్లామాబాద్‌లోని ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్ 'మారియట్' యాజమాన్యం తమ అతిథులను ఆదివారం మధ్యాహ్నం 3 గంటల లోపు హోటల్ ఖాళీ చేయాలని ఆదేశించినట్లు బీబీసీ ఉర్దూ రిపోర్టు చేసింది.
ఇదే సమయంలో చర్చలపై అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ నుంచి కీలక ప్రకటన వచ్చింది.


ఫొటో సోర్స్, Getty Images
మా ప్రతినిధులు వస్తున్నారు: డోనల్డ్ ట్రంప్
ఇరాన్‌తో చర్చలు జరిపేందుకు అమెరికా ప్రతినిధులు పాకిస్తాన్ వెళ్తున్నట్లు డోనల్డ్ ట్రంప్ వెల్లడించారు.
డోనల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్ పోస్ట్‌లో .. "నా ప్రతినిధులు పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వెళ్తున్నారు. చర్చల కోసం వారు రేపు సాయంత్రానికి అక్కడికి చేరుకుంటారు" అని తెలిపారు.
అంతేకాకుండా, "మేం ఎంతో సరైన, సహేతుకమైన ఒప్పందాన్ని ప్రతిపాదిస్తున్నాం. వారు దీనిని అంగీకరిస్తారని ఆశిస్తున్నాను. ఒకవేళ ఒప్పుకోకపోతే.. ఇరాన్‌లోని ప్రతి పవర్ ప్లాంట్‌ను, ప్రతి వంతెనను అమెరికా ధ్వంసం చేస్తుంది" అని ట్రంప్ హెచ్చరించారు.
బీబీసీ పర్షియన్ సర్వీస్ కథనం ప్రకారం.. యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్, అమెరికా రెండూ చర్చలకు సిద్ధంగా ఉన్నాయని తుర్కియే విదేశాంగ మంత్రి హకాన్ ఫిదాన్ తెలిపారు. అయితే, చర్చలపై ఇరాన్ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు.
మరోవైపు, ఇస్లామాబాద్ చర్చలు విఫలమైతే ఇకపై ఎలాంటి ఉదాసీనత ఉండబోదని ట్రంప్ తన సోషల్ మీడియా పోస్టులో హెచ్చరించారు. ఇరాన్ వంతెనలు, పవర్ ప్లాంట్లు చాలా త్వరగా, సులభంగా నేలమట్టం అవుతాయని ఆయన రాశారు.
శనివారం హార్ముజ్ జలసంధిలో జరిగిన కాల్పుల ఘటనను ట్రంప్ ప్రస్తావిస్తూ.. ఇరాన్ 'కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని' ఆరోపించారు.
"ఇది మంచి పద్ధతి కాదు కదా? ఫ్రాన్స్ నౌక, బ్రిటన్ నౌకను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపినట్లు ఇరాన్ చెబుతోంది" అని ట్రంప్ చెప్పారు.
హార్ముజ్ జలసంధిని మూసివేయాలని ఇరాన్ తీసుకున్న నిర్ణయం 'వింత'గా ఉందని, ఎందుకంటే అమెరికా దిగ్బంధం వల్ల జలసంధి ఇప్పటికే మూతపడిందని తెలిపారు. దీనివల్ల ఇరాన్‌కే రోజుకు 500 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతుందని, అమెరికాకు ఎలాంటి నష్టం లేదని ట్రంప్ తెలిపారు.
మరోవైపు, ఇరాన్ రేవులపై నౌకాదళ దిగ్బంధం విధించడం ద్వారా అమెరికానే కాల్పుల విరమణ నిబంధనలను ఉల్లంఘిస్తోందని ఇరాన్ ఆరోపిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
ఇస్లామాబాద్ హోటల్స్ ఖాళీ
బీబీసీ ఉర్దూ కథనం ప్రకారం.. ఇస్లామాబాద్‌లోని ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్ 'మారియట్' యాజమాన్యం తమ అతిథులను ఖాళీ చేయాలని కోరింది.
మారియట్ హోటల్ యాజమాన్యం జారీ చేసిన నోటీసులో "ప్రభుత్వం ఒక ముఖ్యమైన కార్యక్రమం కోసం ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి హోటల్ మొత్తాన్ని బుక్ చేసుకుంది. కాబట్టి, అతిథులందరూ మధ్యాహ్నం 3 గంటల కల్లా హోటల్ ఖాళీ చేయవలసిందిగా కోరుతున్నాం" అని తెలిపింది.
ఈ అసౌకర్యానికి క్షమాపణలు కోరుతూ, అతిథులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో సహకరిస్తామని హోటల్ యాజమాన్యం తెలిపింది.
బీబీసీ ఉర్దూ ప్రకారం.. ఇస్లామాబాద్‌లో రెండో విడత చర్చలపై పాకిస్తాన్ లేదా ఇరాన్ ప్రభుత్వాల నుంచి ఇంకా అధికారిక ధ్రువీకరణ రాలేదు. అయితే, ఒకవేళ ఇస్లామాబాద్‌లో ఒప్పందం కుదిరితే తాను స్వయంగా అక్కడికి వెళ్తానని కొద్దిరోజుల కిందట ట్రంప్ సూచించారు.
అమెరికా - ఇరాన్ చర్చల మొదటి విడతకు ఆతిథ్యమిచ్చిన 'సెరెనా హోటల్' కూడా రాబోయే కొన్ని రోజుల పాటు బుకింగ్‌లను నిలిపివేసింది. బీబీసీ ప్రతినిధి ఆజం ఖాన్ రూమ్ బుకింగ్ కోసం సెరెనా హోటల్‌ను సంప్రదించగా, రాబోయే కొద్ది రోజుల వరకు హోటల్‌లో గదులు అందుబాటులో లేవని అక్కడి సిబ్బంది తెలిపారు.

ఫొటో సోర్స్, @ICT_Police
'కర్ఫ్యూ' వాతావరణం
పాకిస్తాన్‌లోని నూర్ ఖాన్ ఎయిర్‌బేస్ సమీపంలోని హౌసింగ్ సొసైటీలలో ప్రస్తుతం కర్ఫ్యూ తరహా పరిస్థితులు నెలకొన్నాయి. రోడ్లపై భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు.
ఇస్లామాబాద్‌లోకి ప్రవేశించే అన్నిమార్గాల్లో భద్రతా సిబ్బంది చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి నిఘా పెంచారు. పోలీసులతో పాటు సైనిక సిబ్బందిని కూడా మోహరించారు. అలాగే, పంజాబ్ రాష్ట్రం నుంచి అదనంగా పిలిపించిన పోలీసులను కూడా ఇస్లామాబాద్‌లో విధుల్లో ఉంచనున్నారు.
ఐజీ ఆదేశాల మేరకు నగరంలోని వివిధ ప్రాంతాల్లో భారీయెత్తున తనిఖీలు కొనసాగుతున్నాయని ఇస్లామాబాద్ పోలీసు ప్రతినిధి తెలిపారు.
అంతకుముందు శుక్రవారం నాడు, ఫైజాబాద్‌తో సహా నగరంలోని అన్ని బస్ స్టేషన్లు యథావిధిగా తెరిచి ఉన్నాయని, రవాణా సౌకర్యాలు సజావుగా సాగుతున్నాయని పోలీసులు స్పష్టం చేశారు. బస్ స్టేషన్లు మూసివేశారన్న వార్తలను ఖండించారు.
అయితే, మరోవైపు నూర్ ఖాన్ ఎయిర్‌బేస్ సమీపంలోని నివాస ప్రాంతాల ప్రజలు మాత్రం.. అక్కడ కర్ఫ్యూ తరహా వాతావరణం ఉందని, రోడ్లన్నీ పోలీసుల పహారాలో ఉన్నాయని చెబుతున్నారు.
విద్యార్థులకు ఏప్రిల్ 20 నుంచి 24 వరకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహించనున్నట్లు ఇస్లామాబాద్‌లోని అంతర్జాతీయ ఇస్లామిక్ విశ్వవిద్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
మరోవైపు, ఇస్లామాబాద్ ఐజీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టారు. కర్పా, సంబల్, సెక్రటేరియట్, ఖన్నా, ఇండస్ట్రియల్ ఏరియా, బానీ గాలా2, తర్నోల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ ఆపరేషన్లు నిర్వహించారు. ఈ సోదాల సందర్భంగా 20 మంది అఫ్గాన్ పౌరులు, 56 మంది అనుమానిత వ్యక్తులు, పలు వాహనాలను విచారణ నిమిత్తం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

































