నేపాల్ మాజీ ప్రధాని కేపీ ఓలీ, మాజీ హోమ్ మంత్రి రమేశ్ లేఖక్ అరెస్ట్

ఫొటో సోర్స్, Getty Images
నేపాల్ మాజీ ప్రధానమంత్రి, నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ (యూఎంఎల్) నేత కేపీ శర్మ ఓలీని, మాజీ హోమ్ మంత్రి రమేశ్ లేఖక్‌ను అరెస్ట్ చేసినట్లు నేపాల్ పోలీసు అధికార ప్రతినిధి అభినారాయణ్ కాఫ్లే తెలిపారు.
ఓలీని, రమేశ్ లేఖక్‌ను కాఠ్‌మాండూ పోలీసు కాంపౌండ్‌కు తరలించినట్లు బీబీసీకి చెప్పారు కాఫ్లే.
విచారణ కమిషన్ నివేదికను వెంటనే అమలు చేయాలన్న మంత్రివర్గ నిర్ణయం మేరకు మాజీ ప్రధానిని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు.
ర్యాపర్ నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన బాలేంద్ర షా (బాలెన్ షా) శుక్రవారం నేపాల్ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

గత ఏడాది యువత నిరసనలు చేపట్టిన తర్వాత నేపాల్ లో జరిగిన తొలి ఎన్నికల్లో బాలెన్ షా ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ విజయం సాధించింది.
''ప్రస్తుతం ఆయనపై నిబంధనల ప్రకారం చట్టపరమైన చర్యలు కొనసాగుతాయి. చట్టం అందరికీ సమానంగా వర్తించాలనే ఉద్దేశంతో కేపీ శర్మ ఓలీని అరెస్ట్ చేశాం'' అని కాఫ్లే తెలిపారు.
ఓలీని భక్తపూర్‌లో అరెస్ట్ చేయగా.. లేఖక్‌ను భక్తపూర్‌లోనే ఉన్న కటుంజేలోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
''ఈరోజు (శనివారం) ఉదయం వీరిని అరెస్ట్ చేశాం. చట్టానికి అనుగుణంగా వీరిపై తదుపరి చర్యలు ఉంటాయి. ఓలీకి, లేఖక్‌కు వ్యతిరేకంగా ఇప్పటి వరకు ఎలాంటి అభియోగాలు దాఖలు చేయలేదు'' అని కాఠ్‌మాండూ వ్యాలీ పోలీసు అధికార ప్రతినిధి ఓం అధికారి వార్తా సంస్థ ఏఎఫ్‌పీకి తెలిపారు.

ఫొటో సోర్స్, Nepal Photo Library
ఎందుకు అరెస్ట్ చేశారు?
గత ఏడాది జరిగిన జెన్ జడ్ నిరసనలపై విచారణ చేసేందుకు గౌరి బహదూర్ కర్కి నేతృత్వంలో విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేశారు.
సుశీలా కర్కి నేతృత్వంలోని గత ప్రభుత్వానికి ఈ కమిషన్ తన నివేదికను సమర్పించింది.
సెప్టెంబర్ నెలలో జరిగిన ఈ నిరసనల్లో, 70 మంది మరణించగా.. నేపాల్‌లో భారీ ఆస్తి నష్టం జరిగింది.
మరణించిన వారిలో చాలామంది పోలీసుల కాల్పుల్లోనే ప్రాణాలు కోల్పోయారు.
కమిషన్ నివేదికను ఓలీ గతంలో తిరస్కరించారు. మాజీ పోలీస్ చీఫ్ చంద్ర కుబేర్ ఖఫుంగ్‌ను కూడా అరెస్టు చేయాలని ఈ కమిషన్ సిఫార్సు చేసింది.
ఇది ఒకరి ప్రతిష్టను దెబ్బతీయడమని, ద్వేషపూరిత రాజకీయాలకు నిదర్శనమని అన్నపూర్ణ పోస్టు దినపత్రికతో ఓలీ అన్నారు.
అయితే, కమిషన్ నివేదికను ప్రభుత్వం ఇంకా అధికారికంగా బహిర్గతం చేయలేదు. కానీ, కొన్ని రోజుల క్రితం ఈ నివేదికలోని వివరాలు మీడియాకు లీక్ అయ్యాయి.
నేషనల్ ఇండిపెండెంట్ పార్టీ నాయకుడు బాలెన్ షా నేతృత్వంలో శుక్రవారం ఏర్పాటైన మంత్రివర్గ తొలి సమావేశంలో ఇతర అంశాలతో పాటు ఈ నివేదికను తక్షణమే అమలు చేయాలని నిర్ణయించింది.
ఆ తర్వాత కొద్దిసేపటికే, కొత్తగా నియమితులైన హోమ్ మంత్రి సుధన్ గురుంగ్, సీనియర్ భద్రతా అధికారుల మధ్య పలు చర్చలు జరిగినట్లు నివేదికలు వచ్చాయి.

ఫొటో సోర్స్, RSS
హోమ్ మంత్రి గురుంగ్ ఏమన్నారు?
నేపాల్ మాజీ ప్రధాని, మాజీ హోమ్ మంత్రి అరెస్ట్‌పై ప్రస్తుత మంత్రి గురుంగ్ తన ఫేస్‌బుక్ పేజీపై స్పందించినట్లు బీబీసీ నేపాలీ తెలిపింది.
జెన్ జడ్ ఉద్యమ సమయంలో ప్రాణాలు కోల్పోయిన ఒక వ్యక్తి మృతదేహానికి నివాళులర్పిస్తున్న ఫోటోను కూడా ఆయన షేర్ చేశారు.
''ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాల్సిందే. చట్టానికి ఎవరూ అతీతులు కారు. మేం మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీని, మాజీ హోమ్ మంత్రి రమేశ్ లేఖక్‌ను అదుపులోకి తీసుకున్నాం. ఇది ఎవరిపైనా ప్రతీకారం కాదు. న్యాయానికి నాంది'' అని సుధన్ గురుంగ్ ఇంగ్లీష్‌లో రాశారు.
ఇక ఇప్పుడు దేశం సరికొత్త దిశను అందిపుచ్చుకుంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)































