హార్ముజ్ జలసంధి: తాత్కాలికంగా తెరిచి, నౌకలపై కాల్పులు జరిపి, మళ్లీ మూసేసి అసలు ఈ జల సంధిలో ఏం జరుగుతోంది?
ఫొటో సోర్స్, Reuters
వాణిజ్య నౌకల రాకపోకలను అడ్డుకునేందుకు హార్ముజ్ జలసంధిని మళ్లీ మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. జలసంధికి చేరువయ్యే ఏ నౌకనైనా లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించింది.
జలసంధిలోనూ, దాని సమీపంలో ఉన్న నౌకలపై, ముఖ్యంగా ఒక ట్యాంకర్‌పై శనివారం తెహ్రాన్ దాడులు జరిపిందని నివేదికలు వెలువడిన తరువాత ఈ నిర్ణయం వెలువడింది.
అమెరికా కొనసాగిస్తున్న దిగ్బంధమే ఇందుకు కారణమని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) తెలిపింది.
ఈ కీలక ప్రపంచ సముద్రమార్గాన్ని తాత్కాలికంగా తిరిగి తెరుస్తున్నట్టు ఇరాన్ విదేశాంగ మంత్రి వెల్లడించిన ఒకరోజు తరువాత ఐఆర్‌జీసీ ఈ ప్రకటన చేసింది.
ఇరాన్ ఈ జలమార్గంపై బెదిరింపులతో అమెరికాను "బ్లాక్‌మెయిల్" చేయలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అయితే, తెహ్రాన్ దాదాపు రెండు నెలలుగా ఈ మార్గాన్ని మూసివేయడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగాయి.
శనివారం విడుదల చేసిన ప్రకటనలో "పర్షియన్ గల్ఫ్ లేదా ఒమన్ సముద్రంలో ఏ నౌకా తన స్థానాన్ని విడిచి కదలకూడదు" అని ఐఆర్‌జీసీ హెచ్చరించింది.
శుక్రవారం రాత్రి నుంచి తమ పర్యవేక్షణలో కొన్ని నౌకలు జలసంధి గుండా ప్రయాణించాయని తెలిపింది. అయితే, ఇరాన్ ఓడరేవులపై అమెరికా దిగ్బంధం కొనసాగుతున్నంతవరకు జలసంధిని మళ్లీ మూసివేస్తామని స్పష్టం చేసింది.
"హార్ముజ్ జలసంధికి చేరువ కావడం అంటే శత్రువుతో సహకరించినట్లే. అలాంటి నౌకలను లక్ష్యంగా చేసుకుంటాం" అని ఐఆర్‌జీసీ హెచ్చరించింది.
‘శాంతి ఒప్పందం కుదిరేవరకు దిగ్బంధం’
శాంతి ఒప్పందం కుదిరే వరకు ఇరాన్ ఓడరేవులపై దిగ్బంధం కొనసాగుతుందని ట్రంప్ శుక్రవారం తెలిపారు. ప్రస్తుతం అమల్లో ఉన్న రెండు వారాల కాల్పుల విరమణ ఏప్రిల్ 22న ముగియనుంది.
ఏప్రిల్ 13న ప్రారంభమైన దిగ్బంధం తర్వాత ఇప్పటివరకు 23 నౌకలను వెనక్కి పంపినట్లు అమెరికా తెలిపింది.
ఇరాన్ అత్యున్నత జాతీయ భద్రతా మండలి (ఎస్‌ఎన్‌ఎస్‌సీ) దీనిని కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనగా పేర్కొంది. ఈ పరిస్థితుల్లో జలసంధిని తిరిగి తెరవడం నిలిపివేస్తామని తెలిపింది.
యుద్ధానికి ముగింపు పలకడానికి అమెరికా కొత్త ప్రతిపాదనలు పంపిందని ఎస్ఎన్‌ఎస్‌సీ వెల్లడించింది. తెహ్రాన్ ప్రస్తుతం వాటిని పరిశీలిస్తున్నదని, ఇంకా స్పందించలేదని పేర్కొంది. ఈ నెల ప్రారంభంలో జరిగిన శాంతి చర్చలు ఎటువంటి ఒప్పందం లేకుండానే ముగిశాయి.
"తెహ్రాన్‌తో మంచి చర్చలు జరుగుతున్నాయి. అవి బాగా సాగుతున్నాయి" అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శనివారం తెలిపారు.
హార్ముజ్ జలసంధిలో నౌకలపై ఇరాన్ దాడులు జరిపినట్టు అనేక వార్తలు వచ్చాయి.
హార్ముజ్ జలసంధిలో ఒక ట్యాంకర్‌పై ఇరాన్‌కు చెందిన రెండు గన్‌బోట్లు కాల్పులు జరిపినట్లు యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ (యూకేఎంటీఓ) తెలిపింది.
ఒమన్ ఈశాన్య తీరానికి సమీపంలో ఒక కంటైనర్ నౌకపై "గుర్తు తెలియని క్షిపణి" దాడి జరగడంతో కొన్ని కంటైనర్లు దెబ్బతిన్నాయని తెలిపింది.
ఇంకా, జలసంధి దాటే ప్రయత్నంలో ఉన్న రెండు వాణిజ్య నౌకలపై కాల్పులు జరిగినట్లు వాటి సిబ్బంది రాయిటర్స్ వార్తా సంస్థకు తెలిపారు.
హార్ముజ్ జలసంధిలో భారత జెండాతో ఉన్న రెండు నౌకలపై జరిగిన కాల్పుల ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, ఇరాన్ రాయబారిని పిలిపించినట్టు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
జలసంధి తాత్కాలికంగా తెరిచిన సమయంలో కొన్ని నౌకలు ఆ ప్రాంతాన్ని దాటగలిగాయని మారీటైమ్ ట్రాఫిక్ సైట్ తెలిపింది. అయితే ఐఆర్‌జీసీ అనుమతి నిరాకరించడంతో మరికొన్ని నౌకలు తమ మార్గాన్ని మార్చుకోవాల్సి వచ్చింది.
ప్రపంచ చమురు ద్రవ సహజ వాయువు సరఫరాలో సుమారు 20 శాతం ఈ జలసంధి ద్వారానే జరుగుతుంది. అయితే, ఫిబ్రవరి 28న అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడి చేసిన తర్వాత ప్రారంభమైన ఘర్షణల కారణంగా నౌకల రాకపోకలు గణనీయంగా తగ్గాయి.
ఈ ఇరుకైన మార్గం పర్షియన్ గల్ఫ్‌ను అరేబియా సముద్రంతో కలుపుతుంది. సముద్ర మార్గంలో అనేక చమురు ఉత్పత్తి దేశాలకు చేరుకోవడానికి ఇదే ప్రధాన మార్గం. ఈ సంక్షోభం కారణంగా కొన్నిసార్లు చమురు ధర బ్యారెల్‌కు 100 డాలర్లకు పైగా పెరిగింది.
ఇరాన్ గతంలో కూడా ట్యాంకర్లు ఇతర నౌకలపై దాడులు చేస్తామని హెచ్చరించింది. అలాగే సముద్రంలో మైన్లు అమర్చినట్లు కూడా తెలిపింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
ముఖ్యమైన కథనాలు
ఫీచర్లు
పాపులర్
కంటెంట్ అందుబాటులో లేదు