డిజిటల్ రూపాయి అంటే ఏమిటి? యూపీఐకి, దీనికి తేడా ఏంటి?

ఫొటో సోర్స్, AFP via Getty Images
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిటల్ రూపీ ఏమిటి? యూపీఐ, క్రిప్టోకి ఈ డిజిటల్ రూపాయికి తేడా ఏంటి? పైలట్ ప్రాజెక్టులో ఏ బ్యాంకులు పాల్గొనబోతున్నాయి? గత కొంతకాలంగా డిజిటల్ రూపీ గురించి ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్న ప్రశ్నలివి.
ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలను వివరంగా తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం..
వాస్తవంగా.. డిజిటల్ చెల్లింపు వ్యవస్థను విస్తరించాలనే లక్ష్యంతో, కస్టమర్లకు లావాదేవీలను సులభతరం చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫ్‌లైన్ డిజిటల్ రూపీని (e₹) లాంచ్ చేసింది.
రిజర్వ్ బ్యాంక్ ప్రకారం.. డిజిటల్ రూపీ లేదా e₹ అనేది భారత కేంద్ర బ్యాంకుకు చెందిన డిజిటల్ కరెన్సీ (సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ - సీబీడీసీ).

డిజిటల్ రూపీ అంటే ఏమిటి?
డిజిటల్ రూపీ లేదా e₹ అనేది భారత భౌతిక కరెన్సీ రూపాయికి డిజిటల్ రూపం.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) దీన్ని డిజిటల్‌గా జారీ చేస్తుంది. చేతిలో నగదు తరహాలోనే ఇది కూడా పనిచేస్తుంది. నగదుకుండే విలువే దీనికీ ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ దీనికి గ్యారెంటీగా ఉంటుంది.
మీరు దీన్ని మీ ఫోన్‌లోని డిజిటల్ వాలెట్‌లో ఉంచుకోవచ్చు. సాధారణ రూపాయి నోటును ఉపయోగించిన మాదిరిగానే, దీన్ని ఉపయోగించి డబ్బులు పంపవచ్చు, స్వీకరించవచ్చు, చెల్లింపులు కూడా చేయవచ్చు.
డిజిటల్ రూపీ లావాదేవీల కోసం, పైలట్ ప్రాజెక్టులో పాల్గొంటున్న బ్యాంకులు అందించే డిజిటల్ వాలెట్లను కస్టమర్లు వాడుకోవచ్చు.
డిజిటల్ రూపీని ఎవరు జారీ చేస్తారు?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిటల్ రూపీని జారీ చేస్తుంది. పేపర్ కరెన్సీ మాదిరిగానే దీని చెలామణిని కూడా బ్యాంకులు నిర్వహిస్తాయి.
డిజిటల్ రూపీని రిజర్వ్ బ్యాంకే సృష్టిస్తుంది. బ్యాంకులకు, అధీకృత బ్యాంకింగేతర సంస్థలకు ఎలక్ట్రానిక్ రూపంలో ఆర్‌బీఐ పంపిస్తుంది.
ఆ తర్వాత, మొబైల్ ఫోన్లలో డిజిటల్ రూపీ వాలెట్ల ద్వారా ఆయా బ్యాంకులు లేదా బ్యాంకింగేతర సంస్థల ఖాతాదారులు ఈ డిజిటల్ నగదును వాడుకోవచ్చు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన బ్యాంకులు, బ్యాంకింగేతర సంస్థలకు చెందిన ఖాతాదారులు, వ్యాపారులు దీన్ని వాడుకోవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
డిజిటల్ రూపీని ఎలా నిల్వ చేసుకోవచ్చు, ఎలా వాడుకోవచ్చు?
బ్యాంకులు, అధీకృత బ్యాంకింగేతర సంస్థలు అందించే డిజిటల్ వాలెట్లలో డిజిటల్ రూపీని నిల్వ చేసుకోవచ్చు, వాడుకోవచ్చు. ఈ వాలెట్లు నేరుగా వ్యక్తులకు లేదా వ్యాపారులకు చెల్లింపులు చేసుకునేలా సహకరిస్తాయి.
డిజిటల్ రూపీ వాడటం ప్రారంభించేందుకు, ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి డిజిటల్ రూపీ వాలెట్ (e₹ Wallet) యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని, యాప్‌లోని సూచనలను పాటించాలి. మరింత సమాచారం కోసం మీ బ్యాంకును లేదా వాలెట్ ప్రొవైడర్‌ను కూడా సంప్రదించవచ్చు.
చెల్లింపులు చేసేందుకు, స్టోర్‌లో అందుబాటులో ఉన్న సీబీడీసీ క్యూఆర్ కోడ్‌ను లేదా యూపీఐ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా దుకాణదారుడికి మీరు చెల్లింపులు చేయొచ్చు.
అయితే, డిజిటల్ రూపీ వాడేందుకు పొదుపు ఖాతా తప్పనిసరిగా అవసరమా? అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది.
ప్రస్తుతం, డిజిటల్ రూపీ వాలెట్‌ను ఖాతాదారుల పొదుపు ఖాతాకు అనుసంధానించడం ద్వారా తెరుస్తారు. దీనివల్ల ఖాతాదారుని ఆన్‌బోర్డింగ్ ప్రక్రియ సులభతరం కావడమే కాకుండా, ప్రత్యేకంగా కేవైసీ చేయాల్సిన అవసరం కూడా ఉండదు.
ఆర్‌బీఐ వెబ్‌సైట్ ప్రకారం.. ''వాడుకలో ఎదురయ్యే సమస్యలు, ఫీడ్‌బ్యాక్‌ను అనుసరించి, ఖాతాదారుల ఆన్‌బోర్డింగ్ కోసం సరికొత్త మోడల్స్‌ను పరిశీలించనున్నాం'' అని ఆర్‌బీఐ వెబ్‌సైట్ తెలిపింది.
డిజిటల్ రూపీ ప్రస్తుతం పైలట్ దశలో ఉన్నందున.. కేవలం ఎంపిక చేసిన బ్యాంకులు, ఆథరైజ్డ్ బ్యాంకింగేతర సంస్థలకు చెందిన కస్టమర్లు, వ్యాపారులు మాత్రమే దీన్ని వాడుకోగలరు.
దీని కోసం, మీరు e₹ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి, దానిలో రిజిస్టర్ అవ్వాలి. ఆ తర్వాత వాలెట్‌ను వాడటం మొదలు పెట్టవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
యూపీఐకి, దీనికి తేడా ఏంటంటే..
డిజిటల్ రూపీ అనేది యూపీఐ లావాదేవీల మాదిరిగానే అనిపించినప్పటికీ, ఈ రెండింటి మధ్య అనేక తేడాలు ఉన్నాయి.
యూపీఐ లేదా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ అనేది ఒక చెల్లింపు విధానం. అది దానికది డబ్బు కాదు.
ఒక బ్యాంకు అకౌంట్ నుంచి మరో బ్యాంకు అకౌంట్‌కు డబ్బులను బదిలీ చేసుకునేందుకు ఇది అనుమతి ఇస్తుంది.
సరళంగా చెప్పాలంటే.. యూపీఐ అనేది రెండు బ్యాంకు అకౌంట్ల మధ్య డబ్బులను బదిలీ చేసుకునేందుకు వీలు కల్పించే వ్యవస్థ.
అయితే, డిజిటల్ రూపీ అనేది స్వయానా డబ్బు. ఇది డిజిటల్ రూపంలో ఉంటుందంతే.
యూపీఐ వాడుతూ మీరు చెల్లింపులు చేసినప్పుడు, మీ బ్యాంకు అకౌంట్ నుంచి డబ్బులు డిడక్ట్ అవుతాయి.
కానీ, మీరు డిజిటల్ రూపీని ఉపయోగించినప్పుడు, నగదు నోట్లను ఉపయోగించినట్లే మీ వాలెట్‌లో ఉన్న డిజిటల్ నగదును బదిలీ చేస్తారు.
అంతేకాకుండా, యూపీఐ లావాదేవీలకు బ్యాంకుల పాత్ర ఎంతో అవసరం.
కానీ, డిజిటల్ రూపాయి లావాదేవీలు చేతిలో నగదు మాదిరిగా, నేరుగా ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి పంపుకోవచ్చు. భవిష్యత్తులో ఆఫ్‌లైన్ లావాదేవీలు కూడా అందుబాటులోకి రావొచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
డిజిటల్ రూపీ - క్రిప్టో కరెన్సీకి తేడా?
బిట్‌కాయిన్ లేదా ఇతర క్రిప్టో కరెన్సీలను కేంద్ర బ్యాంకు నియంత్రించడం లేదు. అయితే, డిజిటల్ రూపీని రిజర్వ్ బ్యాంక్ నియంత్రిస్తూ, జారీ చేస్తుంది.
డిజిటల్ రూపీ చట్టబద్ధంగా చెలామణిలో ఉంది. అయితే, క్రిప్టోకరెన్సీకి భారత్‌లో చట్టబద్ధమైన చెలామణి హోదా లేదు.
ప్రస్తుతం సీబీడీసీ ఎకోసిస్టమ్‌లో 19 బ్యాంకులు భాగమై, డిజిటల్ రూపీ వాలెట్లను అందిస్తున్నాయి.
ఆ బ్యాంకుల్లో.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యెస్ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, కర్ణాటక బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంక్ ఉన్నాయి.
ఈ బ్యాంకులు మొబైల్ యాప్‌ల ద్వారా సీబీడీసీ వాలెట్లను అందిస్తున్నాయి. ఈ వాలెట్లు డిజిటల్ రూపీని స్టోర్ చేసుకునేందుకు, లావాదేవీలు జరిపేందుకు ఖాతాదారులకు అనుమతి ఇస్తున్నాయి.
ప్రస్తుతం డిజిటల్ రూపీ ప్రతి ఒక్కరికీ అందుబాటులో లేదు. ఇది ఆర్‌బీఐ నియంత్రణలో పైలట్ దశలో ఉంది. మీరు ఈ సేవలు అందిస్తున్న బ్యాంకు కస్టమర్ అయితేనే, ఈ పైలట్ ప్రాజెక్టులో భాగం కావొచ్చు. బ్యాంకులు కూడా ఎంపిక చేసిన యూజర్లను ఆహ్వానించి, క్రమంగా ప్రతిఒక్కరికీ అందుబాటులోకి తేవొచ్చు.
దీనికోసం మీరు బ్యాంక్ సీబీడీసీ వాలెట్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. కేవైసీ పూర్తి చేసి, రిజిస్టర్ కావాలి. మీ బ్యాంకు అకౌంట్‌ను లింక్ చేసుకుని, వాలెట్‌లో డిజిటల్ రూపీని లోడ్ చేసుకోవాలి.
నగదును డిజిటల్ రూపీ భర్తీ చేయగలదా?
డిజిటల్ రూనీని తీసుకొచ్చిన ఉద్దేశం కరెన్సీ ప్రస్తుత రూపాలను తీసివేయడం కాదని, వాటికి అనుబంధంగా ఉంచడమేనని రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేసింది.
భారత్ ముఖ్యంగా గ్రామీణ, అసంఘటిత రంగాలు ఎక్కువగా నగదుపై ఆధారపడ్డాయి. నగదుపై ఉన్న నమ్మకాన్ని నిలబెడుతూనే డిజిటల్ చెల్లింపులను సులభతరం చేస్తుంది డిజిటల్ రూపీ.
ఇది నగదు నిర్వహణ ఖర్చులను తగ్గించడానికి, లావాదేవీల సామర్థ్యాన్ని పెంచడానికి, భవిష్యత్తులో ఆఫ్‌లైన్ డిజిటల్ చెల్లింపులను సాధ్యం చేయడానికి సహాయపడుతుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

































