ఇరాన్,లెబనాన్: కాల్పుల విరమణ చరిత్రను మలుపు తిప్పుతుందా?

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, కాల్పుల విరమణ ప్రకటన తర్వాత నిరాశ్రయులైన ప్రజలు దక్షిణ లెబనాన్‌లోని తమ నివాసాలకు చేరుకుంటున్నారు.
    • రచయిత, పాల్ ఆడమ్స్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 6 నిమిషాలు

ఇరాన్, లెబనాన్‌లో రెండుచోట్లా కాల్పుల విరమణ అమల్లో ఉండటం మధ్యప్రాచ్యంలో చారిత్రక పురోగతికి బాటలు వేయనుందా?

ఇరాన్, లెబనాన్‌లో కాల్పుల విరమణను ‘‘అస్థిరమైనవిగా’’ అభివర్ణిస్తున్నారు. కాల్పుల విరమణ విషయంలో ఇలాంటి అభిప్రాయం సహజం కూడా.

యుద్ధ పరిస్థితులు తగ్గు ముఖం పడుతున్నందున ఇది అవకాశంతో పాటు ప్రమాదంతో ముడి పడిన సమయం. ఎటూ తేల్చుకోలేని పరిస్థితి. కాల్పుల విరమణ ముగిశాక ఏమైనా జరగొచ్చు.

ఇరాన్ మద్దతున్న హిజ్బొల్లా, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధానికి 10 రోజుల విరామం ఇస్తున్నట్లు గురువారం రాత్రి చేసిన ప్రకటన ఇరాన్‌కు గెలుపు లాంటిదే.

లెబనాన్‌లో కాల్పుల విరమణ అమలు చేయాలని డిమాండ్ చేసిన తెహ్రాన్ నాయకత్వం అది జరక్కుండా అమెరికాతో చర్చల్లో పురోగతి కోరుకోవద్దని చెబుతోంది.

ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
Sorry, we can’t display this part of the story on this lightweight mobile page.

యుద్ధం ఆగిపోయిన తర్వాత హార్ముజ్ జలసంధిని తెరుస్తున్నట్లు ప్రకటించిన ఇరాన్ తర్వాత మళ్లీ మూసేసింది.

లెబనాన్‌లో యుద్ధం కొనసాగుతున్నప్పటికీ గత వారాంతంలో ఇస్లామాబాద్‌లో సుదీర్ఘ చర్చల్లో పురోగతి సాధ్యమేననిపించింది. అయితే చర్చల్లో లెబనాన్ అంశం కూడా ఉండాలని ఇరాన్, పాకిస్తాన్ పట్టుబట్టాయి.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, సౌత్ లెబనాన్‌లో ఐక్యరాజ్య సమితి బలగాలు( ఫైల్ ఫోటో)

కాల్పుల విరమణపై ఇజ్రాయెలీల అసంతృప్తి

ఇజ్రాయెల్ మీదకు హిజ్బొల్లా మరో రాకెట్‌ ప్రయోగించకుండా ఆపడానికి బదులు, బెంజమిన్ నెతన్యాహు అమెరికా ఒత్తిడికి లొంగిపోయారని ఇజ్రాయెలీలు భావిస్తున్నారు.

ఈ కాల్పుల విరమణ ఇరాన్‌కు అనుకూలంగా మారుతుందని కొంతమంది ఇజ్రాయెలీలు భావిస్తున్నారు. భవిష్యత్ పరిణామాలను నిర్ణయించే పరిస్థితి ఇజ్రాయెల్ బద్దశత్రువు చేతికి చిక్కుతుందని వారు అనుకుంటున్నారు.

"ఈ కాల్పుల విరమణ వల్ల ఇజ్రాయెల్ పక్కన పెట్టాలనుకుంటున్న అంశానికే ఆమోద ముద్ర వేసినట్లు ఉంది. ఇరాన్, లెబనాన్ కలిసి చేస్తున్న కార్యకలాపాలను ఇది చట్టబద్దం చేస్తుంది" అని 'ఇజ్రాయెల్ హయోమ్'కు చెందిన షిరిత్ అవిటాన్ కోహెన్ రాశారు.

"ఈ ప్రాంతంలో ఏం జరగాలో నిర్ణయించేది తానేనని, ఇప్పటికీ పరిస్థితులు తన చేతుల్లోనే ఉన్నాయని లెబనాన్, హిజ్బొల్లాకు తమ మాస్టర్ నుంచి తుది నిర్థరణ లభించింది" అని కొహెన్ తెలిపారు.

వాస్తవానికి ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న ఈ వివాదాలలో భాగస్వాములందరూ తాజా ఒప్పందంతో లబ్ధి పొందుతారు.

కాల్పుల విరమణ ఘనతను దక్కించుకోవడానికి అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, ఇరాన్ నాయకత్వానికి ఇదొక అవకాశం.

దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్ సైనికులు ఇంకా క్షేత్రస్థాయిలో ఉన్నారని నెతన్యాహు చెప్పవచ్చు.

అయితే లెబనీస్ ప్రభుత్వం నెలల తరబడి ప్రయత్నించిన తర్వాత ఇజ్రాయెల్‌తో ప్రత్యక్షంగా చర్చలు జరుపుతోంది.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, అమెరికాను ఇరాన్ బ్లాక్ మెయిల్ చేసే పరిస్థితి రానివ్వనని ట్రంప్ చెబుతున్నారు.

ఇరాన్ ఆధిపత్యం తగ్గించే యత్నం

కాల్పుల విరమణకు కట్టుబడి ఉంటామని చెబుతున్నప్పటికీ తామింకా ఓడిపోలేదని, తమను నిరాయుధులను చేయలేరని హిజ్బొల్లా చెబుతోంది.

ఇప్పటికీ తమ వేలు ట్రిగ్గర్ మీదే ఉందని అంటోంది.

"పూర్తిగా నిజమైన కాల్పుల విరమణ జరగాలి. ఇజ్రాయెల్ వైదొలగాలి. ఖైదీలు తిరిగి రావాలి. వెళ్లిపోయిన ప్రజలు రావాలి. పునర్నిర్మాణం జరగాలి. అప్పటి వరకు హిజ్బొల్లా ఆయుధాల గురించి మాట్లాడేందుకు వీలు పడదు" అని హిజ్బొల్లా సీనియర్ నాయకుడు వాఫిక్ సఫా బీబీసీతో చెప్పారు.

"ఇజ్రాయెల్- లెబనాన్ నేరుగా చర్చలు జరపడానికి కాల్పుల విరమణ బాట వేసింది. అయితే రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందానికి అడ్డంగా ఉన్న అంశాలు చాలా పెద్దవి" అని లండన్‌లోని థింక్ ట్యాంక్ ఛాథం హౌస్‌కి చెందిన లినా ఖాతిబ్ అన్నారు.

"ఈ అంశం చాలా క్లిష్టమైనది. ఇది సరిహద్దుల నిర్ధరణ, హిజ్బొల్లా నిరాయుధీకరణ, లెబనీస్ భూభాగం నుండి ఇజ్రాయెల్ వైదొలగడం లాంటి వాటితో ముడిపడి ఉంది" అని ఆమె అన్నారు.

ఇజ్రాయెల్ – లెబనాన్ మధ్య 1948 నుంచి యుద్ధం జరుగుతోంది. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు లేవు.

వాషింగ్టన్‌లో ఇజ్రాయెల్- లెబనాన్ రాయబారుల మధ్య జరిగిన చర్చల్లో ఈ ప్రాంతంలో ఇరాన్ స్థానాన్ని బలోపేతం చేయడానికి బదులు లెబనాన్‌ను ఇరాన్ చేతుల్లో నుంచి తప్పించే ప్రక్రియపై దృష్టి పెట్టినట్లు ఖాతిబ్ చెబుతున్నారు.

"ఈ ప్రాంతంలో అధికార సమతుల్యత అనేది ఇరాన్ నుంచి దూరం అవుతోంది. దీని వల్ల అది ఇక లెబనాన్‌ను బేరసారాల కోసం వాడుకోలేదు" అని ఆమె అన్నారు.

అయితే మిడిల్ ఈస్ట్‌లో అధికార సమతుల్యత విషయంలో అమెరికా- ఇరాన్ మధ్య జరుగుతున్న చర్చల్లో చాలా జరగవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గతేడాది ఇరాన్‌లోని ఇస్ఫహాన్ అణు శుద్ధి స్థావరంపై అమెరికా బాంబు దాడులు చేసింది.

ఇరాన్ ‘అణుధూళి’ని అప్పగిస్తుందా?

మధ్య ప్రాచ్యంలో ఇరాన్‌ను దుష్ట దేశంగా చూపించాలని అమెరికా, ఇజ్రాయెల్ ప్రయత్నిస్తున్నాయి. ఇస్లామాబాద్‌లో రెండో విడత చర్చలు జరిగితే ఇరాన్ విషయంలో ఇప్పటి వరకు మిడిల్ ఈస్ట్‌లో వాషింగ్టన్ అమలు చేస్తున్న అజెండాలో మార్పు రావచ్చు. హిజ్బొల్లా, హమాస్, హూతీలకు ఇరాన్ అందిస్తున్న ఆయుధ, ఆర్థిక మద్దతును ఆపడం ఇజ్రాయెల్‌కు చాలా ముఖ్యం.

ప్రాంతీయంగా తమ బలాన్ని ప్రదర్శించడంలో కీలక సాధనంగా ఉన్న వాటిని ఇరాన్ అంత తేలిగ్గా వదులుకోకపోవచ్చు.

అయితే ముందున్న భయంకరమైన సవాళ్లలో అది ఒకటి మాత్రమే.

మిగిలినవి.. ఇరాన్ అణు కార్యక్రమం, హార్ముజ్ జలసంధి చర్చల్లో కీలకంగా మారనున్నాయి.

డోనల్డ్ ట్రంప్ గతంలో మాదిరిగానే అంతా తన అదుపులో ఉందని చెప్పేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఇరాన్‌తో ఒప్పందం "చాలా దగ్గరలో" ఉందని, యుద్ధం "చాలా సజావుగా" సాగుతోందని చెబుతున్నారు.

గతేడాది బాంబు దాడులు జరిగిన ఇస్ఫహాన్‌లో పాతిపెట్టి ఉందని భావిస్తున్న సుమారు 440 కేజీల యురేనియం( ట్రంప్ దీనిని "అణు ధూళి" అని పిలుస్తున్నారు) అప్పగించడానికి ఇరాన్ అంగీకరించిందని ట్రంప్ మీడియాతో అన్నారు.

అయితే ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘేయి ఈ వాదనను ఖండిస్తున్నారు.

"అమెరికాకు యురేనియం ఇచ్చే ప్రతిపాదనను మేం ప్రస్తావించలేదు. ఇరాన్ శుద్ధి చేసిన యురేనియం మాకు ఇరాన్ నేల అంతటి పవిత్రమైనది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎవరికీ ఇచ్చేది లేదు" అని ఆయన ప్రభుత్వ టీవీ చానల్‌తో చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, హార్ముజ్‌ను మూసివేసిన ఇరాన్

హార్ముజ్‌పై ఇరాన్ పట్టు

ఇరాన్ అణు శుద్ధి కార్యక్రమంపై జరిగే ఏ ఒప్పందంలోనైనా ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధం తయారు చేయదనే హామీతో పాటు యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని ఎంత కాలంపాటు నిలిపి వేస్తారనే దానిపై స్పష్టత ఉండాలి.

ఇరాన్ వద్ద ఉన్న మరో ఆయుధం హార్ముజ్ జలసంధి.

ఇరుకైన జలమార్గం గుండా జరిగే సముద్ర రవాణాను నియంత్రించడానికి కొత్త నియమావళిని కోరుకుంటున్నట్లు ఇరాన్ చెబుతోంది.

హార్ముజ్‌ జలసంధిలోకి వచ్చే నౌకల నియంత్రణపై కొత్త నియమావళి ఉండాలని ఇరాన్ కోరుతోంది. ప్రస్తుతం తనకున్న పట్టును పక్కన పెట్టి, హార్ముజ్‌లో నౌకల రాకపోకల్ని నియంత్రించేందుకు ఒమన్‌తో పాటు తనకు సార్వభౌమ అధికారాన్ని చట్టబద్దంగా గుర్తించాలని ఇరాన్ కోరుతోంది.

ఇరాన్‌తో జరిగిన చివరి ప్రధాన ఒప్పందం, 2015 నాటి జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఇది కేవలం అణు సమస్య పరిష్కారానికి నిర్దేశించింది. దీనిపై చర్చలు జరపడానికి సుమారు 20 నెలల సమయం పట్టింది. 2018లో ట్రంప్ ఈ ఒప్పందం నుంచి వైదొలగారు.

ట్రంప్ తాను వేగంగా ఒప్పందాలు కుదుర్చుకునేవాడినని చెప్పుకోవడానికి ఇష్టపడతారు.. కానీ వాటి వల్ల ఏదైనా ప్రయోజనం చేకూరిందా లేదా అని వెనక్కి తిరిగి చూసుకోరు.

2018-19లో ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్‌తో ఆయన జరిపిన రెండు శిఖరాగ్ర సమావేశాల చుట్టూ ఎంత హడావిడి జరిగినా, వాస్తవానికి ఆ సమావేశాల వల్ల సాధించింది చాలా తక్కువ. ప్యాంగ్‌యాంగ్ తన అణు కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది.

మిడిల్ ఈస్ట్‌లో 6 వారాల అల్లకల్లోల పరిస్థితుల తర్వాత దౌత్య ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది.

లెబనాన్‌లో కాల్పుల విరమణ తరువాత దానికి మరింత ఊపు లభించింది.

అయితే మళ్లీ యుద్ధం రాకుండా ఉండేందుకు ఇది సరిపోతుందా? ఆ విషయం ట్రంప్‌కు కూడా తెలియకపోవచ్చు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)