శానిటరీ ప్యాడ్లు: ప్రతి నెలా మహిళలు వాడే కొన్ని కోట్ల శానిటరీ ప్యాడ్ల వ్యర్థాలు ఏమవుతాయి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సుశీల సింగ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారతదేశంలో నెలసరి (పీరియడ్స్) వచ్చే మహిళలు 35.5 కోట్ల మంది ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి.
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-4 (ఎన్ఎఫ్హెచ్ఎస్) ప్రకారం, 15-24 వయసు మధ్య గల ఆడపిల్లల్లో 40% మంది శానిటరీ ప్యాడ్స్ ఉపయోగిస్తున్నారు.
24 ఏళ్లు దాటిన మహిళలను లెక్కేస్తే ఈ శాతం ఇంకా ఎక్కువగా ఉంటుంది.
ఇటీవల కాలంలో ప్రభుత్వ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు కూడా పీరియడ్స్ సమయంలో పాటించవలసిన పరిశుభ్రత పట్ల మహిళల్లో అవగాహన పెంచేందుకు కృషి చేస్తున్నాయి.
గుడ్డలకన్నా ప్యాడ్స్ వాడడం పరిశుభ్రతకు చిహ్నమని, వాటిని కూడా రోజులో మూడు నాలుగు సార్లు మార్చుకుంటూ ఉండాలని అవగాహన కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే, వాడేసిన ప్యాడ్స్ ఏమవుతాయి, శానిటరీ నాప్కిన్ల వ్యర్థాలు ఎక్కడికి పోతాయి, వాటివల్ల ఉత్పన్నమయే సమస్యలను ఎలా ఎదుర్కోవాలి అనే అంశాలపై జరగవలసినంత చర్చ జరగట్లేదు.
"దేశంలో శానిటరీ నాప్కిన్లు, డైపర్ల వినియోగం పెరుగుతోంది. కానీ వాటిని వాడిన తరువాత చెత్తబుట్టల్లో పడేస్తుంటే చెత్త సేకరించేవాళ్లకు హానికారకంగా మారుతున్నాయి.
దీన్ని అరికట్టడానికి 2021లో మేము కొన్ని నిబంధనలు తీసుకు రాబోతున్నాం. తయారీదారులు, శానిటరీ నాప్కిన్లు పారేయడానికి అనువుగా బయో డీగ్రేడబుల్ బ్యాగులను కూడా పాడ్స్‌తో పాటే ఇవ్వాల్సి ఉంటుంది" అని కేంద్ర పర్యావరణ మంత్రి జావదేకర్ తెలిపారు.
అయితే, ఈ నిబంధనలు ముందు నుంచే ఉన్నాయని, కానీ నాప్కిన్ తయారీదారులు పాటించట్లేదని కూడా ఆయన తెలిపారు.
ఈ అంశంలో ప్రభుత్వ నిర్ణయం సరైనదేనని పలువురు భావిస్తున్నారు.
గ్రామాల్లోనూ, కొన్ని పట్టణ ప్రాంతాల్లో కూడా చెత్త నిర్వహణ సరిగ్గా లేదని అధ్యయనాలు చెబుతున్నాయి.
వాడేసిన శానిటరీ నాప్కిన్లను రోడ్డు పక్కన పడేస్తారు లేదా కాలువల్లోకి, చెరువుల్లోకి విసిరేస్తారు.
లేదంటే మంటల్లో వెయ్యడం, గొయ్యి తవ్వి పాతిపెట్టడం చేస్తున్నారు. ఇలా వాడి పారేసిన నాప్కిన్లు చెత్త సేకరించేవారి ఆరోగ్యానికి ప్రమాదకరం కావొచ్చు. డీగ్రేడబుల్ సంచుల్లో పెట్టి పారేస్తే వాటిని నేరుగా తాకాల్సిన అవసరం ఉండదు.

శానటరీ నాప్కిన్స్ వ్యర్థాలు ఎక్కడికి చేరుతాయి?
మెన్స్ట్రువల్ హెల్త్ అలయన్స్ ఇండియా (ఎంహెచ్ఏఐ) పీరియడ్స్ సమయంలో ఆరోగ్యం, పరిశుభ్రతకు సంబంధించిన అంశాలపై పనిచేసే సంస్థ.
ఈ సంస్థ అంచనాల ప్రకారం...12.1 కోట్ల మంది మహిళలు శానిటరీ ప్యాడ్లను వినియోగిస్తున్నారు.
ఒక రుతుచక్రంలో ఒక మహిళ ఎనిమిది ప్యాడ్లను వినియోగిస్తారనుకుంటే.. ఒక నెలలో మొత్తం మహిళలు 100 కోట్ల ప్యాడ్లను వినియోగిస్తున్నట్లు లెక్క. అంటే సంవత్సరంలో 1200 కోట్ల శానిటరీ నాప్కిన్లను వినియోగిస్తున్నారని ఎంహెచ్ఏఐ అంచనా వేసింది.
కానీ ఈ వ్యర్థాలు ఎక్కడికి వెళతాయి? డీగ్రేడబుల్ సంచులు ఇవ్వడం మంచిదేగానీ వ్యర్థాల గురించి ఆలోంచాల్సిన అవసరం కూడా ఉంది.
ఒక శానిటరీ నాప్కిన్ శిథిలమైపోవడానికి లేదా డీకంపోజ్ అవ్వడానికి 500-800 సంవత్సరాలు పడుతుందని ఎంహెచ్ఏఐ తెలిపింది.
ఇందులో ఉపయోగించే ప్లాస్టిక్ బయోడీగ్రేడబుల్ కాదు. దీనివలన ఆరోగ్యానికి, పర్యావరణానికి కూడా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది.
ప్రభుత్వ సూచనలను అనుసరించి నాప్కిన్లతోపాటూ బయోడీగ్రేడబుల్ సంచులను తయారుచేసే దిశగా కృషి చేస్తున్నామని శానిటరీ నాప్కిన్స్ ఉత్పత్తి సంస్థ నాయిన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రిచా సింగ్ తెలిపారు.
వీటిని అతి తక్కువ ధరలకే మహిళలకు అందించే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.
ఈ సంచులు బయోడీగ్రేడబుల్ కావడం వలన వేడిని ఎక్కువగా పీలుస్తాయి. తద్వారా నాప్కిన్లు కూడా త్వరగా డీకంపోజ్ అయ్యే అవకాశం ఉందని ఆమె అన్నారు.
"నాప్కిన్లకు పైన, కింద వాడే షీట్లు బయోడీగ్రేడబుల్ కావు. కానీ దీనికి వాణిజ్యపరమైన పరిష్కారం కూడా లేదు. దీనిపై మరింత ఆలోచించాల్సి ఉంది" అని రిచా సింగ్ అంగీకరించారు.
అయితే, ఈ దిశలో ప్రయోగాలు జరుగుతున్నాయని, రాబోయే రెండేళ్లల్లో బయోడీగ్రేడబుల్ నాప్కిన్లు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని ఆమె తెలిపారు.
నాప్కిన్ల తయారీలో సెల్యులోజ్, సూపర్ అబ్జార్బెంట్ పాలిమర్ (ఎస్ఏపీ), ప్లాస్టిక్ కవర్లు, జిగురు మొదలైన పదార్థాలను వాడతారు. ఇవి తొందరగా డీకంపోజ్ అవ్వవు. అంతే కాకుండా మట్టిని, నీటిని కలుషితం చేస్తాయి.
ఎస్ఏపీలాంటి పదార్థాలు కలిగి ఉన్నవి, ముఖ్యంగా శానిటరీ నాప్కిన్లలాంటి వాటిని కాల్చడం వలన డయాక్సిన్, ఫ్యూరాన్ వంటి విష రసాయనాలు విడుదల అవుతాయి. ఇవి గాల్లో కలిసిపోయి క్యాన్సర్ కారకాలు కాగలవు.

కంపోస్టబుల్ నాప్కిన్లు
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ కింద శానిటరీ నాప్కిన్ల తయారీలో పాటించవలసిన ప్రమాణాలను కూడా ప్రభుత్వం సమీక్షించింది.
నాప్కిన్లను ఎరువు (కంపోస్ట్)గా మార్చే వీలుండేలా తయారుచెయ్యాలని ఈ సమీక్షలో తెలిపింది.
ఆకార్ ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకులు జయదీప్ మండల్ చాలా సంవత్సరాలుగా ఈ దిశలో పనిచేస్తున్నారు.
భారతదేశంలో కంపోస్టబుల్ నాప్కిన్లను తయారు చేస్తున్న మొట్టమొదటి సంస్థ ఇదేనని చెబుతున్నారు. మండల్‌కు ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు కూడా లభించాయి.
తమ సంస్థ తయారు చేసే నాప్‌కిన్‌లలో వాడే అన్ని పదార్థాలు ఎరువులుగా మారగలిగే గుణం ఉన్నవేనని మండల్ తెలిపారు.
ప్లాస్టిక్ కవర్లకు బదులు బంగాళదుంపలోని పిండిపదార్థాన్ని వాడుతున్నారు.
నాప్కిన్ల తయారీలో వాడే కలప గుజ్జు (వుడ్ పల్ప్) యూఎస్, కెనడాలనుంచి వస్తోందని, దీనికి ప్రత్యామ్నాయాలు అన్వేషించాలని మండల్ తెలిపారు.
అరటి, చెరకు, జనపనార లేదా వెదురునుంచీ తీసే ఫైబర్‌ను ఉపయోగించే అవకాశాలను పరిశీలించాలని ఆయన అన్నారు.
"బయోడీగ్రేడబుల్ కాకుండా కంపోస్టబుల్ నాప్కిన్లు తయారు చేసే దిశగా మరింత పరిశోధన జరగాలి. బయోడీగ్రేడబుల్ అవ్వడం అంటే సహజంగా శిథిలం అయిపోవడం. దీనికి ఒకరోజు పట్టొచ్చు, కొన్నేళ్లు పట్టొచ్చు. కానీ అది పూర్తి పరిష్కారం కాదు.
ఆక్సో బయోడీగ్రేడబుల్ ప్యాడ్లు మార్కెట్లో లభిస్తున్నాయి. సూర్యకిరణాలు, యూవీ కిరణాలు తాకినప్పుడు లేదా అధిక వేడి ఉన్నప్పుడు మైక్రో ప్లాస్టిక్‌గా రూపాంతరం చెంది భూమిలో కలిసిపోతాయి.
ఈ మైక్రో ప్లాస్టిక్ పశువులకు ప్రాణాంతకం కావొచ్చు. అవి తీసుకునే ఆహారంలో కలిసిపోయి వాటిని హాని కలిగించవచ్చు.
మనుషులకు కూడా ఇవి హాని కలిగించే అవకాశాలున్నాయి" అని మండల్ వివరించారు.
ఇవే కారణాలచేత యూరోప్‌లో ఆక్సో డీగ్రేడబుల్ ఉత్పత్తులను నిషేధించారు.
శానిటరీ నాప్కిన్ వ్యర్థాల వల్ల ఉత్పన్నమయే సమస్యలపై కూడా ప్రభుత్వం దృష్టి పెడుతుందని ఆమె ఆశిస్తున్నారు.

భస్మం చేసే పరికరాలను కూడా అందించాలి
బయోడీగ్రేడబుల్ సంచులతోపాటూ భస్మం చేసే పరికరాలను (ఇన్సినరేటర్స్)ను అందించాలని రిచా సింగ్ అంటున్నారు.
అజింక్య ధారియా 2018లో ప్యాడ్ కేర్ ల్యాబ్ అనే స్టార్టప్ ప్రారంభించి కేంద్ర, మహారాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తున్నారు.
డిస్పోజిబుల్ సంచులు ఇవ్వడం మంచిదేగానీ ఇన్సినరేటర్లు కూడా అందించడం సరైన పరిష్కారం కాదని అజింక్య అభిప్రాయపడ్డారు.
"ఇన్సినరేటర్ ప్లాంట్ల వద్ద వ్యర్థాలను 800 డిగ్రీల వేడిలో కాల్చి బూడిద చేస్తారు. ఇందులో ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలు కూడా ఉంటాయి.
నియమాల ప్రకారం..ఇలాంటి బయోమెడికల్ వ్యర్థాలు కూడా ఇన్సినరేటర్ ప్లాంట్ల దగ్గరే కాల్చి బూడిద చెయ్యాలి.
ఆ బూడిదను వేరే చోట పారేయాలి. ఈ ప్రక్రియ అంతా జరగాలి. కానీ ఇలా జరగట్లేదు" అని అజింక్య అన్నారు.
ఇన్సినరేటర్లు ఉపయోగించాలని ప్రభుత్వం కూడా కోరిందని, కానీ కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిర్దేశించిన ప్రమాణలు చేరుకోవడంలో అవి విఫలమయ్యాయని ఎంహెచ్ఏఐ ఒక నివేదికలో పేర్కొంది.
తక్కువ ఖర్చుతో లభ్యమయ్యే ఇన్సినరేటర్లు తక్కువ ఉష్ణోగ్రతలవద్ద మండిస్తాయని, దానివల్ల విష రసాయనాలు వెలువడే ప్రమాదం ఉందని తెలిపింది.
"చాలా స్కూళ్లు, కాలేజీలు, మాల్స్‌లో ఇన్సినరేటర్లు అమర్చారు. అనేక స్కూళ్లల్లో చెత్తబుట్టలు శానిటరీ నాప్కిన్స్తో నిండిపోయి ఉండడం గమనించాం.
స్మాల్ స్కేల్ ఇన్సినరేటర్లు సరిగ్గా పనిచెయ్యవు. అవి సరిగ్గా కాల్చి బూడిద చెయ్యవు. వాటినుంచి వెలువడే రసాయనాలు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి" అని డెవెలప్మెంట్ సొల్యూషన్స్ రంగంలో పను చేస్తున్న తాన్యా మహాజన్ తెలిపారు.
వాళ్ల కంపెనీ..స్కూళ్లు, కాలేజీలు, హౌసింగ్ సొసైటీ ఆఫీసులకు సెన్సార్ బిన్లను అందిస్తోందని అజింక్య తెలిపారు.
ఈ బిన్లు బ్యాక్టీరియా, చెడువాసనను అంతం చేస్తాయని..అవి నిండగానే వాళ్ల ఆఫీసుకి ఒక మెసేజ్ వస్తుందని, వెంటనే వాటిని శుభ్రపరుస్తారని ఆమె తెలిపారు.
“వీటిని దహనం చెయ్యరు. కెమికల్, మెకానికల్ ప్రోసెసింగ్ ద్వారా ప్లాస్టిక్‌ను వేరు చేస్తారు. ఈ ప్లాస్టిక్‌ను మళ్లీ వినియోగానికి పంపిస్తారు. అలాగే దీనినుంచి కంపోస్ట్ కూడా తయారవుతుంది” అని అజింక్య తెలిపారు.
శానిటరీ నాప్కిన్ వ్యర్థాల వల్ల ఉత్పన్నమయే సమస్యలపై కూడా ప్రభుత్వం దృష్టి పెడుతుందని ఆమె ఆశిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
రీయూజబుల్ ప్యాడ్స్
ఇండియాలో రీయూజబుల్ ప్యాడ్స్ తయారుచేస్తున్న సంస్థలు ఒక 30 దాకా ఉన్నాయని అంచనా. వీరు అరటి లేదా వెదురు ఫైబర్‌ను ప్యాడ్స్ తయారీలో ఉపయోగిస్తున్నారు. ఈ ప్యాడ్లను ఉతికి ఆరేసుకోవచ్చు.
అయితే భారతదేశంలాంటి దేశంలో, నెలసరి గురించి మాట్లాడడం కూడా తప్పుగా పరిగణించే సమాజంలో...ప్యాడ్లను ఉతికి బహిరంగంగా ఆరెయ్యడం అసాధ్యమని, అవి సరిగ్గా ఎండలో ఆరకపోతే ఇంఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉందని శానిటరీ నాప్కిన్ తయారీదారులు అంటున్నారు.
బయోడీగ్రేడబుల్ ప్యాడ్స్ ఉత్పత్తి చెయ్యడం అవసరమని నీతి ఆయోగ్‌లోని పబ్లిక్ పాలసీ నిపుణులు ఊర్వశి ప్రసాద్ అన్నారు. అయితే, ఈ ప్యాడ్స్ తయారీలో అనేక సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు.
ఖర్చులు పెరుగుతాయి. నాప్కిన్ల ధర పెరిగితే ఎంతమంది వాటిని కొనుక్కుని వాడగలరు, వీటిని ఎంత పెద్ద ఎత్తున ఉత్పత్తి చెయ్యగలరు, ఇండియాలాంటి దేశాల్లో వీటిని ప్రజలవద్దకు తీసుకెళ్లడం ఎంతవరకు సాధ్యం మొదలైన సవాళ్లు అనేకం ఉత్పన్నమవుతాయని ఊర్వశి ప్రసాద్ వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
‘పారిశుధ్యంపై అవగాహన పెరుగుతోంది’
ఇంతకుముందు పెద్ద నగరాల్లో మాత్రమే మహిళలు శానిటరీ ప్యాడ్లు వాడేవారు. కానీ ఎన్ఎఫ్హెచ్ఎస్-4 గణాంకాలు చూస్తే నాప్కిన్లు వాడే మహిళల సంఖ్య పెరిగిందని తెలుస్తోంది. చిన్న పట్టణాల్లోనూ, కొన్ని గ్రామాల్లో కూడా పరిశుభ్రత, మహిళల ఆరోగ్యం పట్ల అవగాహన పెరిగి, ఆ ప్రాంతాల్లో కూడా నాప్కిన్లు ఉపయోగిస్తున్నారు. ఇది సంతోషించాల్సిన విషయమేగానీ దీనితోపాటూ నాప్కిన్ వ్యర్థాల సమస్య కూడా పెరుగుతోంది. దీని గురించి ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ సమస్యకు పరిష్కార మార్గాలు కనుగొనే ప్రయత్నం చేస్తోందని ఊర్వశి ప్రసాద్ తెలిపారు.
"అంతకుముందు గ్రామీణ ప్రాంతాల్లో మరుగు దొడ్లు ఉండేవి కావు. ప్రభుత్వం వాటి మీద దృష్టి పెట్టి పారిశుధ్యంపై అవగాహన పెంచింది. తరువాత మహిళల ఆరోగ్యం, పరిశుభ్రతపై అవగాహన పెంపొందించేదుకు కృషి చేస్తోంది. ఇది ఒక నేచురల్ ప్రొగెషన్. స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా నగరాల్లో పరిశుభ్రత, వేస్ట్ మేనేజ్మెంట్ మొదలైన అంశాలలో అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తోంది. ఇందులో మెనుస్ట్రువల్ హైజీన్ కూడా ఒక భాగమే. మెల్లి మెల్లిగా ఒకదాని తరువాత ఒకటిగా ప్రభుత్వం ముందుకు వెళుతోంది" అని ఆమె వివరించారు.
నాప్కిన్లతో పాటూ బయోడీగ్రేడబుల్ సంచులు ఇవ్వడం మంచి విషయమే అని తాన్యా మహాజన్ అభిప్రాయపడ్డారు. అయితే, ఈ ఆలోచనను ముందుకు తీసుకెళ్లడంలో కంపెనీలు పెద్ద పాత్ర పోషించవలసి ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు.
ప్రజలు కూడా వ్యర్థాలను విడివిడిగా పారవేసే పద్ధతి నేర్చుకోవాలని...పరిశుభ్రత, మహిళల ఆరోగ్యం విషయాలలో ప్రభుత్వం, కంపెనీలు, మహిళలు కూడా తమ వంతు పాత్ర తాము పోషించాలని ఆమె అన్నారు.
ఇవి కూడా చదవండి:
- బ్రెగ్జిట్: బ్రిటన్, యూరోపియన్ యూనియన్లకు మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంలో ఏముంది?
- రాష్ట్రపతి భవన్‌కు కాంగ్రెస్ నేతల పాదయాత్ర, అడ్డుకున్న పోలీసులు
- సిస్టర్ అభయ హత్య కేసులో ఫాదర్, నన్‌కు జీవిత ఖైదు
- నీటి కాలుష్యం: వైజాగ్ మరో ఏలూరు కానుందా?
- ఏపీ రాజధాని చుట్టూ ఏడాదిగా ఏం జరిగింది? అమరావతి భవితవ్యం ఏంటి?
- 451 ఏళ్ల బానిసత్వం నుంచి గోవాను లోహియా ఎలా విడిపించారు?
- జునాగఢ్ ఆశతో పాకిస్తాన్ కశ్మీర్‌ను చేజార్చుకుందా, ఈ సంస్థానం భారత్‌లో ఎలా కలిసింది?
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ: మెరుగైన మహిళా సాధికారత... కలవరపెడుతున్న పోషకాహార లోపం -జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే
- సౌదీ అరేబియా భారతదేశంతో స్నేహం ఎందుకు కోరుకుంటోంది...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

























