ఐపీఎల్: ఆర్సీబీ, రాజస్థాన్ రాయల్స్ జట్ల అమ్మకంపై వస్తున్న కథనాలేంటి?

ఆర్‌సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ అజింక్య రహానే

ఫొటో సోర్స్, Vishal Bhatnagar/NurPhoto via Getty Images

ఫొటో క్యాప్షన్, ఆర్‌సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ అజింక్య రహానేలకు చెందిన 2019 ఏప్రిల్ 2 నాటి ఫోటో
    • రచయిత, మీర్జా ఏబీ బేగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 6 నిమిషాలు

క్రికెట్‌లోనే అత్యంత సంపన్న లీగ్ అయిన ఐపీఎల్‌లో.. తొలి చాంపియన్‌గా నిలిచిన జట్టు రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్), ప్రస్తుత విజేత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) రికార్డు ధరల్లో అమ్ముడుపోయాయి.

ఇండియన్ ప్రీమియర్ లీగ్, దాని పాలక మండలి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) దీనిపై ఇప్పటి వరకు స్పందించలేదు.

కానీ, దీనికి సంబంధించిన వార్తలు భారత మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఆదిత్య బిర్లా గ్రూప్ నేతృత్వంలోని ఆర్‌సీబీని కొనుగోలు చేసిన కన్సార్షియం ప్రకారం ఈ ఒప్పందం విలువ సుమారు రూ.16,500 కోట్లు (1.78 బిలియన్ డాలర్లు).

అదేవిధంగా స్థానిక మీడియా ప్రకారం.. అమెరికా వ్యాపారవేత్త కల్ సోమానీ నేతృత్వంలోని కన్సార్షియం రాజస్థాన్ రాయల్స్‌ను కొనుగోలు చేసేందుకు 1.63 బిలియన్ డాలర్ల (సుమారు రూ.15,462 కోట్లు) బిడ్‌ను దాఖలు చేసింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

'రూ.450 కోట్ల పెట్టుబడి రూ.16,500 కోట్లుగా మారింది'

ఆదిత్య బిర్లా గ్రూప్‌ తన వెబ్‌సైట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. ''ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్, బోల్ట్ వెంచర్స్, బ్లాక్‌స్టోన్ ప్రైవేట్ ఈక్విటీ స్ట్రాటజీ, బీఎక్స్‌పీఈ (బ్లాక్‌స్టోన్)‌లు ఆర్‌సీ‌బీ యజమాన్యాన్ని 100 శాతం కొనుగోలు చేసేందుకు ఒక ఒప్పందంపై సంతకం చేశాయి'' అని ఉంది.

ఈ ఒప్పందం కింద, పురుషుల ఐపీఎల్ ఫ్రాంచైజీ, మహిళల యునైటెడ్ లీగ్‌ కోసం బ్రిటీష్ కంపెనీ డియాజియో పీఎల్‌సీ అనుబంధ సంస్థ యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ నుంచి 100 శాతం వాటాను కొనుగోలు చేసింది.

మరోవైపు, మాజీ ఆర్‌సీబీ యజమాని, బిలియనీర్ వ్యాపారవేత్త విజయ్ మాల్యా (పరారీలో ఉన్న వ్యక్తిగా ప్రకటించిన ఈయనను, చాలా సంవత్సరాలుగా భారత్‌కు రప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి) ఈ ఒప్పందంపై తన ఎక్స్ అకౌంట్‌లో స్పందించారు.

కొత్త యజమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

''రాయల్ చాలెంజర్స్ బెంగళూరును నిర్మించాలన్నది నా అభిరుచుల్లో ఒకటి. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే ఫ్రాంచైజీ ఆర్‌సీబీకి ఆ పేరు పెట్టాను. నా పెట్టుబడి రూ.450 కోట్ల నుంచి రూ.16,500 కోట్లకు పెరిగినట్లు చూడటం చాలా సంతోషంగా ఉంది'' అని విజయ్ మాల్యా రాశారు.

'' ఆర్‌సీబీ ఎల్లప్పుడూ నా డీఎన్ఏలో భాగం. ఇందులో ఎన్నో చెరగని జ్ఞాపకాలు ఉన్నాయి. వాటిల్లో ఇప్పుడు ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరైన యువ విరాట్ కోహ్లీ ఎంపిక కూడా ఒకటి'' అని రాశారు.

ఆర్‌సీబీ టీమ్

ఫొటో సోర్స్, Pankaj Nangia/Getty Images

ఫొటో క్యాప్షన్, ఐపీఎల్ 2025 సీజన్ విజేత ఆర్‌సీబీ టీమ్

విజయ్ మాల్యా చెప్పిన వివరాల ప్రకారం చూస్తే.. ఆర్‌సీబీ విలువ 19 ఏళ్లలో 36 రెట్లు పెరిగింది.

ఈ విషయంపై మేం బీసీసీఐను సంప్రదించగా.. బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా కార్యాలయం నుంచి సమాధానం వచ్చింది. సంబంధిత డాక్యుమెంట్లు తమ వద్దకు రాగానే స్పందిస్తామని సమాధానం ఇచ్చారు.

భారత్‌లో ఐపీఎల్ వ్యవస్థాపకుడు, ఐపీఎల్ తొలి చైర్మన్ లలిత్ మోదీని (ఈయన కూడా పరారీలో ఉన్నట్లు ప్రకటించారు) సంప్రదించేందుకు అంతకుముందు పలుసార్లు ప్రయత్నించగా.. ఆయన నుంచి ఎలాంటి సమాచారం అందలేదు.

రాజస్థాన్ రాయల్స్

ఫొటో సోర్స్, Pankaj Nangia/Getty Image

రాజస్థాన్ రాయల్స్ అమ్మకం

మరోవైపు 'ది హిందూ', 'టైమ్స్ ఆఫ్ ఇండియా' వార్తా పత్రికల్లోని రిపోర్టుల ప్రకారం.. అమెరికాకు చెందిన వ్యాపారవేత్త కల్ సోమానీ నేతృత్వంలోని కన్సార్షియం రాజస్థాన్ రాయల్స్ కోసం వేసిన బిడ్‌ను దక్కించుకుందని తెలిసింది.

రిపోర్టుల ప్రకారం.. బిర్లా గ్రూప్, టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్‌లు మద్దతిచ్చిన బిడ్‌తో ఈ కన్సార్షియం పోటీపడింది.

ఈ బిడ్ విలువ 1.63 బిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.15,300 కోట్లని భావిస్తున్నారు. యాజమాన్య హక్కులను కొనుగోలు చేసింది, కానీ జూన్‌లో యాజమాన్య హక్కుల బదిలీ ఉంటుందని అంచనా వేస్తున్నారు.

టైమ్స్ ఆఫ్ ఇండియాలోని ఒక రిపోర్టు ప్రకారం, యూకేకు చెందిన వ్యాపారవేత్త మనోజ్ బదాలే జైపూర్‌కు చెందిన రాజస్థాన్ రాయల్స్ టీమ్‌ను 67 మిలియన్ డాలర్లకు (సుమారు రూ.620 కోట్లకు) కొనుగోలు చేశారు. అంటే, 19 ఏళ్లలో ఈ జట్టు విలువ దాదాపు 24 రెట్లు పెరిగింది.

సోమానీ గతంలో రాజస్థాన్ రాయల్స్‌కు ఇన్వెస్టర్‌గా ఉండటం గమనార్హం. ఎడ్ టెక్, డేటా ప్రైవసీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్పోర్ట్స్ టెక్నాలజీ సంబంధిత వ్యాపారాల్లో ఆయనకు ఆసక్తి.

రాజస్థాన్ రాయల్స్‌లో తన పెట్టుబడుల గురించి లింక్డిన్ ప్రొఫైల్‌లో ప్రస్తావించారు.

ఈ కన్సార్షియానికి వాల్‌మార్ట్ కుటుంబానికి చెందిన రాబ్ వాల్టన్, డెట్రాయిట్ లయన్స్‌లో అత్యధిక వాటా ఉన్న హ్యాంప్ ఫ్యామిలీ కూడా మద్దతు ఇచ్చాయి.

ఫోర్డ్ మోటార్స్ కంపెనీలో ఫోర్డు కుటుంబ వారసురాలైన షీలా ఫోర్డ్ హ్యాంప్‌కు గణనీయమైన వాటా ఉంది.

షేన్ వార్న్

ఫొటో సోర్స్, Vishal Bhatnagar/NurPhoto via Getty Images

షేన్ వార్న్ వారసత్వం

అయితే, అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత ఆస్ట్రేలియా స్పిన్నర్ షేన్ వార్న్ రాజస్థాన్ రాయల్స్‌లో చేరేందుకు తక్కువ వార్షిక రుసుమునే చార్జ్ చేసినప్పటికీ, ఆయన వార్షికంగా 0.75 శాతం వాటాను డిమాండ్ చేశారనే వార్తలు భారత మీడియాలో చక్కర్లు కొట్టాయి.

రాజస్థాన్ రాయల్స్ అమ్మకం తర్వాత.. ఈ స్పిన్ మాంత్రికుడు అప్పట్లో ఆర్‌ఆర్‌తో డీల్ విషయంలో నిజమైన బిజినెస్ తెలివితేటలను ప్రదర్శించారని వార్తలు వస్తున్నాయి.

నాలుగు సీజన్ల పాటు జట్టుతో ఆయనకున్న అనుబంధంతో, రూ.460 కోట్ల విలువైన 3 శాతం వాటాను పొందారు. 2022లో షేన్ వార్న్ మరణించడంతో ఈ మొత్తం వాటా ప్రస్తుతం వారి వారసులకు వెళ్తుంది.

కొన్ని మీడియా సంస్థలు షేన్ సంపాదనను 18 సీజన్ల పాటు ఆడిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోనీల సంపాదనతో పోలుస్తున్నాయి.

విరాట్ సంపాదన రూ.230 కోట్లకు పైగా, రోహిత్ సంపాదన రూ.211 కోట్లకు పైగా, ధోని సంపాదన రూ.192 కోట్లకు పైగా ఉంటుందని చెబుతున్నాయి.

అయితే, షేన్ వార్న్‌తో ఇటువంటి ఒప్పందం జరిగినట్లు రాజస్థాన్ రాయల్స్ కానీ, బీసీసీఐ కానీ ధ్రువీకరించలేదు.

ఐపీఎల్, క్రికెట్ మైదానం

ఫొటో సోర్స్, Pankaj Nangia/Getty Images

ఐపీఎల్ మొత్తం విలువ

ఈ కొనుగోళ్లు క్రీడా ప్రపంచంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎంత ముఖ్యమైనదో, దాని నుంచి ఎంత లాభం వస్తుందో తెలియజేస్తున్నాయి.

ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ మేనేజ్‌మెంట్, టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్టుల ప్రకారం.. గతేడాది వరకు ఐపీఎల్ మొత్తం విలువ సుమారు 18.5 బిలియన్ డాలర్లు (1,75,498 కోట్లుగా) ఉంటుందని అంచనా.

అలాగే, దాని ఆదాయం 9.5 బిలియన్ డాలర్లుగా (రూ. 90,120 కోట్లుగా) ఉన్నట్లు అంచనాలున్నాయి.

ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ హౌలిహాన్ లోకీ రిపోర్టును ఉటంకిస్తూ.. ఐపీఎల్ విలువ ఏటా సుమారు 13 శాతం పెరిగిందని ఎకనామిక్ టైమ్స్ పేర్కొంది.

వార్తా సంస్థ రాయిటర్స్ రిపోర్టు ప్రకారం.. ఈ లీగ్ బ్రాండ్ వాల్యూ ప్రస్తుతం 3.9 బిలియన్ డాలర్లు.

దీంతో ఇది నేషనల్ ఫుట్‌బాల్ లీగ్ తర్వాత.. ప్రపంచంలో అత్యంత విలువైన రెండో లీగ్‌గా నిలిచింది ఐపీఎల్.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)