బొబ్బిలి రథోత్సవం: నెహ్రూ పర్యటనతో ఆగిన రథచక్రాలు, 90 ఏళ్ల తర్వాత మళ్లీ ప్రారంభం, చరిత్రలో ఏం జరిగింది...
- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
- చదివే సమయం: 6 నిమిషాలు
దాదాపు తొమ్మిది దశాబ్దాల విరామం తర్వాత బొబ్బిలి వేణుగోపాలస్వామి రథం మళ్లీ కదలబోతోంది. భక్తి, చరిత్ర, రాజవంశపు జ్ఞాపకాలు మరోసారి బొబ్బిలి వీధుల్లోకి రానున్నాయి.
విజయనగరం జిల్లా బొబ్బిలి రాజ కుటుంబ ఇలవేల్పుగా భావించే వేణుగోపాల స్వామి రథోత్సవాన్ని తిరిగి నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
రాజ వంశీయులు, బొబ్బిలి స్థానికులు చెబుతున్నదాని ప్రకారం, ఒకప్పుడు ప్రతీ దీపావళి అమావాస్య రోజున ఈ రథయాత్రను రాజ కుటుంబం నిర్వహించేది. దాదాపు 90 ఏళ్ల కిందట ఉత్సవానికి సిద్ధమైన రథం బొబ్బిలి రాజుల ఆజ్ఞ మేరకు ఆగిపోయింది.
అప్పుడు ఆగిన రథచక్రాలు దాదాపు తొమ్మిది దశాబ్దాలుగా కదల్లేదు. కానీ, ఈ ఏడాది (2026) దీపావళికి మళ్లీ బొబ్బిలి వీధుల్లో అంటే వేణుగోపాల స్వామి గుడి నుంచి బొబ్బిలి కోట వరకు రథోత్సవం జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
అయితే 90 ఏళ్ల కిందట ఈ రథోత్సవం ఎందుకు ఆగిపోయింది? దానికి భారత మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కారణమనే వాదనలు ఎందుకు వినిపించాయి, అందులో నిజమెంత? ఇప్పుడు మళ్లీ ఎందుకు ప్రారంభమవుతోంది?
బొబ్బిలి రాజవంశం - వేణుగోపాల స్వామి అనుబంధం
బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్‌వీఎస్‌కేకే రంగారావు (బేబీ నాయన) బీబీసీతో మాట్లాడుతూ "బొబ్బిలి రాజులుగా మేం వేణుగోపాల స్వామిని కులదైవంగా పూజిస్తాం. బొబ్బిలి యుద్ధం తర్వాత రాజవంశం తిరిగి స్థిరపడిన సమయంలో అప్పటి మా రాజవంశీయులు ఆలయాన్ని ప్రత్యేకంగా పునరుద్ధరించారు. ఇది రాజ్యం మళ్లీ నిలబడింది అన్న సంకేతం కూడా" అని చెప్పారు.
"వేణుగోపాల స్వామి ఆలయం మాకు ఒక ఆధ్యాత్మిక కేంద్రం. ప్రధాన ఉత్సవాలు రాజ కుటుంబ ఆధ్వర్యంలో జరిగే స్థలం. రథోత్సవం కూడా రాజవంశ ప్రతిష్ఠతో ముడిపడిన సంప్రదాయం. బొబ్బిలికి రాజవంశం ఎంత ముఖ్యమో, రాజవంశానికి వేణుగోపాలస్వామి అంత ముఖ్యుడు" అన్నారు బేబీ నాయన.
అలాంటి వేణుగోపాల స్వామి రథోత్సవాన్ని తిరిగి ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారాయన.
మరి అప్పట్లో ఈ రథోత్సవం ఎందుకు ఆగిపోయిందో తెలుసుకుందాం.
ఫొటో సోర్స్, Vangapandu Appalaswamy
నెహ్రూ సభ - రథోత్సవం
జవహర్ లాల్ నెహ్రు ఏ సందర్భంగా బొబ్బిలి వచ్చారో, అప్పుడు ఏం జరిగిందనే విషయాలు వంగపండు అప్పలస్వామి రచించిన 'సర్దార్ గౌతు-లచ్చన జీవిత చరిత్ర' పుస్తకంలో ఉన్నాయి.
ఆ పుస్తకంలో ఉన్న అంశాలు, ప్రస్తుత బొబ్బిలి రాజవంశపు వారసులు చెప్పిన వివరాల ప్రకారం...
1937లో కేంద్ర శాసన సభకు, ప్రావిన్షియల్ అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో అక్షరాస్యులు, భూమి పన్ను లేదా ఇతర పన్నులు చెల్లించే వర్గాలకే ఓటు హక్కు ఉండేది. వీరినే అప్పట్లో 'రేట్ పేయర్స్' అనేవారు.
ఆ ఎన్నికల్లో జస్టిస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి మధ్యే ప్రధాన పోటీ ఉంది. జస్టిస్ పార్టీ అగ్రనాయకుల్లో ఒకరైన బొబ్బిలి రాజు రాజా శ్రీ రావు శ్వేతాచలపతి రామకృష్ణ రంగారావు అప్పటికి మద్రాసు ప్రెసిడెన్సీ ప్రీమియర్‌గా (నేటి ముఖ్యమంత్రి స్థాయికి సమానం) ఉన్నారు. ఆయన్ని ఓడించడం కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఎందుకంటే మద్రాసు ప్రెసిడెన్సీలో బలం పెంచుకోవాలంటే బొబ్బిలి సీటు కాంగ్రెస్‌కు కీలకం.
ఫొటో సోర్స్, Babynayana
అప్పట్లో (1937) విశాఖ జిల్లాలో ఉన్న బొబ్బిలి సీటుకి జస్టిస్ పార్టీ తరపున శ్వేతాచలపతి రామకృష్ణ రంగారావు నామినేషన్ వేశారు. దీంతో ఇరు పార్టీలు పెద్ద ఎత్తున్న ప్రచారానికి దిగాయి.
అప్పుడు నెహ్రూ కాంగ్రెస్ పార్టీ తరపున దేశమంతా తిరిగి ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగా మద్రాసు ప్రావిన్షియల్ అసెంబ్లీలో భాగమైన బొబ్బిలికి ప్రచారానికి వచ్చారు. ఆయన వచ్చిన రోజు దీపావళి. అదే రోజున బొబ్బిలి రాజులు ప్రతి సంవత్సరం రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించేవారు. గుడి నుంచి కోటకు సుమారు కిలోమీటరున్నర దూరం రథం వెళ్లేది.
అయితే, నెహ్రు సభ వేణుగోపాల స్వామి గుడి జంక్షన్‌లో ఏర్పాటు చేశారు. రథోత్సవం ప్రారంభమయ్యే ప్రదేశం, నెహ్రూ సభ జరిగే చోటు ఒకటే కావడంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొనే అవకాశం ఏర్పడింది.
'అతిథితో ఘర్షణ వద్దనుకొని'
వేణుగోపాల స్వామి గుడి జంక్షన్‌లో జరుగుతున్న సభ కాంగ్రెస్ పార్టీది కాగా, ఇంకోవైపు జరిగే రథయాత్ర జస్టిస్ పార్టీ వారిది అన్నట్లుగా పరిస్థితులు ఏర్పడ్డాయి.
"ఇదంతా నెహ్రు సభకు ఇబ్బంది కలిగించాలనే బొబ్బిలిరాజులు చేసిన పనిగా నెహ్రు భావిస్తున్నట్లు అప్పటి బొబ్బిలిరాజు మా తాతగారైన రామకృష్ణ రంగారావు గారికి సమాచారం అందింది. దాంతో మధ్యవర్తులను పంపించి, వంశపారంపర్యంగా వస్తున్న రథోత్సవమని, తాము కావాలని చేయలేదని చెప్పినా నెహ్రు గారు పట్టించుకోలేదట. వచ్చిన అతిథితో మనకెందుకు ఘర్షణ అని ఆ ఏడాది రథోత్సవాన్ని నిలిపివేశారు తాతగారు. ఆ తర్వాత వివిధ కారణాల వల్ల రథోత్సవం తిరిగి జరగలేదని కుటుంబ పెద్దలు చెబుతుంటారు" అని బొబ్బిలి రాజవంశం వారసులైన బేబీ నాయన బీబీసీతో చెప్పారు.
అయితే ఆ ఎన్నికలలో జస్టిస్ పార్టీ ఓడిపోయింది. కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మద్రాసు ప్రెసిడెన్సీలో మంత్రివర్గాన్ని ఏర్పాటుచేయడానికి కావాల్సిన సంఖ్యా బలాన్ని కాంగ్రెస్ పొందింది.
బొబ్బిలి సంస్థానం రాజకీయంగా కూడా చాలా కీలకమైనదని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ జర్నలిజం విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లీలావరప్రసాద్ చెప్పారు.
"ఆ కాలంలో బొబ్బిలి రాజు కేవలం స్థానిక సంస్థానాధీశుడే కాదు, మద్రాస్ ప్రెసిడెన్సీ రాజకీయాల్లోనే ప్రధాన శక్తి కూడా. అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ప్రాంతం బొబ్బిలి. అప్పట్లో పెద్ద జమీందార్లు, రాజ కుటుంబాలు సాధారణంగా జస్టిస్ పార్టీకి దగ్గరగా ఉండేవి. జస్టిస్ పార్టీ ప్రధానంగా జమీందార్లు, బాగా చదువుకున్న బ్రాహ్మణేతరుల మద్దతుతో కొనసాగుతుండేది. బొబ్బిలి రాజ కుటుంబం కూడా ఆ రాజకీయ వాతావరణానికి దగ్గరగా ఉండేది" అని లీలావరప్రసాద్ బీబీసీతో చెప్పారు.
మళ్లీ రథయాత్ర ఎందుకు ప్రారంభిస్తున్నారంటే...
దాదాపు తొంభై ఏళ్లుగా ఆగిపోయిన బొబ్బిలి వేణుగోపాలస్వామి రథోత్సవం మళ్లీ ఈ ఏడాది (2026) ప్రారంభిస్తున్నట్లు బేబీ నాయన బీబీసీతో చెప్పారు. దీనికి తగిన ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలిపారు.
"దశాబ్దాల పాటు రథోత్సవం జరగలేదు. ఇప్పుడు పాత సంప్రదాయాన్ని పునరుద్ధరించాలని మా రాజకుటుంబం నిర్ణయించింది. ఇది బొబ్బిలి సంస్కృతి కూడా. ప్రజల నుంచి కూడా రథయాత్ర తిరిగి జరిపించాలనే డిమాండ్ ఉంది. కొత్త రథం నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. సుమారు 27 అడుగుల ఎత్తుతో తయారయ్యే ఈ రథానికి దాదాపు రూ. 40 లక్షలు ఖర్చవుతుందని అంచనా వేశాం. దీనిని రాజకుటుంబీకులుగా మేం భరించగలం. కానీ, ప్రజలను కూడా ఇందులో భాగస్వామ్యులను చేయాలనే ఉద్దేశంతో విరాళాలను సేకరిస్తున్నాం" అని బేబీ నాయన చెప్పారు.
ఈ రథాన్ని రంగారెడ్డి జిల్లాలో తయారు చేయిస్తున్నామని తెలిపారు.
"ఇది కేవలం రథోత్సవం మాత్రమే కాదు. పెద్దల మాటల్లో విన్న బొబ్బిలి వైభవాన్ని మళ్లీ ఈ రథోత్సవం రూపంలో చూస్తాం" అని ఆయన చెప్పారు.
చరిత్ర విన్నాం: స్థానికులు
రథోత్సవం పట్ల బొబ్బిలి స్థానికుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. రథోత్సవం కోసం గతంలో విన్నదంతా, ఇకపై చూస్తామని చెబుతున్నారు.
"ఎంతో చరిత్ర ఉన్న వేణుగోపాల స్వామి రథోత్సవం చిన్న కారణంతో దాదాపు 90 ఏళ్లు ఆగిపోవడం బాధకరమే. మా పెద్దలు మాకు రథోత్సవం విశేషాలు చెబుతుంటే, దాన్ని మేం చూడలేకపోయామని బాధగా అనిపించేది. రథోత్సవం తిరిగి ప్రారంభం కావడం ఆనందంగా ఉంది" అని బొబ్బిలికి చెందిన సాయి రమేష్ బీబీసీతో అన్నారు.
'ఈ ఏడాది జరగబోయే రథోత్సవం పండుగే కాదు, దాదాపు తొంభై ఏళ్ల విరామం తర్వాత తిరిగి కదులుతున్న చరిత్ర' అని డాక్టర్ లీలా ప్రసాద్ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
ముఖ్యమైన కథనాలు
ఫీచర్లు
పాపులర్
కంటెంట్ అందుబాటులో లేదు