మధ్యాహ్న భోజన పథకంలో మిగిలిన ఆహారం కోసం బస్తీ చిన్నారుల నిరీక్షణ - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, EENADU
మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులకు పెట్టగా మిగిలిన ఆహారం కోసం గుడిమల్కాపూర్ నవోదయ కాలనీలోని పాఠశాల వద్ద బస్తీ చిన్నారులు వేచి చూస్తున్న చిత్రాన్ని ‘ఈనాడు’ హైదరాబాద్ జిల్లా ఎడిషన్లో ప్రచురించారు.
‘‘ఆకలి తీరే దారి లేక కొందరు బస్తీ చిన్నారులు నిత్యం మధ్యాహ్న భోజన సమయానికి పాఠశాల చెంతకు చేరుతున్నారు. విద్యార్థులు తినగా మిగిలిన ఆహారాన్ని తమకు పెడతారన్న ఆశతో చేతిలో గిన్నె పట్టుకుని తరగతి గది బయట బాలిక నిరీక్షిస్తోందీ బాలిక’’ అంటూ చిత్ర వివరణ ఇచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రసవానికి వెళితే రూ.5 కోట్ల బిల్లు
తెలంగాణకు చెందిన ప్రవాస భారతీయుడి భార్య సౌదీ అరేబియాలోని ఓ ఆసుపత్రిలో ప్రసవించగా ఆ హాస్పిటల్ రూ. 5 కోట్లు బిల్లు చెల్లించమందని 'ఆంధ్రజ్యోతి' కథనం తెలిపింది.
''నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మల్లపల్లికి చెందిన సయ్యద్ జహీద్ కొంతకాలంగా సౌదీలో పనిచేస్తున్నాడు. విజిట్ వీసాపై ఏడాది క్రితం భార్యను సౌదీకి తీసుకెళ్లాడు. అక్కడే ఆమె గర్భం దాల్చింది. ఏడోనెలలోనే నొప్పులు రావడంతో రియాద్‌లోని సులేమాన్ హబీబ్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ నలుగురు బిడ్డలకు ఆమె జన్మనిచ్చింది. ఆస్పత్రి ఖర్చుల కోసం అప్పటికే దాచుకున్న రూ.4.31లక్షలను జహీద్ చెల్లించాడు. పిల్లలు బరువు తక్కువగా ఉండటంతో ఇంక్యుబేటర్లలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇందుకు ప్రతి శిశువుకు రోజుకు 10వేల రియాళ్ల చొప్పున ఖర్చవుతోంది. అంటే.. రోజుకు నలుగురు పిల్లలకు కలిపి రూ.7లక్షలు ఖర్చవుతోంది. మరో రెండు నెలలు పిల్లలను ఇంటెన్సివ్‌కేర్ యూనిట్‌లో ఉంచి చికిత్స చేయాల్సి ఉండడంతో రూ.4.50 కోట్లు ఖర్చవుతుందని.. దీనికి మందుల ఖర్చు అదనమని వైద్యులు సూచించారు.
తన భార్య గర్భవతి అని తెలియగానే స్వదేశానికి పంపాలని అనుకున్నానని, అయితే ఎయిర్‌లైన్స్ అధికారులు అనుమతించలేదని.. దీంతో అక్కడే ఉంచాల్సి వచ్చిందని జహీద్ చెబుతున్నాడు.
ఇటీవల సౌదీ ప్రభుత్వం ఏడాది, రెండేళ్ల కోసం విజిటింగ్ వీసాలను జారీచేస్తోంది. దీంతో ఈ వీసాల ద్వారా తెలుగు రాష్ట్రాల నుంచి పెళ్లయిన జంటల రాక పెరిగింది. ఈ క్రమంలోనే జహీద్ జంట అక్కడే కాపురం చేసి చిక్కుల్లో పడింద''ని ఆ కథనంలో వివరించారు.

ఫొటో సోర్స్, FACEBOOK/YSJAGANMOHANREDDY
అధిక ధరలకు అమ్మితే జైలుకే : ఇసుకపై సమీక్షలో ఏపీ సీఎం జగన్
ఇసుకను అధిక ధరలకు విక్రయిస్తే జైలుకు పంపేలా ప్రత్యేక చట్టం తేవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారని 'సాక్షి' కథనం తెలిపింది.
''వరదలు తగ్గగానే అన్ని రీచ్‌ల నుంచి ఇసుకను పెద్ద ఎత్తున స్టాక్ యార్డులకు తరలించి ఎక్కడా కొరత లేకుండా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఇసుక మాఫియా, స్మగ్లింగ్‌పై ఉక్కుపాదం మోపాలని స్పష్టం చేశారు. జిల్లాలు, నియోజకవర్గాల వారీగా ఇసుక ధరలు ఖరారు చేసి పక్కాగా అమలు చేయాలని, అధిక ధరలకు విక్రయిస్తే జైలుకు పంపేలా ఆర్డినెన్స్ సిద్ధం చేయాలని నిర్దేశించారు. ఇసుక సరఫరా పెంపు, మద్యం నియంత్రణపై సీఎం బుధవారం క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కలెక్టర్లతో చర్చించి ఇసుక ధరలు ప్రజలకు తెలిసేలా విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. సరఫరా పెంచాలని, ఫిర్యాదులు స్వీకరించేందుకు టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈసారి 'స్పందన' కేవలం ఇసుకపైనే నిర్వహిస్తామన్నార'ని ఆ కథనంలో తెలిపారు.

'ఆర్టీసీయే మాకు రూ.540 కోట్లు బాకీ'
'ఆర్టీసీకి తెలంగాణ ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు ఏమీలేవని, పైగా ప్రభుత్వానికే ఆర్టీసీ రూ.540 కోట్లు బకాయి పడి ఉన్నదని తెలంగాణ ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు హైకోర్టుకు చెప్పారని 'నమస్తే తెలంగాణ' వార్తాకథనం ప్రచురించింది.
''ఆర్థికలోటు కారణంగా ఆర్టీసీకి తాము సహాయంచేసే పరిస్థితుల్లో లేమని, అసలు ఆర్టీసీకి సహాయం చేయటం చట్ట ప్రకారం తప్పనిసరికాదని జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ చెప్పారు. ఆర్టీసీ ఇంచార్జి ఎండీ సునీల్‌శర్మ కూడా హైదరాబాద్ పరిధిలో ఆర్టీసీకి వచ్చే నష్టాల భర్తీకి జీహెచ్‌ఎంసీ నుంచి వచ్చేది ఆర్థిక సహాయం మాత్రమేనని, అది క్లెయిమ్ కాదని పేర్కొన్నారు. గత విచారణ సందర్భంగా హైకోర్టు ఆదేశం మేరకు మూడు వేర్వేరు అఫిడవిట్లను ముగ్గురు ఉన్నతాధికారులు బుధవారం సమర్పించారు. ఆర్టీసీపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు బుధవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కోర్టు కేసు విచారణ ఉన్న నేపథ్యంలో అనుసరించాల్సిన ప్యూహంపై ప్రగతిభవన్‌లో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌తోపాటు రవాణశాఖ ఉన్నతాధికారులతో దాదాపు తొమ్మిది గంటలపాటు సుదీర్ఘంగా చర్చించారు. ఆర్టీసీ సమ్మెపై గురువారం హైకోర్టులో కేసు విచారణ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వపరంగా వినిపించాల్సిన వాదనలపై సమగ్రంగా సమీక్షించినట్టు తెలిసింది. కార్మికులు విధుల్లో చేరడానికి ఇచ్చిన గడువు ముగిసినందున తదుపరి కార్యాచరణపైనా చర్చించినట్టు సమాచారం'' అని ఆ కథనంలో తెలిపారు.

ఫొటో సోర్స్, janasena
వైసీపీ నేతలకు మేలుకొలుపు అంటూ చిరంజీవి పాటను ట్వీట్ చేసిన పవన్
చిరంజీవి నటించిన రుద్రవీణ తనకు ప్రేరణనిచ్చిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారంటూ 'ఈనాడు' వార్తా కథనం ప్రచురించింది.
'రాష్ట్రంలో ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వైసీపీ నేతలు జీతాలు తీసుకోవడాన్ని ప్రస్తావిస్తూ రుద్రవీణలోని 'చుట్టూపక్కల చూడరా చిన్నవాడా' అనే పాటను పవన్ ట్వీట్ చేశారు. ఈ పాట వైసీపీ నేతలకు మేలుకొలుపుగా ఉంటుందన్నారు. వైసీపీ మేనిఫెస్టో, వాగ్దానాలను నమ్మి ఓట్లేసిన ప్రజలు ఇకనైనా కళ్లు తెరవాలని సూచిస్తూ అదే చిత్రంలోని 'నమ్మకు నమ్మకు ఈ రేయినీ' అనే మరో పాటను ఉటంకించారు. సంపాదించిన సొమ్ముతో ఉచిత పథకాలు పెట్టండి.. అప్పు తెచ్చిన సొమ్ముతో కాదు, ఇప్పుడైనా మేల్కోండి జగన్ అంటూ విమర్శించారు'' అని ఆ కథనంలో రాశారు.
ఇవి కూడా చదవండి
- ఉద్యోగులను ఆఫీసులో ఎక్కువ సేపు పనిచెయ్యనివ్వని డ్రోన్
- బోన్సాయ్: 400 ఏళ్ల వయసున్న చెట్టు దొంగతనం
- టోక్యో ఒలింపిక్స్: పాత సామానుతో.. పతకాల తయారీ
- గుండెల్ని పిండేసే వ్యథ: జైలుకు వెళ్లేందుకు పదేపదే నేరాలు చేస్తున్న జపాన్ వృద్ధులు.. ఎందుకంటే...
- అక్కడ 18 ఏళ్లుదాటినా పెద్దవారు కాదు
- చైనా, జపాన్ల మధ్య ఆకస్మిక స్నేహబంధం
- కారును అడ్డగించి, తుపాకి గురిపెట్టి అమ్మాయికి ప్రపోజ్ చేశాడు
- నోబెల్ శాంతి పురస్కారం: అబియ్ అహ్మద్ తూర్పు ఆఫ్రికాలో శాంతిని నెలకొల్పారా?
- ఊబకాయంపై ఏడు అపోహలు... తెలుసుకోవాల్సిన వాస్తవాలు
- సిరియాలో కుర్దులపై టర్కీ 'సైనిక చర్య' ఎందుకు? దీనివల్ల జరగబోయేది ఏమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)


























