You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఇండియన్ మిడిల్ క్లాస్: ఆటోమేషన్ కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన ఈ వర్గం చితికిపోతోందా?
- రచయిత, సౌరభ్ ముఖర్జియా, నందితా రాజ్‌హంస
- చదివే సమయం: 8 నిమిషాలు
నవీ ముంబయిలోని ఓ చీకటి గది..
అందులో100 మంది ఆపరేటర్లు ఇండియాలోని 30వేల ఏటీఎంలను పర్యవేక్షిస్తున్న బాట్‌లపై పని చేస్తున్నారు.
ఒకప్పుడు 60వేల మంది సెక్యూరిటీ గార్డులు చేసిన పనిని, వారి కెమెరాలు, సెన్సర్లు, బాట్‌లు చేస్తున్నాయి.
విస్తృతమైన ప్రాంతాన్నిచూసి విశ్లేషించడానికి ఈ గది చిన్న కిటికీ లాంటిది.
ఆటోమేషన్ కారణంగా భారత్‌లో మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉద్యోగాలు కోల్పోతున్నారు.
కొన్ని సందర్భాల్లో మెషినరీ వల్ల వారు ఆధారపడిన ఉద్యోగాలు లేకుండా పోతున్నాయి.
ఆటోమేషన్ పర్యవసానాలు మధ్య తరగతికి ఇప్పుడిప్పుడే అవగాహనకు వస్తున్నాయి.
స్థిరంగా వచ్చే ఆదాయం ఆగిపోతూ ఉండటంతో, దాని వల్ల ఏర్పడిన ఖాళీని భర్తీ చేసేందుకు సంపాదన కోసం అనేకమంది ప్రమాదకర మార్గాల వైపు మళ్లుతున్నారు.
ఆకర్షణీయ వలలు
వీఎస్ 27ఏళ్ల బీటెక్ గ్రాడ్యుయేట్. ఆయనది రాజస్థాన్‌లోని బిల్వారాకు సమీపంలో ఉన్న ఓ పట్టణం. ఆయన ఫ్రీలాన్స్ సేల్స్ పర్సన్‌గా పని చేస్తూ నెలకు 14వేల రూపాయలు సంపాదిస్తున్నారు.
నిరుడు ఆయన స్టాక్‌మార్కెట్‌లో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్‌లో పెట్టుబడి పెట్టి 10లక్షల 30వేల రూపాయలు నష్టపోయారు.
దీంతో ఆయన కుటుంబానికున్న సేవింగ్స్ మొత్తం అయిపోయాయి.
స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టి నష్టపోతున్న భారత్‌లోని 90 లక్షల మందిలో ఆయన ఒకరు.
ఈ 90 లక్షలమంది ఏటా 11లక్షల కోట్ల రూపాయలు నష్టపోతున్నారు.
ఇది కేంద్ర వార్షిక బడ్జెట్‌లో విద్యాశాఖకు కేటాయిస్తున్న మొత్తానికి దాదాపు సమానం.
వీళ్లేమీ జూదరులు కాదు. చదువుకున్నవాళ్లు. ఆశయాలు ఉన్నవాళ్లు. తమ ఆశయాల్ని నెరవేర్చుకోవడానికి మరే అవకాశం లేని వాళ్లు.
రాహుల్ సింగ్‌నే తీసుకోండి. ఆయన ఓ ఫుడ్ డెలివరీ యాప్ కోసం పని చేస్తారు.
ఇంటికి మరమ్మతులు చేయించడంతో పాటు "దైనందిన జీవితంలో భాగమైన అద్దె చెల్లింపులు, వైద్యం కోసం, ఇతర అనుకోని ఖర్చుల చెల్లింపుల కోసం అప్పులు చేస్తున్నట్లు" ఆయన చెప్పారు.
కనిపించకుండా పోతున్న ఉద్యోగాలు
వీఎస్, రాహుల్ సింగ్ భారత్‌లోని విస్తృత మధ్య తరగతిలో వేర్వేరు వర్గాలకు చెందిన వారు. సామాజికంగా, ఆర్థికంగా భిన్నమైన నేపథ్యం ఉన్నవారు. కానీ వాళ్లు ఎదుర్కొంటున్న పరిస్థితులు మాత్రం ఒకటే.
ఇవి వ్యక్తిగత వైఫల్యాలకు సంబంధించి హెచ్చరికల్లాంటి కథనాలు కావు. ఏడాదికి రూ. 5 లక్షల నుంచి కోటి రూపాయలు సంపాదిస్తూ భారత ఆర్థిక వ్యవస్థకు కేంద్ర బిందువుగా ఉన్న 4 కోట్లమంది పన్ను చెల్లింపుదారులకు ప్రతీకలు.
మేం కొత్త పుస్తకం కోసం పరిశోధన చేస్తున్నప్పుడు మధ్య తరగతి విషయంలో ఏదో పొరపాటు జరుగుతోందని, అది కూడా అనేక రంగాల్లో ఒకేసారి జరుగుతోందని గుర్తించాం.
ఇంజనీరింగ్, కామర్స్‌లో డిగ్రీ చేసిన వారికి కచ్చితంగా లభిస్తుందని భావించే వైట్ కాలర్ లాంటి ఉద్యోగాల కల్పన 2020లో 11 శాతం ఉంటే, అదిప్పుడు ఒక్క శాతానికి పడిపోయిందని నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ చెబుతోంది.
ఈ క్షీణత ఏఐతో మొదలు కాలేదు. 2000 మొదటి నుంచే ఆటోమేషన్ వల్ల మధ్య స్థాయి నిపుణుల ఉద్యోగాలను క్రమంగా కనుమరుగు చేస్తూ వచ్చింది. ఒకప్పుడు భారత్‌లో గ్రాడ్యుయేట్లకు ప్రధాన ఉపాధిగా ఉన్న క్లరికల్, బుక్ కీపింగ్, సేల్స్ ఉద్యోగాలను పూర్తిగా తుడిచిపెట్టేసింది.
అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ అంతరాయాన్ని వేగవంతం చేసింది.
భారత్‌లో అత్యధికంగా 80 లక్షల మందికి ఉద్యోగాలిచ్చిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ప్రస్తుతం ఉద్యోగుల కోతలు పెరుగుతున్నాయి.
ఉద్యోగాల్ని కబళిస్తున్న ఏఐ
2031 నాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లౌడ్ వల్ల 30 లక్షల ఐటీ, కస్టమర్ సర్వీస్ ఉద్యోగాలు కనుమరుగవుతాయని ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ అంచనా వేసింది. జీతాల ఖర్చును మూడోవంతు తగ్గించుకోవడానికి ఏఐని సమర్థవంతంగా ఉపయోగించుకోవడం గురించి భారత్‌లోని అత్యంత లాభదాయకమైన కంపెనీల సీఈఓలు మాతో బహిరంగంగానే మాట్లాడారు.
ఒక పెద్ద ప్రైవేట్ బ్యాంకులో ఖాతాదారుల సందేహాలను నివృత్తి చేసేందుకు ఏర్పాటు చేసిన కాల్ సెంటర్‌లో 3వేల మంది చేసే పనిని ప్రస్తుతం ఒక ఏఐ టూల్ చేస్తోంది.
ఆటోమేషన్ కారణంగా రోజు రోజుకీ కుచించుకు పోతున్న ఉద్యోగాల మార్కెట్‌లోకి ఏటా 80లక్షల మంది కొత్త గ్రాడ్యుయేట్లు అడుగు పెడుతున్నారు. ఈ లెక్కల్ని పట్టించుకోకుండా ఉండలేం.
భారత్‌లోని ప్రముఖ సాంకేతిక విద్యా సంస్థలలో ఒకటైన బాంబే ఐఐటీలో చేరితే విదేశాల్లో మంచి సంపాదనతో ఉద్యోగం గ్యారంటీ అనే పరిస్థితి ఉండేది. అలాంటి చోట ప్రస్తుతం విద్యార్థులు తమ ముందున్న వారితో పోలిస్తే చాలా తక్కువ జీతాలతో ఉద్యోగాల్లో చేరుతున్నారు.
దేశవ్యాప్తంగా 21,500 మంది ఐఐటీ గ్రాడ్యుయేట్లలో 8వేల మంది నిరుద్యోగులే. భారత్‌లో చాలాకాలంగా ఎక్కువ మంది కోరుకునే ఐఐటీ డిగ్రీ ప్రస్తుతం గోల్డెన్ టికెట్‌లా కాకుండా లాటరీ టికెట్‌లా కనిపిస్తోంది.
ఉద్యోగం దొరికిన వారు కూడా మధ్య తరగతి జీవితంలో ఉండే ఆర్థిక అంశాల వల్ల ఇబ్బంది పడుతున్నారు.
పెరిగిన ఖర్చులు, పెరగని జీతాలు
గత దశాబ్ధంలో మధ్య తరగతి ఆదాయ పన్ను చెల్లింపుదారుడి వార్షిక ఆదాయం రూ. 50 వేలు పెరిగింది. ఇది ఒక మంచి స్మార్ట్ ఫోన్ ధరకు సమానం. విడిగా చూస్తే ఇది పురోగతిలా కనిపిస్తుంది. అయితే పెరుగుతున్న జీవనవ్యయంతో పోలిస్తే ఇది క్రమంగా క్షీణిస్తున్న ఆదాయానికి సూచికగా నిలుస్తుంది.
తాజా పరిశోధన ప్రకారం చూస్తే ఒక ప్లేటు శాఖాహార భోజనం ధర ఏటా 11 శాతం పెరుగుతోంది. ఎంట్రీ లెవల్ కారు లేదా మోటార్ సైకిల్ ధర 7 నుంచి 8 శాతం పెరుగుతోంది. వైద్య ఖర్చులు 14శాతం పెరుగుతున్నాయి.
సాధారణ మధ్యతరగతి ప్రజల దైనందిన జీవితంలో ఇంటి అద్దె (10-13శాతం), ఆహారం (7-9 శాతం) వైద్య సేవలు (దాదాపు 14శాతం) విద్య( 8-10శాతం) వంటి ఖర్చుల ఆధారంగా మా అంచనా ప్రకారం ప్రతీ 8 ఏళ్లకు వారి జీవన వ్యయం దాదాపు రెట్టింపవుతోంది. దీనిని బట్టి చూస్తే ఈ వర్గానికి సంబంధించిన ద్రవ్యోల్బణం సుమారు 9శాతంగా ఉందని తెలుస్తోంది.
2016లో ఏడాదికి రూ.10లక్షలతో సౌకర్యవంతంగా జీవించిన కుటుంబానికి ప్రస్తుతం దాదాపు రూ. 20 లక్షలు అవసరం.
చాలా సందర్భాల్లో వారి జీతాలు దాదాపుగా పెరగలేదు. మధ్య తరగతి ప్రజల జీవితం ట్రెడ్‌మిల్ మీద పరుగెత్తుతున్నట్లుగా ఉంటే, ట్రెడ్‌మిల్ బెల్ట్ వేగం ఏటా మరింత పెరుగుతోంది.
అప్పుల ఊబిలోకి..
అప్పులు వాస్తవం. అవి మరింత పెరుగుతున్నాయి.
ప్రజల సంపాదనకు ఖర్చులకు మధ్య ఉన్న ఖాళీని భర్తీ చేయాలంటే అప్పులు చేయక తప్పని పరిస్థితి. భారత్‌లో ఇళ్లు లేని వారి సంపాదనలో అప్పులు అమెరికా, చైనా ఆదాయాన్ని మించి పోయాయి.
భారత్‌లోని దాదాపు సగం కుటుంబాలు వ్యక్తిగత రుణాలు తీసుకున్నాయి. వారిలో 67 శాతం మంది తమ 30 ఏళ్లకు ముందే తొలిసారి లోన్ తీసుకుంటున్నారు. వారి వార్షిక సంపాదనలో దాదాపు 40శాతం అప్పులు తీర్చడానికే సరిపోతోంది.
అయితే ఈ అప్పులతో ఆస్తులేమైనా పెంచుతున్నారా అంటే అదీ లేదు. విహార యాత్రలు, స్మార్ట్ ఫోన్లు, స్కూలు ఫీజులు, హాస్పిటల్ బిల్లులు, పెచ్చు మీరిన వినియోగానికి ఖర్చు చేస్తున్నారు. పెట్టుబడి పెట్టడం లేదు.
5 నుంచి 10శాతం మంది అప్పుల ఊబిగా భావించే వడ్డీ వ్యాపారుల చేతుల్లో చిక్కుకుపోతున్నారు. పాత అప్పుల్ని తీర్చడానికి కొత్త అప్పులు చేస్తూ.. ఆ ఊబిలో నుంచి బయటపడలేకపోతున్నారు.
పుణెలోని హింజేవాడి టెక్ పార్క్‌లో బీపీఓ సంస్థల్లో ఉద్యోగం కోసం ప్రతీ రోజూ నిర్వహించే వాకిన్ ఇంటర్వూల్లో పాల్గొనేందుకు ఇంజనీరింగ్ డిగ్రీతో పాటు అప్పులు ఉన్న యువకులు బారులు తీరుతున్నారు.
ఇందులో నెలకు 18వేల రూపాయల జీతం ఇచ్చే డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం సంపాదించాలనే ఆశతోనే వారు వస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇలా ఉన్నాయి.
తగ్గుతున్న అమ్మకాలు
దీని పర్యవసానాలు అన్నివైపులా విస్తరిస్తున్నాయి.
14 ఏళ్ల కిందట 11శాతంగా ఉన్న ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ అమ్మకాల పరిమాణం ఇప్పుడు 3శాతానికి పడిపోయింది. కార్ల అమ్మకాలు దాదాపు నిలిచిపోయాయి. మన్నికైన వినియోగ వస్తువుల వృద్ధి 11శాతం నుంచి 1, 2శాతానికి పడిపోయింది.
భారత్‌లోని పెద్ద కన్స్యూమర్ కంపెనీలతో మేము మాట్లాడినప్పుడు వారి మొహాలు అయోమంగా, నివ్వెరపోయినట్లుగా కనిపించాయి. భారతీయ వినియోగదారుడు ఖర్చు చేయడం మానేశాడని వాళ్లు భావిస్తున్నారు.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం వస్తు సేవల పన్నులో కోత విధించిన తర్వాత పెరిగినట్లు కనిపించిన కొనుగోళ్లు ఇప్పుడు క్షీణిస్తున్నట్లు కనిపిస్తోంది.
ఈ పరిస్థితి కేవలం ఇంటి ఖర్చులకే పరిమితం కాలేదు. భారత జీడీపీలో వినియోగ రంగం వాటా 60 శాతం.
1991 తర్వాత భారత అభివృద్ధి నమూనా మధ్య తరగతి కేంద్రంగా నిర్మించారు. అందులో మధ్య తరగతి ఖర్చు చేస్తే డిమాండ్ పెరుగుతుంది.
డిమాండ్ పెరిగితే ఉద్యోగాలు పెరుగుతాయి. ఉద్యోగాలు చేసే వాళ్లు పెరిగితే ఖర్చు చేయడం పెరుగుతుంది.
ఈ చక్రం ఇలా విస్తరిస్తుందని భావించారు. 30 ఏళ్లుగా ఈ చక్రం ఇప్పుడు విచ్ఛిన్నమైనట్లు కనిపిస్తోంది.
వీటన్నింటికీ కేంద్రంగా భావిస్తున్న దానిలో క్రూరమైన వైవిధ్యం ఉంది.
భారత్ గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు ఏటా 80లక్షల మంది గ్రాడ్యుయేట్లను తయారు చేస్తోంది. అయితే గ్రాడ్యుయేట్లందరికీ ఉపాధి దొరికే అవకాశాలు తగ్గిపోతున్నాయి. పట్టబద్రులైన వారిలో నిరుద్యోగిత శాతం 29.1 శాతంగా ఉంది. ఇది స్కూలుకు వెళ్లని పిల్లల శాతంతో పోలిస్తే 9 రెట్లు ఎక్కువ.
భారతీయ మధ్య తరగతి ఆశ, శ్వాసగా ఉన్న విద్య వారి ఆకాంక్షల్ని నెరవేర్చడాన్ని దాదాపు ఆపేసింది.
దేశ నిర్మాణంలో కీలకమైన మధ్య తరగతిని కాపాడేదెవరు?
రాజకీయ వర్గంలోనూ విజేతలు ఎవరూ లేరు. 97 కోట్ల మంది ఓటర్లలో 4 కోట్ల మంది మాత్రమే పన్ను చెల్లింపుదారులు. పాలకుల ఖర్చులకు అవసరమైన సొమ్మును చెల్లిస్తున్న మధ్యతరగతి వర్గం, వారిని కమాండ్ చేయడంలో విఫలమవుతోంది.
రాజకీయ నాయకులు నిధుల కోసం సంపన్నుల మీద, ఓట్ల కోసం పేదల మీద ఆధారపడుతున్నారు. మధ్య తరగతి వర్గం ఈ ఇద్దరి కోసం డబ్బులు చెల్లిస్తూ ఫలితాల కోసం వేచి చూస్తోంది.
ఆర్థిక సంస్కరణల అమలు తర్వాత భారత దేశాన్ని మధ్య తరగతి వర్గమే నిర్మించింది. భారత దేశం ఇప్పుడీ వర్గాన్ని నిలబెట్టుకోగలదా లేదా అన్న ప్రశ్నకు ఈ దశాబ్ధం సమాధానం ఇవ్వనుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)