ఇరాన్‌లోని పర్వతాల మధ్య దాక్కున్న తమ వైమానిక అధికారిని అమెరికా ఎలా రక్షించిందంటే..
ఫొటో సోర్స్, Reuters
- రచయిత, గాబ్రియేలా పోమెరాయ్
- చదివే సమయం: 5 నిమిషాలు
అమెరికా ఫైటర్ జెట్‌ను ఇరాన్‌లో కూల్చివేసిన తర్వాత.. ఆచూకీ దొరక్కుండా పోయిన వైమానిక అధికారిని అమెరికా సైన్యం అత్యంత ఉత్కంఠభరితమైన ఆపరేషన్‌లో రక్షించింది.
అయితే, ఈ ఆపరేషన్‌కు సంబంధించిన కచ్చితమైన పరిస్థితులు అస్పష్టంగా ఉన్నప్పటికీ, శత్రు భూభాగంలో గ్రౌండ్ ఆపరేషన్ చేసి ఆయన్ను రక్షించడం అత్యంత క్లిష్టంగా సాగింది.
ఈ ఆపరేషన్‌లో సీఐఏతో పాటు డజన్ల కొద్దీ ప్రత్యేక బలగాలు, అమెరికా యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు పాల్గొన్నట్లు అమెరికా మీడియా పేర్కొంది.
''తీవ్రంగా గాయపడిన, చాలా ధైర్యవంతుడైన ఎఫ్-15 సిబ్బంది/అధికారిని పర్వత ప్రాంతం నుంచి మేం కాపాడాం'' అని సోషల్ మీడియాలో అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రకటించారు.
వెపన్ సిస్టమ్స్ ఆఫీసర్, పైలట్‌తో వెళ్తున్న ఎఫ్-15 జెట్‌ను దక్షిణ ఇరాన్‌లో కూల్చివేసినట్లు వార్తలు బయటకు వచ్చిన తరువాత శుక్రవారం నుంచి ఆ వైమానిక సైనిక సిబ్బందికి కష్టాలు మొదలయ్యాయి.
గత 20 ఏళ్లకు పైగా కాలంలో.. శత్రువుల దాడిలో అమెరికాకు చెందిన ఒక ఫైటర్ జెట్ కూలిపోవడం ఇదే తొలిసారి.
ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగిల్ విమానంలో ఉన్న ఇద్దరు అమెరికా సిబ్బంది విమానం నుంచి బయటకు దూకగలిగారు. అదే రోజు ఒక పైలట్‌ను రక్షించారు. ఇంకొకరి ఆచూకీ తెలియలేదు. ఆయన్ను గుర్తించేందుకు అమెరికా వెంటనే రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టింది.
"పైలట్‌ను సజీవంగా పట్టుకోవాలి" అని ఇరాన్ ప్రభుత్వ అనుబంధ చానళ్లు ప్రజలకు విజ్ఞప్తి చేశాయి. దీని కోసం ఇరాన్ బహుమతి కూడా ప్రకటించింది.
50,000 పౌండ్లు (సుమారు రూ. 61 లక్షలు) రివార్డును ప్రకటించింది.
సోషల్ మీడియాలో షేర్ అయిన వీడియోలలో ఆయన కోసం పౌరులు వెతుకుతున్నట్లు కనిపించింది. ఈ వీడియోలను బీబీసీ స్వతంత్రంగా ధ్రువీకరించలేదు.
అధికారి పడిపోయిన తర్వాత.. తనని తాను రక్షించుకునేందుకు ఆయన వద్ద కేవలం ఒక్క హ్యాండ్‌గన్ మాత్రమే ఉందని అమెరికా అధికారులు చెప్పారు.
ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనేలా శిక్షణ పొందారాయన.
ఆ వైమానిక అధికారి ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడంలో శిక్షణ పొంది ఉండొచ్చు.. తన దగ్గర ఉన్న బీకన్ సిగ్నల్‌ను ఆన్ చేయడం, ఎత్తైన ప్రాంతానికి చేరుకోవడం, దాక్కోవడం, సమాచార సంబంధాలను ఏర్పరచుకోవడం వంటివన్నీ అలాంటి శిక్షణలో భాగంగా ఉంటాయి.
అమెరికా మీడియా కథనాల ప్రకారం.. ఆ వైమానిక అధికారి బీకన్ సిగ్నల్స్‌ను ఇరాన్ గుర్తించొచ్చన్న భయంతో బీకన్ వాడటాన్ని తగ్గించారు. కొండ రాళ్ల మధ్య దాక్కున్నారు. అలా ఆయన తనను రక్షించడానికి ఎవరైనా వచ్చేవరకు వేచిచూశారు.
రెస్క్యూ ఆపరేషన్‌లో సీఐఏ కీలక పాత్ర పోషించినట్లు అమెరికా మీడియాతో మాట్లాడిన సీనియర్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అధికారి చెప్పారు.
కొండ రాళ్ల మధ్య ఆ వైమానిక అధికారి ఎక్కడ ఉన్నారనే కచ్చితమైన లొకేషన్ గుర్తించిన అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ.. ఆ వివరాలను పెంటగాన్‌కు పంపించిందని సమాచారం.
రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్న అమెరికా అధికారులు 24 గంటల పాటు ఆయన లొకేషన్‌ను పర్యవేక్షించారని ట్రంప్ తెలిపారు.
''మా అధికారిని శత్రువులు వెంబడించారు. ఇరాన్ సైన్యం ఆయన్ను సమీపిస్తుండటాన్ని ఆయన చూశారు'' అని అధ్యక్షుడు అన్నారు.
కూల్చేసిన జెట్‌కు చెందిన తమ వైమానిక సైనిక సిబ్బందిలో మరొకరిని అమెరికా దళాలు అప్పటికే పట్టుకున్నాయని ఇరాన్‌లో ప్రచారం చేస్తూ.. సీఐఏ ఒక తప్పుడు ప్రచారాన్ని కూడా నడిపించిందని రిపోర్టులు తెలిపాయి.
''ఆయన్ను తిరిగి తీసుకొచ్చేందుకు ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతక ఆయుధాలతో కూడిన డజన్ల కొద్ది విమానాలను అమెరికా సైన్యం పంపింది'' అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్ట్‌లో చెప్పారు.
ఫొటో సోర్స్, EPA/Shutterstock
ఇరాన్ భూభాగంలో చిక్కుకుపోయిన అధికారి కోసం అమెరికా ప్రత్యేక దళాలు వెళ్లే సమయంలో.. ఆయన ఉన్న లొకేషన్ వద్దకు ఇరాన్ బలగాలు రాకుండా చేసేందుకు బాంబులు, ఆయుధాలతో దాడులు జరిపినట్లు రిపోర్టులు తెలిపాయి.
రెస్క్యూ సిబ్బందిని తరలించడానికి ఉద్దేశించిన రెండు రవాణా విమానాలను ఇరాన్ లోపల ఒక మారుమూల ప్రాంతం నుంచి టేకాఫ్ కాలేకపోయాయని, శత్రువుల చేతికి వాటిని చిక్కకుండా చేసేందుకు వాటిని ధ్వంసం చేసినట్లు అమెరికా మీడియా రిపోర్టు చేసింది.
ఆ తర్వాత, సిబ్బందిని తీసుకొచ్చేందుకు మూడు అదనపు విమానాల్లో ప్రత్యేక బలగాలు బయలుదేరాయని రిపోర్టులు పేర్కొన్నాయి.
ఇస్ఫహాన్ నగరానికి ఆగ్నేయంగా 50 కిలోమీటర్ల దూరంలోని సెంట్రల్ ఇరాన్‌లోని ఒక పర్వత ప్రాంతంలో పొగలు గక్కుతున్న విమాన శిథిలాలు కనిపించినట్లు బీబీసీ వెరిఫై చేసిన ఫుటేజీ, పోటోలు ధ్రువీకరించాయి.
దక్షిణ ఇస్ఫాహన్‌లోని ఒక పాడుబడిన విమానాశ్రయంలో ఎస్కేప్ మిషన్ పూర్తిగా విఫలమైందని, ఈ ఆపరేషన్ సమయంలో రెండు అమెరికా సీ-130 మిలటరీ రవాణా విమానాలు, రెండు బ్లాక్ హాక్ హెలికాప్టర్లు ధ్వంసమయ్యాయని ఇరాన్ సైన్యం తెలిపింది.
గల్లంతైన వైమానిక సైనిక సిబ్బందిని గాలిస్తూ ఇస్ఫహాన్ మీదుగా వెళ్తున్న అమెరికా డ్రోన్‌ను ఇస్లామిక్ రివొల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్‌జీసీ) బలగాలు కూల్చేశాయని ఇరాన్ ప్రభుత్వ మీడియా ఆదివారం తెలిపింది.
ఇస్ఫాహన్ సమీపంలో జరిగిన సంఘటనలకు చెందిన రెండు వెర్షన్లను బీబీసీ ధ్రువీకరించలేదు.
అమెరికా కాలమానం ప్రకారం.. అర్ధరాత్రిలోపే ఈ రెస్క్యూ ఆపరేషన్ పూర్తయిందని అధికారులు చెప్పారు. రక్షించిన వైమానిక సైనిక సిబ్బందిని చికిత్స కోసం కువైట్‌కు తరలించినట్లు తెలిపారు. ఈ అధికారి తీవ్రంగా గాయపడ్డారని, కానీ, ఆయన త్వరలోనే కోలుకుంటారని ట్రంప్ చెప్పారు.
ఆయన్ను ఎక్కడి నుంచి రక్షించారనే కచ్చితమైన వివరాలు కానీ, ఆయన వ్యక్తిగత గుర్తింపును కానీ అమెరికా అధికారులు వెల్లడించలేదు.
రెస్క్యూ మిషన్‌కు ఆ సమయం బహుశా పనిచేసి ఉండొచ్చని మాజీ అమెరికా సైనికాధికారి, రిటైర్డ్ అమెరికా నేవీ అడ్మిరల్ విలియం ఫాలన్ బీబీసీతో చెప్పారు. ''మా సిబ్బందికి చీకటి చాలా అనుకూలమైనది. రాత్రిపూట పనిచేయడం వారికి అలవాటు'' అని పేర్కొన్నారు.
గ్రీనిచ్ కాలమానం ప్రకారం ఆదివారం వేకువన 4 గంటలకు కొంచెం ముందు రెండో పైలట్ దొరికిన వార్తను అమెరికా మీడియా వెల్లడించింది.
కాగా.. ‘అమెరికా ఏ ఒక్క అమెరికన్ యోధుడి చేతిని ఎప్పటికీ విడిచిపెట్టదు’ అని సోషల్ మీడియాలో ట్రంప్ రాశారు.
ఫొటో సోర్స్, STATE MEDIA
యూఎస్ ఆపరేషన్ విఫలమైందని ఇరాన్ చెప్పింది. పలు అమెరికా సైనిక విమానాలు అత్యవసరంగా ల్యాండ్ కావాల్సి వచ్చిందని ఇరాన్ ప్రధాన సైనిక కమాండ్ అధికార ప్రతినిధి ఇబ్రహీం జోల్ఫఘరి వీడియో సందేశంలో చెప్పారు.
పైలట్‌ను రక్షించినట్లు డోనల్డ్ ట్రంప్ ప్రకటించినప్పటికీ, ఇరాన్ అధికారులు, ప్రభుత్వ టీవీల్లో మిషన్ విఫలమైందనే వాదనను పదేపదే వినిపించాయి.
ఇరాన్ భూభాగంలో ఎఫ్-15ఈ విమానం కూలిపోవడం, ఆ తర్వాత అనేక సహాయక విమానాలు కూలిపోవడం అమెరికా సైనిక శక్తి పరిమితం అయినట్లు చూపిస్తుందని కొందరు అమెరికా విశ్లేషకులు పేర్కొన్నారు.
''ఈ మిషన్‌లో మేం నిజంగా రెండు విమానాలను కోల్పోయాం'' అని అమెరికా సెంట్రల్ కమాండ్ మాజీ కమాండర్ జనరల్ ఫ్రాంక్ మెకెంజీ బీబీసీ అమెరికా పార్టనర్ సీబీఎస్‌తో చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ రోజునైనా ఈ నష్టాన్ని భరించాల్సి ఉంటుందని తెలిపారు.
"ఒక విమానాన్ని నిర్మించడానికి ఒక సంవత్సరం పడుతుంది. కానీ ఎవరినీ శత్రువుల చేతికి చిక్కకుండా కాపాడుకునే సైనిక సంప్రదాయాన్ని నిర్మించడానికి 200 ఏళ్లు పడుతుంది" అని ఆయన సీబీఎస్ 'ఫేస్ ది నేషన్' కార్యక్రమంలో అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
ముఖ్యమైన కథనాలు
ఫీచర్లు
పాపులర్
కంటెంట్ అందుబాటులో లేదు