ఆర్ఎస్‌వీ: శిశువులకు సోకే ఈ వైరస్‌ను టీకా అడ్డుకుంటుందా, గర్భిణులు ఏ సమయంలో టీకా తీసుకోవాలి?

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఫిలిప్పా రాక్స్‌బీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 4 నిమిషాలు

గర్భిణిగా ఉన్న సమయంలో మహిళలకు ఇచ్చే ఓ టీకా నవజాత శిశువులకు ఎంతో మేలు చేస్తోంది. ఈ టీకా అప్పుడే పుట్టిన పిల్లలను ఛాతీ సంబంధిత ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతోందని, దీని వల్ల ఈ సమస్యలతో ఆసుపత్రుల్లో చేరే శిశువుల సంఖ్య 80 శాతానికి పైగా తగ్గిందని బ్రిటన్‌ వైద్య అధికారి ఒకరు చెప్పారు.

ఆర్‌ఎస్‌వీ (రెస్పిరెటరీ సింసీషియల్ వైరస్) అనే వైరస్ శిశువులు జన్మించిన కొన్ని రోజులకే సోకుతుంది. దీని వల్ల వాళ్లు ఊపిరి తీసుకోడానికి ఇబ్బంది పడతారు. పాలు తాగడం కష్టమవుతుంది.

బ్రిటన్‌లో ఈ వైరస్‌తో ఏటా 20వేల మంది కంటే ఎక్కువమంది పిల్లలు ఆసుపత్రుల్లో చేరుతున్నారు. అయితే దీని నివారణకు 2024 నుంచి గర్భంతో ఉన్న మహిళలకు టీకాలు ఇవ్వడం మొదలుపెట్టారు. 28వారాల గర్భంతో ఉన్న మహిళలకు ఈ టీకా ఇవ్వడం ద్వారా వారి బిడ్డలను కాపాడుతున్నారు.

ఛాతీ సంబంధిత ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఉన్న చిన్నారులకు ఈ టీకా "అద్భుతమైన రక్షణ" ఇస్తుందని, వ్యాక్సిన్ ప్రభావాన్ని విశ్లేషించిన తాజా అధ్యయనం వెల్లడించిందని బ్రిటన్ హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ, యూకేహెచ్ఎస్ఏ తెలిపింది.

ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
Sorry, we can’t display this part of the story on this lightweight mobile page.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గర్భిణులు వ్యాక్సిన్ వేయించుకున్నప్పుడు వారి రోగ నిరోధక శక్తి పెరిగి అది వారికి పుట్టే బిడ్డలకు చేరుతుంది.

ఏమిటీ ‘రెస్పిరెటరీ సింసీషియల్ వైరస్’?

ఏడాది లోపు శిశువులు ఆసుపత్రిలో చేరడానికి దారి తీసే అనారోగ్య కారణాలలో 'రెస్పిరేటరీ సింసీషియల్ వైరస్' ఒకటి. శిశువుల్లో సగం మందికి ఈ వైరస్ సోకుతోంది. దీని వల్ల జలుబు చేయడంతో పాటు ఊపిరితిత్తుల్లో వాపు ఏర్పడి, ప్రాణాంతకంగా మారే ఛాతీ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. ఈ వైరస్ కారణంగా ప్రతీ ఏటా కొంతమంది పిల్లలు చనిపోతున్నారు.

"ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉన్న పిల్లలు ఆక్సిజన్ పీల్చుకోడానికి ప్రయత్నించినప్పుడు వారి ఛాతీ, ఊపిరితిత్తులు ఇబ్బంది పడటం మీరు గమనించవచ్చు" అని యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీలో ఆర్ఎస్‌వీ నేషనల్ ప్రోగ్రామ్ లీడ్ డాక్టర్ కొనాల్ వాట్సన్ చెప్పారు.

"తల్లిదండ్రులకు ఇది చాలా ఆందోళన కలిగించే అంశం. వారి ఆందోళనలో అర్థం ఉంది" అంటారు వాట్సన్.

ఈ వ్యాక్సిన్ గర్భిణులలో రోగ నిరోధక శక్తిని పెంచి దాన్ని ప్లెసెంటా ద్వారా పిల్లలకు అందిస్తుందని క్లినికల్ ట్రయల్స్‌లో తేలిన తర్వాత ఈ కొత్త వ్యాక్సిన్‌ను 2024లో యూకేలో అందుబాటులోకి తెచ్చారు.

బిడ్డ పుట్టడానికి నెల రోజుల ముందు గర్భిణులకు ఈ టీకా ఇచ్చినా కూడా పిల్లలకు ఇది 85 శాతం రక్షణ కల్పిస్తుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది.

ప్రసవానికి రెండు వారాల ముందు ఈ వ్యాక్సిన్ వేసుకున్నా శిశువులకు రక్షణ అందుతుందని అధ్యయనం తెలిపింది.

"టీకా తీసుకోవడానికి, ప్రసవానికి మధ్య ఎక్కువ సమయం ఉంటే మరింత మెరుగైన రక్షణ లభిస్తుంది" అని డాక్టర్ వాట్సన్ చెప్పారు.

"వ్యాక్సిన్ సరైన సమయానికి వేయించుకోండి. వీలుకాకపోతే 9 నెలలు నిండేలోగా టీకా వేయించుకోండి" అని ఆయన సూచించారు.

వ్యాక్సిన్ పని తీరుపై అధ్యయనాన్ని 2024 సెప్టెంబర్ నుంచి 2025 మార్చి మధ్య నిర్వహించారు. ఇందులో భాగంగా ఈ సమయంలో పుట్టిన 3 లక్షల మంది చిన్నారులను పరిశీలించారు. ఇది ఆ సమయంలోని మొత్తం జననాలలో 90శాతం.

4,500 మందికి పైగా చిన్నారులు ఆసుపత్రుల్లో చేరారు. వీరిలో మెజార్టీ పిల్లల తల్లులు ఆర్ఎస్‌వీ వ్యాక్సిన్ తీసుకోలేదు.

ఫొటో క్యాప్షన్, మలాకీ చిన్నతనంలోనే జలుబుచేసింది. తరువాత అది ముదిరిపోయింది. దీని కారణంగా మలాకీ మెదడు తీవ్రంగా దెబ్బతిండి.

మలాకీ విషయంలో ఏం జరిగింది?

లీన్ లూయిస్ కుమారుడికి ప్రస్తుతం 12 ఏళ్లు. అతను పుట్టే నాటికి ఆర్ఎస్‌వీ వ్యాక్సిన్ అందుబాటులో లేదు.

అతనికి చిన్నతనంలోనే జలుబు చేయడం, అది ముదిరిపోవడంతో ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి వచ్చింది.

అక్కడ పరీక్షలు చేసిన తర్వాత అతనికి 'రెస్పిరెటరీ సింసీషియల్ వైరస్' సోకినట్లు గుర్తించారు. ఆక్సిజన్ పెట్టారు. ఆ తర్వాత అతను ఊపిరి తీసుకోవడం ఆగిపోయింది. ఆ తర్వాత చేసిన స్కానింగ్‌లో అతని మెదడు తీవ్రంగా దెబ్బతిన్నట్టు తేలింది. అందుకే గర్భం దాల్చిన ప్రతిమహిళ ఆర్ఎస్‌వీ వ్యాక్సిన్ తీసుకోవాలని లీన్ లూయిస్ చెబుతున్నారు.

మలాకీ విషయంలో జరిగింది చాలా అరుదైన సంఘటన.

"గర్భిణులు ఆర్ఎస్‌వీకి వ్యాక్సిన్ తీసుకోవాలని చెబుతాను. ఎందుకంటే అది పిల్లలకు సాయపడుతుంది" అని మలాకీ తల్లి చెప్పారు.

"శీతాకాలంలో పిల్లలను సురక్షితంగా ఉంచడంలో ఈ వ్యాక్సిన్ చాలా అద్భుతంగా పని చేస్తుంది" అని డాక్టర్ వాట్సన్ అన్నారు.

ఇంగ్లండ్‌లో 64శాతం మంది మహిళలు ఆర్ఎస్‌వీ వ్యాక్సిన్ వేయించుకున్నట్లు తాజా గణాంకాలు చెబతున్నాయి. అయితే లండన్‌లో ఇది 53శాతంగా ఉంది.

గర్భం ధరించిన తర్వాత ఆర్ఎస్‌వీ వ్యాక్సిన్‌తో పాటు ఫ్లూ, కోరింత దగ్గు వ్యాక్సిన్లు కూడా వేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

బ్రిటన్‌లో 75 ఏళ్లు పైబడిన వృద్ధులు, వృద్ధుల సంరక్షణ గృహాలలో నివసించే వారికి కూడా ఆర్ఎస్‌వీ టీకా వేస్తున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)