ముళ్లపందులు మనుషులకు వినిపించని శబ్దాలతో మాట్లాడుకుంటాయా? కొత్త పరిశోధన ఏం చెబుతోంది?

ముళ్ల పందులు, శబ్దాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మనుషుల కంటే చాలా ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న శబ్దాలను ముళ్లపందులు వినగలవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
    • రచయిత, జార్జినా రానార్డ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 4 నిమిషాలు

ముళ్లపందులు కేవలం గుర్రుపెట్టడం, గురకలు తీయడం వంటి శబ్దాల ద్వారానే కాకుండా, అంతకుమించి మరేదో విధంగా సమాచారాన్ని పంచుకుంటున్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ జంతువుల వినికిడి సామర్థ్యంపై చేసిన పరిశోధనలో వారు ఈ విషయాన్ని గుర్తించారు.

ఈ జీవులు మనుషుల కంటే చాలా ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న శబ్దాలను వినగలవని, అంటే మనుషులకు వినిపించని శబ్దాలతో కూడా అవి ఒకదానికొకటి సంకేతాలు ఇచ్చిపుచ్చుకుంటూ ఉండవచ్చని ఈ పరిశోధన చెబుతోంది.

యూకే, యూరప్‌లలో ముళ్లపందుల సంఖ్య తగ్గిపోతున్న తరుణంలో, ఈ ఆవిష్కరణ వాటి పరిరక్షణలో కీలక మార్పుగా మారుతుందని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ సోఫీ రాస్ముసెన్ అభిప్రాయపడ్డారు.

రెస్క్యూ సెంటర్లలో ఈ జంతువులను ఒత్తిడి కలిగించే శబ్దాల నుంచి ఎలా కాపాడాలో అర్థం చేసుకోవడానికి ఈ పరిశోధన ఉపయోగపడుతుంది.

అంతేకాకుండా, ముళ్లపందుల ప్రాణాలకు హాని కలిగించే ప్రమాదమున్న కార్లు, లాన్‌మూవర్లు లేదా స్ట్రిమ్మర్లు వంటి యంత్రాల దరిదాపుల్లోకి అవి రాకుండా నిరోధించే సౌండ్ రిపెల్లెంట్లను అభివృద్ధి చేయడానికి కూడా ఇది దోహదపడుతుంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ముళ్ల పందులు, శబ్దాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, యూరప్‌లో రోడ్డు ప్రమాదాల్లో ఏటా వేల సంఖ్యలో ముళ్లపందులు మరణిస్తున్నాయి.

పరిశోధన ఎలా సాగింది?

"ముళ్లపందులను రక్షించేందుకు ప్రత్యేకమైన 'సౌండ్ రిపెల్లర్లను' తయారు చేయవచ్చా అనే అంశంపై పరిశోధన చేయాలనుకున్నాను. అందుకే మొదటిసారిగా యూరోపియన్ ముళ్లపందుల వినికిడి సామర్థ్యాన్ని గుర్తించేందుకు సిద్ధమయ్యాం" అని రాస్ముసెన్ తెలిపారు.

జంతువుల వినికిడిని కొలిచే బయో-అకౌస్టిషియన్లతో కలిసి ఆమె ఒక ప్రత్యేకమైన సౌండ్‌ట్రాక్‌ను రూపొందించారు. ఒక సంరక్షణ కేంద్రం నుంచి తీసుకువచ్చిన, స్పృహలో లేని ముళ్లపందులకు ఈ శబ్దాలను వినిపించి పరిశోధన సాగించారు.

ముళ్లపందులు ఏ ఫ్రీక్వెన్సీ శబ్దాలను వినగలవో గుర్తించడానికి శాస్త్రవేత్తలు వాటి మెదడు స్పందనలను విశ్లేషించారు.

"ముళ్లపందులు 85 kHz వరకు శబ్దాలను వినగలవని గుర్తించడం నాకు ఎంతో ఆశ్చర్యాన్ని, సంతోషాన్ని కలిగించింది" అని రాస్ముసెన్ అన్నారు.

మనుషులు 20 kHz వరకు వినగలరు, అంతకంటే ఎక్కువ శబ్దాలన్నింటినీ అల్ట్రాసౌండ్ అంటారు. కుక్కలు 45 kHz వరకు వింటాయి, పిల్లులు 65 kHz వరకు వింటాయి.

ముళ్ల పందుల చెవిని పరిశీలించిన శాస్త్రవేత్తలు, దానిలో ఒకదానికొకటి గట్టిగా అల్లుకుపోయిన ఎముకల నిర్మాణాన్ని గుర్తించారు. ప్రతిధ్వనుల సాయంతో ప్రయాణించే గబ్బిలాల తరహాలోనే, ముళ్లపందులు కూడా అతి సూక్ష్మమైన శబ్దాలను చాలా స్పష్టంగా వినడానికి ఈ ఎముకల అమరిక తోడ్పడుతుంది.

"ఈ ఆవిష్కరణ నిజంగా అద్భుతం. దీని ద్వారా మనుషులకు లేదా పెంపుడు జంతువులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, కేవలం ముళ్లపందులను మాత్రమే హెచ్చరించే ప్రత్యేకమైన శబ్ద పరికరాలను తయారు చేయవచ్చు" అని రాస్ముసెన్ వివరించారు.

ముళ్ల పందులు, శబ్దాలు

ఫొటో సోర్స్, Tine Reinholt Jensen

అంతరించిపోయే దశలో..

యూరప్‌లో రోడ్డు ప్రమాదాల్లో ఏటా వేల సంఖ్యలో ముళ్లపందులు మరణిస్తుండటంతో ఈ జీవులను ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్సర్వేషన్ ఆఫ్ నేచర్ దాదాపు అంతరించిపోయే దశలోని జంతువుల జాబితాలో చేర్చింది.

కార్లు, లాన్‌మూవర్లు లేదా స్ట్రిమ్మర్ల దరిదాపుల్లోకి ముళ్లపందులు రాకుండా నిరోధించేలా ఆడియో డివైజ్‌లు రూపొందించడం కోసం వివిధ కంపెనీలతో పనిచేయాలని రాస్ముసెన్ భావిస్తున్నారు.

జింకల వంటి పెద్ద జంతువులు వాహనాలకు దగ్గరగా రాకుండా ఉండేందుకు కొన్ని కార్లకు ఇప్పటికే ప్రత్యేక పరికరాలను అమర్చుతున్నారు. 'అల్ట్రాసోనిక్ విజిల్స్' ప్రస్తుతం మార్కెట్లో విస్తృతంగా అందుబాటులో ఉన్నాయని సొసైటీ ఆఫ్ మోటార్ మ్యాన్యుఫ్యాక్చరర్స్ అండ్ ట్రేడర్స్(ఎస్ఎంఎంటీ) తెలిపింది.

"ఈ అధ్యయనం ప్రకారం రోడ్లపై ముళ్లపందులకు మెరుగైన రక్షణ లభించే అవకాశం ఉన్నప్పటికీ, ఈ పరికరాల పనితీరును అర్థం చేసుకోవడానికి లోతైన పరిశోధన అవసరం" అని ఎస్ఎంఎంటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మైక్ హావ్స్ బీబీసీ న్యూస్‌తో చెప్పారు.

ముళ్లపందులను ఏ విధమైన శబ్దాలు దూరంగా ఉంచుతాయో తెలుసుకోవడానికి మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని రాస్ముసెన్ కూడా అభిప్రాయపడ్డారు.

"అవి కేకలు వంటి శబ్దాలకు భయపడతాయా లేదా పల్సేటింగ్ సౌండ్‌కు దూరంగా ఉంటాయా అనేది చూడాలి" అన్నారు.

అదే సమయంలో, ఈ శబ్దాల వల్ల ముళ్లపందులు తోటలకు దూరమవ్వకుండా జాగ్రత్త పడటం కూడా ముఖ్యం. ఎందుకంటే, గ్రామీణ ప్రాంతాలు వాటి నివాసానికి అనుకూలంగా లేకపోవడంతో, తోటలే ఇప్పుడు వాటికి ప్రధాన ఆవాసాలుగా మారాయి.

మనమే వినలేకపోతున్నామా?

ముళ్ల పందుల శబ్ద ప్రపంచం గురించి మన అవగాహనను ఈ పరిశోధన మరింత విస్తృతం చేస్తుందని డా. రాస్ముసెన్ అభిప్రాయపడ్డారు.

యూకేలో ప్రతి ఏటా వేల సంఖ్యలో ముళ్ల పందులను సంరక్షణ కేంద్రాలకు తీసుకువస్తుంటారు. అక్కడ యంత్రాల నుంచి వచ్చే శబ్దాలు మనుషులకు వినిపించకపోయినా, ముళ్లపందులకు తీవ్రమైన ఒత్తిడిని కలిగించే ప్రమాదం ఉంది. అంతేకాకుండా, ముళ్లపందులు ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటూ ఉండవచ్చు కూడా.

"ముళ్లపందులు పక్కపక్కన వెళ్తున్నప్పుడు, పరస్పరం స్పందించుకోవడం గమనించవచ్చు. బహుశా అవి ఒకదాని వాసనను మరొకటి పసిగట్టినప్పుడు కలిగే ప్రతిచర్యలు కావచ్చు" అని రాస్ముసెన్ అన్నారు.

"కానీ, ముళ్లపందులు నిరంతరం ఏదో ఒకటి మాట్లాడుకుంటూనే ఉన్నాయని, కేవలం మనం మాత్రమే వాటిని వినలేకపోతున్నామని ఒక్కసారి ఊహించుకోండి" అంటున్నారు రాస్ముసెన్.

ఈ పరిశోధన 'బయాలజీ లెటర్స్' లో ప్రచురితమైంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)