బ్రిటిష్ సైనిక స్థావరానికి సమీపంలో జన్మించిన వందల మంది చిన్నారుల తండ్రులెవరు? డీఎన్‌ఏ పరీక్షలు తేల్చుతున్న నిజాలు
- రచయిత, జోస్‌ఫైన్ కాస్సెర్లీ, ఇవానా డేవిడోవిక్
- హోదా, బీబీసీ న్యూస్
- చదివే సమయం: 7 నిమిషాలు
తొమ్మిదేళ్ల కెన్యా బాలుడు ఎడ్వర్డ్ తన తండ్రి బ్రిటిష్ సైన్యంలో పనిచేశారని తెలుసుకుంటూ పెరిగాడు. తన తోటి పిల్లల కంటే అతని చర్మం రంగు లేతగా ఉండటం వల్ల ఏళ్ల తరబడి వేధింపులకు గురయ్యాడు.
ఎడ్వర్డ్ (అసలు పేరు కాదు) పుట్టకముందే అతని తండ్రి వెళ్లిపోవడంతో, అతని తల్లి తీవ్ర పేదరికంలో జీవిస్తోంది. ఆమెను కొందరు కుటుంబసభ్యులు దూరం పెట్టారు.
కెన్యాలోని బ్రిటిష్ సైనిక స్థావరంలో కాంట్రాక్టర్‌గా పనిచేసిన ఆ వ్యక్తి(ఎడ్వర్డ్ తండ్రి)తో పాటు అక్కడ సేవలందించిన మరో 19 మంది సైనికులను ఆ స్థావరం సమీపంలో పుట్టిన పిల్లలకు తండ్రులుగా గుర్తించారు. సంచలనాత్మక డీఎన్ఏ పరీక్షలు, న్యాయ ప్రక్రియ ద్వారా ఇది తేల్చారు.
యూకేలోని అత్యున్నత ఫ్యామిలీ కోర్ట్ జడ్జ్ ఇప్పటివరకు ఇలాంటి 12 కేసుల్లో పిల్లల తండ్రులెవరనేది నిర్ధరించినట్లు బీబీసీ వరల్డ్ సర్వీస్ ఇన్వెస్టిగేషన్ వెల్లడించింది.
ఈ ప్రక్రియ ద్వారా తమ తండ్రులు ఎవరు? వారు ఎక్కడ ఉన్నారు అనే విషయాల్లో స్పష్టత లేని పిల్లలకు సమాధానాలు లభిస్తున్నాయి.
కొందరికి తమ తండ్రులు మరణించారని చెప్పారు. వీరందరూ తమ వారసత్వానికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునే ప్రయత్నాలలో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
ఇప్పటివరకు నిర్ధరించిన 12 మంది బ్రిటిష్ పౌరసత్వం కోసం నమోదు చేసుకునేందుకు అర్హత పొందారు.
18 ఏళ్లలోపు వారు, ఇంకా చదువుకుంటున్న వారు చైల్డ్ సపోర్ట్‌కు అర్హత పొందారు.
అలా వందకు పైగా పిల్లలు పుట్టారు
కెన్యాలోని బ్రిటిష్ ఆర్మీ ట్రైనింగ్ యూనిట్(బీఏటీయూకే) సమీపంలో బ్రిటిష్ సైనికుల కారణంగా జన్మించిన పిల్లల కేసులు దాదాపు 100 వరకు నమోదు అయ్యాయని యూకేకు చెందిన న్యాయవాది జేమ్స్ నెట్టో, అలాగే కెన్యాలో క్లయింట్లను గుర్తిస్తున్న న్యాయవాది కెల్విన్ కుబాయ్ చెప్పారు.
ఇంకా మరెన్నో కేసులు ఉండొచ్చని నెట్టో భావిస్తున్నారు.
బీఏటీయూకే స్థావరాన్ని 1964లో స్థాపించారు. ప్రతి సంవత్సరం 5,000కిపైగా బ్రిటిష్ సైనిక సిబ్బంది ఇక్కడికి రాకపోకలు సాగిస్తారు.
నైరోబీకి 185 కిలోమీటర్ల ఉత్తరంగా ఉన్న నాన్యుకి అనే మార్కెట్ పట్టణంలో ఉన్న ఈ స్థావరం దశాబ్దాలుగా వివాదాలకు కేంద్రంగా మారింది.
రెండేళ్లపాటు విచారణ జరిపిన కెన్యా పార్లమెంటరీ కమిటీ గత డిసెంబరులో విడుదల చేసిన నివేదికలో, బ్రిటిష్ సైనికులు "శిక్షపడుతుందనే భయం లేకుండా" వ్యవహరిస్తున్నారని ఆరోపించింది.
సెక్సువల్ అబ్యూజ్, రెండు హత్యల ఆరోపణలు, హక్కుల ఉల్లంఘనలు, పర్యావరణ నాశనం, అలాగే స్థానికంగా తమకు జన్మించిన పిల్లలను పట్టించుకోకుండా వదిలేయడం వంటివి ఘటనలు ఉన్నట్లు పేర్కొంది.
దీనిపై యూకే రక్షణ మంత్రిత్వశాఖ స్పందిస్తూ, కెన్యాలో తమ రక్షణ ఉనికి కారణంగా ఏర్పడిన సమస్యలు, సవాళ్లపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, వీలైనంతవరకు వాటిని పరిష్కరించేందుకు చర్యలు కొనసాగిస్తున్నామని తెలిపింది.
నాన్యుకిలో 2024లో కొందరు పిల్లలు తమ తండ్రులను వెతుకుతున్నారనే విషయం జేమ్స్ నెట్టోకు మొదటగా తెలిసింది. ఆయన ప్రముఖ జెనెటిక్స్ ప్రొఫెసర్ డెనిస్ సిండర్‌కోంబ్ కోర్టుతో కలిసి "డీఎన్ఏ కిట్లతో నిండిన సూట్‌కేసుతో" కెన్యా చేరుకున్నారు.
తర్వాత, మూడు నుంచి 70 ఏళ్ల మధ్య వయస్సు గల తమ క్లయింట్ల బ్రిటిష్ సైనిక తండ్రులను గుర్తించేందుకు, వారు సేకరించిన డీఎన్ఏ నమూనాలను కమర్షియల్ జీనాలజీ డేటాబేస్‌లలో ఉన్న జెనెటిక్ ప్రొఫైల్స్‌తో సరిపోల్చారు.
"ఇంత పెద్ద స్థాయిలో డీఎన్ఏ పరీక్షలను ఉపయోగించడం యూకే కోర్టులలో ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదు" అని నెట్టో చెప్పారు. తమ వద్ద నమూనాలను సరిపోల్చేందుకు విస్తారమైన జన్యు సమాచారం అందుబాటులో ఉందని ఆయన పేర్కొన్నారు. అతిపెద్ద కమర్షియల్ డీఎన్ఏ వెబ్‌సైట్ అయిన యాన్సెస్టరీ డాట్‌కామ్‌లో గత సంవత్సరం దాదాపు 3 కోట్లకు ప్రొఫైల్స్ ఉన్నాయి. దీనిని సిండర్‌కోంబ్ తమ ప్రధాన వనరుగా ఉపయోగించారు.
తాము ఎంతమందిని గుర్తించగలమో ముందుగా అంచనా లేకపోయినా, వచ్చిన ఫలితాలు ఆశ్చర్యపరిచాయని నెట్టో తెలిపారు. "మాకు పూర్తిగా దూర సంబంధాలు ఉన్న కుటుంబ సభ్యులు, అలాగే దగ్గరి బంధువులు కనిపించారు. చివరికి తండ్రులనే కచ్చితంగా గుర్తించే స్థాయికి చేరుకున్నాం" అని చెప్పారు.
ఈ పురోగతి ఎడ్వర్డ్, అతని తల్లి నసీబో జీవితాలను మార్చే అవకాశముంది. ఇప్పుడు ఎడ్వర్డ్ తన తండ్రి నుంచి ఆర్థిక సహాయం పొందేందుకు అర్హుడయ్యాడు.
‘అబ్బాయి పుడితే సోదరుడి పేరు పెడదామన్నాడు’
"వారంతా మర్యాదగలవారనుకునేదాన్ని" అని నసీబో బ్రిటిష్ సైన్యం గురించి చెప్పారు. ఎడ్వర్డ్ తండ్రి తనను నిజంగా ప్రేమించి, జాగ్రత్తగా చూసుకున్నాడని ఆమె నమ్మారు. నసీబో గర్భవతి కావడానికి ముందే, తన కుమారుడిని సంతోషంగా ఉంచినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఆ సైనికుడి తల్లి రాసిన లేఖను మేం చూశాం. తాను గర్భవతినని చెప్పినప్పుడు అతను ఎంతో ఆనందంగా స్పందించాడని ఆమె చెప్పారు. కొడుకు పుడితే తన సోదరుడి పేరు పెట్టాలని చెప్పాడని, యూకే వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు నిశ్చితార్థ ఉంగరం కూడా తీసుకొచ్చాడని ఆమె తెలిపారు.
కానీ నసీబో నాలుగునెలల గర్భవతిగా ఉన్న సమయంలో తాను యూకేకు అత్యవసరంగా తిరిగి వెళ్లిపోతున్నానని చెప్పి, తనతో సంబంధాలన్నీ నిలిపివేశాడని తెలిపారు.
ఇల్లు విడిచి పోవాల్సిందిగా కొంతమంది బంధువులు నసీబోను ఒత్తిడి చేశారు. ఆమె కుమారుడి చర్మం రంగు లేతగా ఉన్న కారణంగా స్కూల్లో తోటిపిల్లల వేధింపులు ఎదుర్కొన్నాడని ఆమె మాకు చెప్పారు.
కెన్యాను 1895 నుంచి 1963వరకు యూకే పరిపాలించింది.
కోర్టు ఆదేశాల మేరకు రక్షణమంత్రిత్వశాఖ, డిపార్ట్‌మెంట్ ఫర్ వర్క్ అండ్ పెన్షన్స్, హెచ్ఎం రెవెన్యూ, కస్టమ్స్‌ను ఆ వ్యక్తి పేరు, చిరునామాను పంచుకున్న తరువాత నెట్టో ఎడ్వర్డ్ తండ్రిని గుర్తించగలిగారు. కానీ తన వివరాలేవీ నసీబోతోకానీ, ఆమె కుమారుడితో పంచుకోవద్దని ఆవ్యక్తి నెట్టోను కోరారు. కానీ నెట్టో ఇప్పుడు బిడ్డను పెంచడానికి అవసరమయ్యే ఖర్చులను చెల్లించేలా చేసేందుకు నెట్టో కోర్టు ప్రక్రియ ప్రారంభిస్తున్నారు.
మరో కెన్యా యువతి, 18 ఏళ్ల ఇవోన్‌కు తన తండ్రి గురించి తక్కువ సమాచారం మాత్రమే తెలుసు. ఆమె తండ్రి బ్రిటిష్ సైన్యంలో పనిచేశాడని మాత్రమే ఆమెకు చెప్పారు. కానీ ఆయన పేరు కూడా ఇవోన్‌కు తెలియదు. చిన్నప్పటి నుంచే తన తండ్రిచనిపోయాడని నమ్ముతూ పెరిగింది. ఆమె చిన్నపిల్లగా ఉండగానే ఆమె తల్లి మరణించింది. బ్రిటిష్ సైనికులు ఆమె తండ్రి చనిపోయాడని ఆమె తాత, మామలకు చెప్పినట్టు ఆరోపణలు ఉన్నాయి.
ఈ న్యాయ ప్రక్రియ ద్వారా, ఆ వ్యక్తి తల్లి బంధువులో ఒకరి డీఎన్ఏ యాన్‌సెస్టరీ వెబ్‌సైట్‌లో ఉండటంతో, పోలిక దొరికింది. దాంతో ఆమె తండ్రి బతికే ఉన్నాడని, యూకేలో నివసిస్తున్నాడని బయటపడింది.
కోర్టు ఆదేశాలను ఐదుసార్లు అతిక్రమించిన తర్వాత, చివరకు కేసు విచారణ రోజున ఆయన కోర్టుకు హాజరయ్యాడు. తాను ఇవోన్ తండ్రేనని నిర్ధరించేందుకు డీఎన్ఏ పరీక్ష చేయాలని కోరారు. వారం రోజుల తర్వాత వచ్చిన ఫలితంలో అదే నిజమని తేలింది.
ప్రస్తుతం ఆయనకు ఇవోన్‌తో సంబంధాలు కొనసాగించాలనే ఆసక్తిలేదు. అయితే ఆయన తల్లి బంధువు మాత్రం ఇవోన్‌ను కలవడానికి ఆసక్తిగా ఉన్నట్టు చెప్పారు.
అయితే గుర్తించిన తండ్రులందరూ ఇలానే దూరంగా ఉండటం లేదు.
‘‘ఆయన ఒక్కరే డబ్బు పంపుతున్నారు’’
నాన్యుకిలో 2004లో విధులు నిర్వహించిన మాజీ బ్రిటిష్ సైనికుడు ఫిల్, తన 20 ఏళ్ల కుమార్తె కాథీతో ఇప్పుడు పరిచయం పెంచుకుంటున్నందుకు సంతోషంగా ఉన్నట్టు చెప్పారు. కాథీ తల్లి మ్యాగీకి ఆయన ముందుగా పెళ్లి ప్రతిపాదన చేశారు. తమ కుమార్తె పుట్టిన తర్వాత తొలి నెలల్లో కుటుంబంతో గడిపారు. కానీ తరువాత మరో నియామకానికి వెళ్లినప్పుడు తన ఫోన్ పోవడంతో వారి సంప్రదింపు వివరాలు కోల్పోయినట్టు చెప్పారు.
కాథీ తల్లి మ్యాగీ ఆమెకు తండ్రి చనిపోయినట్లు చెప్పారు. కానీ పెద్దయ్యాక కాథీ తనతండ్రి బతికే ఉన్నట్లు తెలుసుకుని ఫేస్‌బుక్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించారు. కానీ ఆమె అకౌంట్లను గుర్తించలేక అతను బ్లాక్ చేశానని చెబుతున్నారు.
ఆ సమయంలో తాను సైన్యం విడిచిపెట్టి, కొంతకాలం నిరాశ్రయుడిగా ఉండి, మానసిక సమస్యలతో కూడా పోరాడుతున్నానని ఆయన తెలిపారు. "పౌర జీవితానికి మారడం అంత సులభం కాదు" అన్నారు.
కాథీ కూడా ఆ సమయంలో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది. చివరకు ఆత్మహత్యాయత్నం కూడా చేసింది.
"పెరిగేటప్పుడు నాకు తండ్రి అవసరం చాలా అనిపించేది. జాతి వంటి విషయాల కారణంగా నా తల్లి అర్థం చేసుకోలేని కొన్ని విషయాలు ఉండేవి. దాంతో నాకు చాలా ఒంటరితనం అనిపించేది. మనలో ఒక భాగం మనకే తెలియకుండా మిస్టరీగా ఉండిపోతుంది" అని ఆమె తెలిపారు .
యూకే కోర్టుల్లో ఇటీవల పితృత్వాన్ని నిర్ధరించిన తరువాత, ఫిల్ తనెవరో తెలుసుకోవడం "చాలా ఆనందంగానూ, ఆశ్చర్యంగానూ'' ఉందని అన్నారు. ప్రస్తుతం ఆయన కాథీతో సంప్రదింపులు జరుపుతూ, ఆమెకు మ్యాగీకి కొంత ఆర్థిక సహాయం కూడా అందిస్తున్నారు.
"నేనేం చేసినా, ఆమెతో కోల్పోయిన సమయాన్ని తిరిగి తీసుకురాలేను అని కాథీకి చెప్పాను . కానీ ఇప్పటికైనా నేను చేయగలిగినంత చేయడానికి ప్రయత్నిస్తాను" అని చెప్పారు.
ఇప్పుడు కాథీ యూకేకు వెళ్లాలని ఆశిస్తున్నారు.
ఇప్పటివరకు తన క్లయింట్లలో పిల్లలకు డబ్బు పంపుతున్న తండ్రి ఫిల్ ఒక్కరేనని నెట్టో తెలిపారు.
కెన్యా న్యాయవాది కెల్విన్ కుబాయ్, బ్రిటిష్ సైనికుల పిల్లలకు ఆర్థిక సహాయం అందించేందుకు "కనెక్టింగ్ రూట్స్ కెన్యా" అనే సంస్థను ప్రారంభించారు. వివాహేతర సంబంధాల ద్వారా పిల్లలు పుడుతున్న నేపథ్యంలో, ఇటువంటి సంబంధాలపై పూర్తిగా నిషేధం విధించాలా అని అడిగితే ఆయన తీవ్రంగా విభేదించారు.
"అలా చేయడం జాత్యహంకారంగా ఉంటుంది. ప్రధానంగా తెల్లజాతి సైనికులు కేవలం సమస్యలు వస్తాయనే కారణంతో నల్లజాతి మహిళలను దూరంగా ఉంచాలని చెప్పడం సరికాదు. సరైన పరిష్కారం ఏమిటంటే, కెన్యాలో విధులు నిర్వహించే సమయంలో పిల్లలకు తండ్రులైన పురుషులు తమ బాధ్యతలను తప్పకుండా నిర్వర్తించేలా చూడడం" అన్నారు.
ఇంకా మరిన్ని కేసులు రాబోయే నెలల్లో హైకోర్టు ముందుకు రానున్నాయని నెట్టో, కుబాయ్ తెలిపారు.
ఈ కథనం ప్రచురణకు ముందు, యూకే రక్షణ మంత్రిత్వశాఖ "యూకే సైనిక సిబ్బందిపై నేర ఆరోపణలు లేకపోతే, లేదా స్థానిక పోలీసుల నుంచి ప్రత్యేక ఫిర్యాదులు రాకపోతే, మేం దర్యాప్తు చేయం. కొన్ని పితృత్వ కేసులు పరస్పర సమ్మతితో జరిగిన సంబంధాలకు సంబంధించినవై ఉండొచ్చు. అవి మా విధానానికి విరుద్ధం కావు'' అని తెలిపింది.
బ్రిటిష్ ఆర్మీ శిక్షణ కార్యక్రమాలను నిర్వహించే కలెక్టివ్ ట్రైనింగ్ గ్రూప్ కమాండింగ్ అధికారి బ్రిగేడియర్ సైమన్ రిడ్గ్వే మాట్లాడుతూ, పితృత్వ సమస్యలతో బాధపడుతున్న వారు కెన్యా నేషనల్ చిల్డ్రన్స్ సర్వీస్‌ను సంప్రదించాలని సూచించారు.
అయితే ఈ కథనం వెలువడిన తరువాత, రక్షణ మంత్రిత్వశాఖ మరో ప్రకటన విడుదల చేసింది. "తగిన మద్దతు లేకుండా వదిలివేసిన పిల్లల ఆరోపణలపై మేం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. తమ బాధ్యతలను నిర్వర్తించని సిబ్బంది బాధ్యత వహించాల్సిందే. లైంగిక దోపిడి లేదా తల్లిదండ్రుల బాధ్యతలను విస్మరించడం అంగీకారయోగ్యం కాదు" అని తెలిపింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
ముఖ్యమైన కథనాలు
ఫీచర్లు
పాపులర్
కంటెంట్ అందుబాటులో లేదు