You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
తెలంగాణ: అత్యధికం బ్రెస్ట్ క్యాన్సర్ బాధితులే.. ఊపిరితిత్తులు, గర్భాశయ ముఖద్వారం, మలద్వార క్యాన్సర్లూ ఎక్కువే - వెల్లడించిన ఐసీఎంఆర్ నివేదిక
- రచయిత, అల్లు సూరిబాబు
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 7 నిమిషాలు
క్యాన్సర్‌కు కారణమయ్యే వివిధరకాల వ్యసనాలు, ఆహారపు అలవాట్లే కాక, ముందస్తుగా వ్యాధి నిర్థరణ పరీక్షల విషయంలోనూ ప్రజలు అప్రమత్తంగా లేరని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) నివేదిక చెబుతోంది.
ఈ సంస్థ అనుబంధ నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ ఇన్ఫర్మేటిక్స్ అండ్ రీసెర్చ్ దీనికి సంబంధించి సమగ్ర నివేదిక ఇటీవల విడుదల చేసింది.
నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్‌లో భాగంగా హైదరాబాద్‌లోని నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లోని, పాపులేషన్ బేస్డ్ క్యాన్సర్ రిజిస్ట్రీతో పాటు, తెలంగాణలోని మరో 10 ఆసుపత్రి ఆధారిత క్యాన్సర్ రిజిస్ట్రీల నుంచి సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి ఐసీఎంఆర్-ఎన్‌సీడీఐఆర్ 'తెలంగాణ క్యాన్సర్ బర్డెన్ ప్రొఫైల్-2026'ను రూపొందించాయి.
ఇప్పుడీ నివేదిక తెలంగాణలో క్యాన్సర్ వ్యాప్తిపై ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.
అయితే, దేశవ్యాప్తంగా క్యాన్సర్ పెరుగుదల రేటు 3 శాతం ఉంటే, తెలంగాణలో 1.6 శాతం ఉందని హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే ఇనిస్టిట్యూట్ ఆఫ్ అంకాలజీ అండ్ రీజినల్ క్యాన్సర్ సెంటర్ (ఎంఎన్‌జేఐడీ అండ్ ఆర్‌సీసీ) డైరెక్టర్ డాక్టర్ సదాశివుడు బీబీసీతో చెప్పారు.
‘‘క్యాన్సర్ కేసుల్లో దేశ సగటు కన్నా తెలంగాణ సగటు తక్కువగానే ఉంది. అయినప్పటికీ, ప్రజల్లో అవగాహన కల్పించడానికి, వారు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రభుత్వపరంగా చర్యలు చేపడుతున్నాం. క్యాన్సర్ స్క్రీనింగ్ విస్తృతంగా జరిగేలా, క్యాన్సర్ చికిత్సను చేరువ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం ’’ అని తెలిపారు.
ఏప్రిల్ 7న ‘ప్రపంచ ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా క్యాన్సర్ నోటిఫికేషన్ ప్లాన్ విడుదల చేస్తున్నట్లు చెప్పారు.
పొగాకు, మద్యపానమే అసలు కారణమా?
నేషనల్ కమిషన్ ఆన్ పాపులేషన్ 2026 అంచనా ప్రకారం తెలంగాణలో జనాభా సుమారు 3.86 కోట్లకు చేరింది.
తెలంగాణలో 2022 నాటి అంచనాల ప్రకారం పురుషుల సగటు ఆయుఃప్రమాణం 68.7 సంవత్సరాలు కాగా, మహిళలకు 71.4 సంవత్సరాలుగా ఉంది.
ఐసీఎంఆర్ నివేదిక ప్రకారం, 15 ఏళ్ల వయస్సు పైబడిన ప్రతి 100 మంది పురుషులలో సుమారు 22 మంది, అలాగే ప్రతి వంద మంది మహిళలలో ఆరుగురు క్యాన్సర్ కారకాల్లో ముఖ్యమైన పొగాకు ఉత్పత్తులను వినియోగిస్తున్నారు (సిగరెట్, బీడీ మొదలైనవాటి పొగ తాగడం, పొగాకు సంబంధిత గుట్కా, ఖైనీ, పాన్ మొదలైనవి నమలడం వంటివి).
క్యాన్సర్ ప్రమాదకారకాల్లో మరో ముఖ్యమైనది మద్యం.
తెలంగాణలో 15 ఏళ్లకు పైబడిన పురుషుల్లో 43.3 శాతం మందికి, మహిళలలో 6.7 శాతం మందికి మద్యం తాగే అలవాటు ఉంది.
ఇక, ఇతర అనారోగ్య ప్రమాద కారకాలను పరిశీలిస్తే, 15 ఏళ్ల వయస్సు పైబడినవారిలో పురుషులలో 31.4 శాతం మందికి, మహిళలలో 26.1 శాతం మందికి అధిక రక్తపోటు సమస్య ఉంది.
అలాగే పురుషులలో 18.1 శాతం మందికి, మహిళలలో 14.7 శాతం మందికి రక్తంలో చక్కెర స్థాయి అధికంగా ఉంది.
15 నుంచి 49 సంవత్సరాల మధ్య వయస్సుగలవారిలో ప్రతి వంద మంది పురుషుల్లో సుమారు 32 మంది, అలాగే ప్రతి వంద మంది మహిళలలో సుమారు 30 మంది అధిక బరువు లేదా స్థూలకాయం కలిగి ఉన్నారు.
‘క్యాన్సర్ స్క్రీనింగ్’పై స్పందన అంతంతమాత్రమే
క్యాన్సర్ ముప్పును ముందుగా గుర్తించడానికి స్క్రీనింగ్ ప్రోగ్రాం (ముందస్తు పరీక్షలు) కీలకం. అయితే, వీటిని జీవితంలో ఒక్కసారైనా చేయించుకున్నవారి సంఖ్య చాలా స్వల్ప స్థాయిలో ఉంది.
30 నుంచి 49 ఏళ్ల మధ్య వయస్సున్న మహిళలలో ఇప్పటివరకూ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (సర్వైకల్ క్యాన్సర్)కు సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్‌కు కేవలం 3.3 శాతం మంది మాత్రమే చేయించుకున్నారు.
రొమ్ము క్యాన్సర్‌కు సంబంధించి బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేయించుకున్నవారైతే 0.3 శాతం మందే.
నోటి క్యాన్సర్‌కు సంబంధించి పురుషుల్లో 2.6 శాతం, మహిళలలో 2.5 శాతం మంది నోటి పరీక్ష (ఓరల్ కేవిటీ) చేయించుకున్నారు.
హైదరాబాద్‌లో క్యాన్సర్ ప్రభావం ఇలా...
క్యాన్సర్ వల్ల ఎంతమంది మరణిస్తున్నారు, ఎంతమంది అనారోగ్య సమస్యలతో జీవిస్తున్నారు, సమాజంలో ఎంతమేర ఆరోగ్య నష్టం కలుగుతోందనే మొత్తం ప్రభావాన్ని 'క్యాన్సర్ బర్డెన్' అంటారు.
ఐసీఎంఆర్ నివేదిక ప్రకారం, 2015-2018 మధ్యకాలంలో హైదరాబాద్‌లోని 19ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న జనాభాలో క్యాన్సర్ భారం పురుషుల (43.7 శాతం) కంటే మహిళల (56.3 శాతం)లోనే ఎక్కువగా ఉంది.
క్యాన్సర్ వార్షిక సగటు కేసుల సంఖ్య, సాపేక్ష నిష్పత్తి, క్రూడ్ ఇన్సిడెన్స్ రేట్లు కూడా మహిళలలో అధికంగా నమోదయ్యాయి.
పురుషులలో ఏటా సగటున 1,883 కొత్త క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి.
మహిళల్లో అయితే ఏటా సగటున 2,433 కేసులు నమోదయ్యాయి.
ఐసీఎంఆర్ నివేదిక ప్రకారం, 2015-2018 మధ్యకాలంలో హైదరాబాద్‌లో 0-74 సంవత్సరాల వయస్సు గల జనాభాలో పురుషులైతే ప్రతి ఎనిమిది మందిలో ఒకరికి, మహిళలైతే ప్రతి ఆరుగురిలో ఒకరికి క్యాన్సర్ ముప్పు పొంచిఉన్నట్లు నమోదైంది.
క్యాన్సర్ కేసులు అంచనా ఇలా...
ఐసీఎంఆర్ నివేదికలో, 2025 నాటికి గణాంక ఆధారిత అంచనాల ప్రకారం తెలంగాణలో సుమారు 53,565 క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. వారిలో 24,857 మంది పురుషులు కాగా, మహిళలు 28,708 మంది ఉన్నారు.
హైదరాబాద్‌లోని మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ఎక్కువగా కనిపిస్తోందని నివేదిక వెల్లడించింది. క్యాన్సర్ బాధితులలో 36.2 శాతం మంది రొమ్ము క్యాన్సర్ బారినపడినవారే. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ బాధితులు కూడా 8.1 శాతం ఉన్నారు.
అండాశయ క్యాన్సర్ బాధితులు 6.6 శాతం, గర్భాశయ క్యాన్సర్ బాధితులు 5.3 శాతం ఉన్నారు.
ఇక ధూమపానం లేదా పొగాకు ఉత్పత్తుల వినియోగం కారణంగా నోటి క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి.
మహిళా క్యాన్సర్ బాధితులలో 5.2 శాతం మంది దీంతోనే ఇబ్బందిపడుతున్నారు.
ఈ నోటికుహరం క్యాన్సర్ బాధిత పురుషుల సంఖ్య కూడా హైదరాబాద్‌లో పెరుగుతోంది. క్యాన్సర్ బాధితులలో 21.7 శాతం భాగం వారే.
హైదరాబాద్‌లోని పురుషులలో ఊపిరితిత్తుల క్యాన్సర్ బాధితులు కూడా 10.5 శాతం ఉన్నట్లు ఐసీఎంఆర్ అంచనా వేసింది.
ఇక క్యాన్సర్ బాధిత పురుషులలో పెద్దపేగు/మలద్వార క్యాన్సర్ (7.9), ప్రోస్టేట్ క్యాన్సర్ (6.1), జీర్ణాశయ క్యాన్సర్ (5.7) తో బాధపడుతున్నవారూ ఉన్నారు.
హైదరాబాద్ మినహా మిగతా తెలంగాణలోని క్యాన్సర్ బాధిత మహిళలలోనూ రొమ్ము క్యాన్సర్ కలిగినవారే 27.9 శాతం ఉన్నారు.
ఇక మహిళలకు ప్రమాదకరంగా మారిన గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ బాధితులు కూడా 12.7 మంది ఉన్నారు. పెద్దపేగు/మలద్వార క్యాన్సర్ (6 శాతం), గర్భాశయ క్యాన్సర్ (5.9), అండాశయ క్యాన్సర్ (5.3) బాధితులు కూడా ఎక్కువగానే ఉన్నట్లు ఐసీఎంఆర్ గుర్తించింది.
తెలంగాణలో క్యాన్సర్ బారినపడిన పురుషులలో 15.3 శాతం మంది నోటి కుహరం క్యాన్సర్ వచ్చినవారే. ఊపిరితిత్తుల క్యాన్సర్ బాధితులు కూడా 9.7 శాతం మంది ఉన్నారు. ఈ ప్రమాదానికి ప్రధాన కారణం ధూమపానం, మధ్యపానమేనని ఐసీఎంఆర్ అంచనా వేసింది.
అలాగే, పెద్దపేగు/మలద్వార క్యాన్సర్ బాధితులు 8.8 శాతం, ప్రోస్టేట్ క్యాన్సర్‌తో 6.9 శాతం, జీర్ణాశయ క్యాన్సర్‌తో 6.2 శాతం మంది ఉన్నట్లు గుర్తించింది.
ప్రాణాలకు ముప్పుగా 'పొగ'...
2015-2018 మధ్యకాలంలో హైదరాబాద్ నగరంలో ఐసీఎంఆర్ గుర్తించిన క్యాన్సర్ బాధితులలో 58.8 శాతం మంది పురుషులు, 29.7 శాతం మంది మహిళలు పొగతాగడం, పొగాకు సంబంధిత ఉత్పత్తుల వినియోగంతో క్యాన్సర్ బారినపడినవారే కావడం గమనార్హం.
క్యాన్సర్ బాధితులలో నోటి కుహరం క్యాన్సర్‌తో 23 శాతం, ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో 18 శాతం, నాలుక క్యాన్సర్‌తో 14 శాతం మంది ఉన్నట్లు ఐసీఎంఆర్ గుర్తించింది.
అయితే, హైదరాబాద్‌లో పొగాకు ఉత్పత్తుల వినియోగం కారణంగా క్యాన్సర్ బారినపడిన మహిళలలో 27 శాతం మంది గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ బాధితులే ఉన్నారు. ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో 14 శాతం మంది బాధపడుతున్నవారు .
జీర్ణాశయ క్యాన్సర్ (9 శాతం), నోటి కుహరం క్యాన్సర్ (9 శాతం), నాలుక క్యాన్సర్ (8 శాతం)తో బాధపడుతున్నవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది.
'క్యాన్సర్' బారినపడుతున్న బాల్యం
ఐసీఎంఆర్ నివేదిక ప్రకారం, 19 ఏళ్లలోపు బాలల విషయంలో 2015-2018 గణాంకాలను పరిశీలిస్తే, ప్రతి పది లక్షల మంది బాలలలో ఏటా సగటున 85 మంది బాలురు, 69 మంది బాలికలు క్యాన్సర్ బారినపడ్డారు.
క్రూడ్ రేట్ బాలురులో 118.3 కాగా, బాలికలలో 105.4గా ఉంది.
ఈ ట్రెండ్ ప్రకారం ప్రకారం 2026 సంవత్సరంలో 628 మంది బాలురు, 571 మంది బాలికలలో కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతాయని ఐసీఎంఆర్ అంచనా వేసింది.
బాలలలో ఎక్కువ మంది లింఫాయిడ్ లుకేమియా క్యాన్సర్ బాధితులే.
2026లో కొత్తగా బాలురులో నమోదయ్యే కేసులలో లింఫాయిడ్ లుకేమియా బాధితులే 32.3 శాతం మంది ఉంటారని అంచనా.
అత్యంత ప్రమాదకరమైన బ్రెయిన్ క్యాన్సర్ (9.6 శాతం), మైలోయిడ్ లుకేమియా (8.1), బోన్ క్యాన్సర్ (8), హాడ్జికిన్స్ డిసీజ్ (7.8 శాతం) రోగాలు కూడా బాలురలో ఎక్కువగానే కనిపిస్తున్నాయని ఐసీఎంఆర్ పేర్కొంది.
అలాగే 2026లో బాలికలలో కొత్తగా నమోదయ్యే క్యాన్సర్ కేసులలో లింఫాయిడ్ లుకేమియా బాధితులు 32.4 శాతం మంది ఉంటారని అంచనా వేసింది.
వీరిలో బ్రెయిన్ క్యాన్సర్ (10.7 శాతం), మైలోయిడ్ లుకేమియా (8.8), థైరాయిడ్ (6.3), బోన్ క్యాన్సర్ (6 శాతం) బాధితులు కూడా ఎక్కువగానే ఉండవచ్చని ఐసీఎంఆర్ నివేదికలో పేర్కొంది.
క్యాన్సర్ కేర్ డీసెంట్రలైజేషన్ ఏర్పాట్లు
‘‘క్యాన్సర్‌ను ప్రాథమిక స్థాయిలోనే గుర్తిస్తే తగిన చికిత్స ద్వారా నయం చేయవచ్చు. అలాగే క్యాన్సర్ నోటిఫికేషన్ కచ్చితంగా తీసుకుంటే ఏయే ప్రాంతాల్లో ఏ తరహా క్యాన్సర్లు వస్తున్నాయో తెలుస్తుంది. క్యాన్సర్ నిరోధక చర్యలపై ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి పెట్టింది’’ అని డాక్టర్ సదాశివుడు చెప్పారు.
ఇప్పటికే జిల్లా క్యాన్సర్ సెంటర్లు (డిస్ట్రిక్ట్ డేకేర్ కీమోథెరఫీ సెంటర్-డీడీసీసీ) పనిచేస్తున్నాయని, అలాగే హైదరాబాద్‌లోని నిమ్స్, ఎంఎన్‌జేఐడీ రీజినల్ క్యాన్సర్ సెంటర్లుగా ఉన్నాయని ఆయన అన్నారు.
‘‘ఏ క్యాన్సర్ రోగికైనా వంద కిలోమీటర్లలోపే వైద్యం అందించేలా మరో నాలుగు రీజినల్ క్యాన్సర్ సెంటర్లు (ఆర్‌సీసీ) భవిష్యత్తులో ఏర్పాటుకానున్నాయి. అప్పుడు ఒక్కో ఆర్‌సీసీ పరిధిలో కొన్ని డీడీసీసీలు సేవలందిస్తాయి’’ అని వెల్లడించారు.
డీఆర్‌సీసీలలో క్యాన్సర్ స్క్రీనింగ్ చేస్తారని, ఎవరికైనా క్యాన్సర్ ఉన్నట్లు గుర్తిస్తే అక్కడ వైద్యం అందించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని డాక్టర్ సదాశివుడు వివరించారు.
‘‘ప్రాథమిక, ద్వితీయ స్థాయి చికిత్స ఇకపై డీఆర్‌సీసీలలో అందుతుంది. కేవలం క్లిష్టమైన కేసులలో టెర్షియరీ కేర్ (అత్యంత ప్రత్యేకమైన, అధునాతన వైద్య చికిత్స) కోసం మాత్రమే హైదరాబాద్ వరకూ వస్తే సరిపోతుంది’’ అని చెప్పారు.
స్క్రీనింగ్ తక్కువే
హైదరాబాద్ నగరంలో రొమ్ము క్యాన్సర్ కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయని ఐసీఎంఆర్, టాటా మెమోరియల్ సెంటర్ నిరుడు విడుదల చేసిన సంయుక్త పరిశోధన పత్రం వెల్లడించింది.
రొమ్ము క్యాన్సర్ కేసులు అత్యధికంగా నమోదవుతున్నా, తెలంగాణలో 30-49 ఏళ్ల మధ్య వయస్సు గల మహిళలు కేవలం 0.3 శాతం మంది మాత్రమే పరీక్షలు చేయించుకున్నారు.
క్యాన్సర్ బాధితుల్లో 58.8 శాతం మంది పురుషులు సిగరెట్లు, గుట్కా తదితర పొగాకు సంబంధిత ఉత్పత్తుల వినియోగం వల్లే ఆ వ్యాధి బారినపడ్డారని ఐసీఎంఆర్ గుర్తించింది.
అయినా, తెలంగాణలో 30-49 ఏళ్ల మధ్య వయస్సు గల పురుషులలో కేవలం 2.6 శాతం మంది మాత్రమే నోటికుహర క్యాన్సర్ పరీక్షలు చేయించుకున్నారు.
రోగం బాగా ముదిరిపోయిన తర్వాత చివరి దశ (స్టేజ్-4)లో వ్యాధి నిర్ధరణ చేయించుకున్న పురుషులు 55 శాతం కాగా, మహిళలు 62 శాతం మంది ఉన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)