అయతొల్లా అలీ ఖమేనీ మరణం: జమ్మూకశ్మీర్, యూపీలో నిరసనలు

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, శ్రీనగర్‌లో నిరసన ప్రదర్శన నిర్వహించారు.
చదివే సమయం: 5 నిమిషాలు

అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ మరణానంతరం భారత్‌లోని పలు ప్రాంతాల నుంచి స్పందనలు వచ్చాయి.

శనివారం జరిపిన దాడుల్లో ఖమేనీ మరణించినట్లు డోనల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన తర్వాత, ఇరాన్ అధికారిక మీడియా కూడా దీనిని ధ్రువీకరించింది.

ఖమేనీ మరణానంతరం.. కశ్మీర్, లఖ్‌నవూలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. భారత్‌లోని పలువురు ముస్లిం మతపెద్దలు ఖమేనీ మరణంపై విచారం వ్యక్తం చేశారు.

లఖ్‌నవూలో నిరసన ప్రదర్శనలో పాల్గొన్న ఓ మహిళ మాట్లాడుతూ, "వారు ఖమేనీని మోసపూరితంగాా అంతం చేశారు. ఒక ఖమేనీని చంపితే, వెయ్యి మంది ఖమేనీలు పుట్టుకొస్తారు" అని అన్నారు.

ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
Sorry, we can’t display this part of the story on this lightweight mobile page.

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, ఖమేనీ మరణానంతరం, లఖ్‌నవూలో జరిగిన నిరసన ప్రదర్శనలో మహిళలు పాల్గొన్నారు.

"అణగారిన ప్రజల కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి లేరన్న మాటలు.. ఈ శతాబ్దంలోనే అత్యంత విషాదకరమైనవి. ఆయన ఎవరికీ భయపడలేదు" అని షియా మతగురువు మౌలానా కల్బే జవాద్ చెప్పారు.

"అగ్రరాజ్యాలు వారిని అణచివేయడానికి ప్రయత్నించినా, వారెన్నడూ తలవంచలేదు. అందుకే వారిని శత్రువులుగా పరిగణించారు. ప్రజలను దోచుకోవడానికి, బానిసలుగా మార్చడానికి ఆ గొంతుకను తొలగించాలని వాళ్లు అనుకున్నారు" అని జవాద్ అన్నారు.

ఇరాన్‌పై అమెరికా దాడి అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని ఇస్లామిక్ సెంటర్ ఆఫ్ ఇండియా చైర్మన్, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఎగ్జిక్యూటివ్ సభ్యులు ఖలీద్ రషీద్ ఫరంగి మహలి అన్నారు.

"ఖమేనీని చంపేసిన వారిని అంతర్జాతీయ కోర్టులో విచారించాలి" అని ఆయన కోరారు.

లఖ్‌నవూలో షియా మతగురువు మౌలానా యాసూబ్ అబ్బాస్ మాట్లాడుతూ, "అమెరికా, ఇజ్రాయెల్ మొత్తం పశ్చిమాసియాను యుద్ధంలోకి నెట్టాయి. ఇది మొత్తం ముస్లిం సమాజానికి విచారకరమైన రోజు. ఎందుకంటే, ఇరాన్ సుప్రీం లీడర్ ముస్లింలందరి తరఫున మాట్లాడేవారు" అని అన్నారు.

"మనం నాయకుడిని కోల్పోవడం ఇదే మొదటిసారి కాదు., కానీ మనం నాయకుడి మరణాన్ని మరచిపోకూడదు. అమెరికా, ఇజ్రాయెల్ మన నాయకుడిని ఎలా మోసం చేసి చంపాయో మన పిల్లలకు చెబుదాం" అని షియా కమ్యూనిటీ నేత సయ్యద్ సమర్ కజేమీ అన్నారు.

"ముస్లింలలో ఒక వర్గం తమ ప్రియమైన నాయకుడి మార్గాన్ని అనుసరిస్తూనే ఉంటుంది. అణగారిన ప్రజల కోసం మేం గొంతెత్తుతూనే ఉంటాం. పాలస్తీనాలో హత్యలపై ప్రపంచం మౌనంగా ఉన్నప్పుడు ఆయన తన గొంతు వినిపించారు. అందుకే ఆయనను చంపేశారు" అన్నారాయన.

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, శ్రీనగర్‌లోని లాల్ చౌక్ వద్ద షియా ముస్లింలు నిరసన ప్రదర్శన చేశారు.

రాజకీయ వర్గాల స్పందనేంటి?

ఖమేనీ మరణానంతర పరిస్థితులపై జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అందరూ ప్రశాంతంగా ఉండాలని, ఉద్రిక్తతలకు దారితీసే చర్యలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

"ఖమేనీ మరణం పట్ల జమ్మూ కశ్మీర్‌లో ప్రశాంతంగా నిరసన తెలిపేందుకు మేం అనుమతించాం. పోలీసులు, అధికారులు సంయమనం పాటించాలి. ఎలాంటి ఆంక్షలు వద్దు" అని ఆయన అన్నారు.

ఇరాన్‌లో నివసిస్తున్న విద్యార్థులతో పాటు జమ్మూ కశ్మీర్ ప్రజల భద్రత గురించి తాము భారత విదేశాంగ శాఖతో కలిసి పని చేస్తున్నట్లు ఒమర్ అబ్దుల్లా చెప్పారు.

"ఖమేనీ హత్య గురించి ఇజ్రాయెల్, అమెరికా గొప్పగా చెప్పుకుంటున్నాయి. చరిత్రలో ఇది విచారకరమైన రోజు" అని పీడీపీ నాయకురాలు, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ చెప్పారు.

"ఇస్లామిక్ దేశాలు బహిరంగంగా లేదా పరోక్షంగా అమెరికాకు మద్దతివ్వడం.. మనస్సాక్షి కంటే లాభాన్ని ఎంచుకోవడం సిగ్గుచేటు. న్యాయం కోసం ఎవరు పోరాడారు? అణచివేతదారులకు ఎవరు సాయం చేశారో చరిత్ర నిగ్గుతేలుస్తుంది" అని ఆమె అన్నారు.

ఖమేనీ మరణంపై జమ్మూ కశ్మీర్‌ మతగురువు మీర్వాయిజ్ ఉమర్ ఫారూక్ స్పందించారు.

"ఖమేనీ మృతిపై ప్రజల్లో ఆగ్రహం ఉంది. ఇది ముస్లిం ప్రపంచాన్ని కుదిపేసింది. ఈ క్రూరత్వాన్ని, ఇరాన్‌పై దాడుల్ని, మినాబ్‌లో అమాయక బాలికల ఊచకోతను కశ్మీర్ ప్రజలు ఖండిస్తున్నారు" అని ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

"ఈ విషాద సమయంలో ఇరాన్‌లోని ధైర్యవంతులైన ప్రజలకు మేం తోడుగా ఉన్నాం. అణచివేతను ఎదుర్కొంటున్న వారికి అల్లా ధైర్యాన్ని ప్రసాదించుగాక, ఖమేనీ మరణానికి బాధ్యులైన వారిని త్వరగా న్యాయం ముందు నిలబెట్టుగాక" అని ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేసి సందేశంలో రాశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)