వైభవ్ సూర్యవంశీ: పరుగులు చేయడానికి సీఎస్కే చెమటోడ్చిన పిచ్‌పై ఈ 15 ఏళ్ల కుర్రాడు 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ ఎలా బాదాడు?

ఫొటో సోర్స్, ANI
‘‘బౌలర్లందరికీ నేనే లక్ష్యమని అందరూ చెపుతుంటే కోచ్‌లు మాత్రం పరిస్థితులకు తగినట్టుగా నా సహజసిద్ధమైన ఆటను ఆడమని ప్రోత్సహించారు’’ అని వైభవ్ సూర్యవంశీ చెప్పాడు.
క్రికెట్‌లో తాజా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ 2026 మార్చి 27న 15వ పుట్టినరోజు జరుపుకున్నాడు.
మూడు రోజుల తర్వాత ఐపీఎల్ 2026 సీజన్‌లో తన తొలి మ్యాచ్ చెన్నై సూపర్‌కింగ్స్ మీద ఆడాడు. ఈ సీజన్‌లో అభినవ్‌కిది అద్భుతమైన ప్రారంభం.
15 బంతుల్లో యాభై పరుగులు. సూర్యవంశీ బ్యాటింగ్ శైలి గురించి తెలిసిన వారికి ఇది పెద్ద ఆశ్చర్యకరమైనది కాకపోవచ్చు.
అయితే ఇదే పిచ్ మీద చెన్నై సూపర్ కింగ్స్ పరుగులు చేయడానికి చెమటోడ్చాల్సి వచ్చింది. ఇదే పిచ్ మీద వైభవ్ అలవోకగా ఫోర్లు, సిక్సర్లు కొట్టాడు.

చెన్నై సూపర్ కింగ్స్ 19.4 ఓవర్లలో 127 పరుగులకే ఆలౌట్ అయింది.
గత ఐపీఎల్ సీజన్‌లో జైపుర్‌లో గుజరాత్ టైటాన్స్‌పై వైభవ్ 17 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు.
సోమవారం గౌహతిలో సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో తన రికార్డును మెరుగుపరుచుకున్నాడు. సూర్యవంశీ దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో రాజస్థాన్ రాయల్స్ 12.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.
సూర్యవంశీ తన నాన్-స్ట్రైకర్ భాగస్వామి యశస్వి జైస్వాల్ ఆటతీరు నుంచి స్ఫూర్తి పొంది ఉండవచ్చు.
జైస్వాల్ 2023లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై 13 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు.

ఫొటో సోర్స్, ANI
'పవర్ ప్లే' ప్లానింగ్
వైభవ్ సూర్యవంశీ 17 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో 52 పరుగులు చేశాడు.
దీంతో రాజస్థాన్ 12.1 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది.
"జైస్వాల్ ప్రతి బంతికి సింగిల్ తీయాలని అడగలేదు. బ్యాట్‌పైకి బంతి వచ్చినప్పుడు షాట్లు ఆడాలని చెప్పాడు" అని వైభవ్ అన్నాడు
జట్టు వ్యూహాంతో పాటు, కెప్టెన్ రియాన్ పరాగ్‌కు సూర్యవంశీ మీద ఉన్న నమ్మకమే అతనిని దూకుడుగా ఆడేలా ప్రేరేపించింది.
"ఏం జరిగినా సరే, ఈ ఐపీఎల్ నువ్వు టోర్నీలో మొత్తం మ్యాచ్‌లు ఆడతావని నేను వైభవ్‌కు చెప్పాను. మీడియాలో వచ్చే వాటిని పట్టించుకోవద్దు. ప్రశాంతంగా నీ ఆట నువ్వు ఆడు" అని తాను సూర్యవంశీకి చెప్పానని రియాన్ వివరించాడు.
లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పవర్‌ప్లేను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని రాజస్థాన్ రాయల్స్ ప్రణాళిక వేసుకుంది. అందుకే తాము దూకుడుగా ఆడామని సూర్యవంశీ చెప్పాడు.
"పవర్‌ప్లేలో వీలైనన్ని పరుగులు రాబట్టాలన్నదే మా ప్లాన్. మొదట్లో వికెట్ కాస్త నెమ్మదిగా అనిపించింది. కానీ బంతి పాతబడేకొద్దీ బ్యాట్‌పైకి వచ్చింది" అని వైభవ్ అన్నాడు.

ఫొటో సోర్స్, ANI
బ్యాట్‌తో విజృంభణ
సూర్యవంశీ ఆడిన తొలి బంతికే అవుటయ్యే అవకాశం వచ్చినప్పటికీ చెన్నై సూపర్ కింగ్స్ జారవిడిచింది.
సూర్యవంశీ డీప్ మిడ్ వికెట్ మీదుగా భారీ షాట్‌కు ప్రయత్నించినప్పుడు బంతి గాల్లోకి లేచింది. చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు కార్తిక్ శర్మ ఆ క్యాచ్‌ను జారవిడిచాడు.
ఆ తర్వాత సూర్యవంశీ చెలరేగి ఆడాడు. ఫోర్లు, సిక్సర్లు బాదుతూ 17 బంతుల్లో 52 పరుగులు చేసి అవుటయ్యాడు.
సూర్యవంశీ 2025లో 14 ఏళ్ల వయసులో ఐపీఎల్‌లో అడుగు పెట్టాడు.
అతను రాజస్థాన్ రాయల్స్ తరఫున ఏడు మ్యాచ్‌లు ఆడాడు.
ఐపీఎల్ చరిత్రలో 35 బంతుల్లో వంద పరుగులు చేసి రెండో అత్యంత వేగవంతమైన సెంచరీని నమోదు చేశాడు.
గత సీజన్‌లో 206.55 స్ట్రైక్ రేట్‌తో 252 పరుగులు చేశాడు.
"క్రికెట్ బయట జరిగే విషయాల గురించి మేం వైభవ్ మీద ఒత్తిడి చేయడం లేదు. అతను చేయాలనుకున్నవి చేయాలి. అతనికి బ్యాటింగ్ అంటే ఇష్టం. నెట్స్‌లో అతనికి తగినంత ప్రాక్టీస్ ఇస్తాం. అతనిలో చాలా ప్రతిభ ఉంది. అతను మా జట్టులో ఉన్నందుకు ఆనందంగా ఉంది" అని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ పరాగ్ చెప్పాడు.

ఫొటో సోర్స్, ANI, BBC
సీనియర్ల ప్రశంసలు
వైభవ్ సూర్యవంశీ గురించి క్రికెట్ వ్యాఖ్యాత హర్షాభోగ్లే ఎక్స్‌లో మెసేజ్ పోస్ట్ చేశారు.
అందులో "ఈ యువ ఆటగాడు మైదానానికి చాలా మంది ప్రేక్షకులను ఆకర్షిస్తాడు. అతని ఆట చూసేందుకు ప్రజలు సాయంత్రం పూట కొంత సమయం కేటాయిస్తారు. నూర్ బౌలింగ్‌లో అతను కొట్టిన రెండు సిక్సర్లు చూడదగ్గవి" అని రాశారు.
మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ వైభవ్ సూర్య వంశీ ఇన్నింగ్స్‌ను ప్రశంసిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు. ఇంత చిన్నవయసులో అలాంటి కుర్రాడిని నేనిప్పటిదాకా చూడలేదు అని రాశాడు.
"వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ఆటగాడు. క్రికెట్‌లో సంపూర్ణ మాంత్రికుడు. అతను పసివాడిలా కనిపించినా ప్రపంచంలోని ఏ బౌలర్‌నైనా దీటుగా ఎదుర్కొంటాడు. అతను అందరి రికార్డులను బద్దలు కొడతాడనుకుంటున్నా" అని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా చెప్పారు.
"అతను ప్రతి బంతికి సిక్స్ కొట్టాలని ప్రయత్నిస్తాడు. అందులో విజయం సాధిస్తున్నాడు. అతను పరిస్థితిని పట్టించుకోడు. గర్వాన్ని తలకెక్కించుకోడు" అని ఓ యూజర్ రాశాడు.

ఫొటో సోర్స్, ANI
గత సీజన్‌లో 35 బంతుల్లో సెంచరీ
టీ ట్వంటీ క్రికెట్ చరిత్రలో 2025 ఏప్రిల్ 28న నిజంగానే ఉజ్వలమైన రోజు.
ఆ రోజు గుజరాత్ టైటాన్స్ మీద ఆడిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడిన వైభవ్ సూర్యవంశీ 35 బంతుల్లోనే సెంచరీ చేశాడు.
అందులో 11 సిక్సర్లు, 7ఫోర్లు ఉన్నాయి.
అతనిలో ఉన్న అసాధారణ ప్రతిభ ఆ మ్యాచ్‌లో అందరికీ కనిపించింది. అతని ప్రదర్శన చూసి క్రికెట్ ప్రపంచం నిర్ఘాంతపోయింది.
రషీద్ ఖాన్, మహమ్మద్ సిరాజ్, ఇషాంత్ శర్మ, ప్రసిద్ధ్ కృష్ణ వంటి బౌలర్లపై చిన్న కుర్రాడి దూకుడు బ్యాటింగ్ చూసి క్రికెట్ అభిమానులు నివ్వెరపోయారు.
ఆ తర్వాత పంజాబ్ కింగ్స్‌పై 40, చెన్నై సూపర్ కింగ్స్‌పై 57 పరుగులు చేసిన వైభవ్ తనది గాలివాటం ఆటతీరు కాదని నిరూపించాడు.
"ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో వైభవ్ ఆడిన యూత్ టెస్ట్ మ్యాచ్ వీడియో హైలైట్స్‌తో పాటు మరికొన్ని ఇన్నింగ్స్ కూడా చూశాను. ఆస్ట్రేలియాతో జరిగిన ఆ మ్యాచ్‌లో అతను 58 బంతుల్లో 100 పరుగులు చేశాడు. అది చూసిన తర్వాతే ఈ కుర్రాడిలో ప్రత్యేక ప్రతిభ ఉందనిపించింది" అని మాజీ క్రికెటర్ సబా కరీం అన్నారు.
"అతని నుంచి నేను ఇంతటి విధ్వంసకరమైన సెంచరీని ఊహించలేదు. గంటకు 145 కిలోమీటర్లకు పైగా వేగంతో వచ్చిన అద్భుతమైన బంతులను ఈ 14 ఏళ్ల బ్యాట్స్‌మన్ ఎదుర్కొని ఆడటాన్ని చూడటం ఒక అద్భుతమైన అనుభవం" అని సబా కరీం చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)






























