ప్రపంచమంతటా యుద్ధాలు, కష్టాలు ఉన్నా భవిష్యత్‌పై ఆశతో ఉండేందుకు 5 సానుకూల అంశాలు

ఫొటో సోర్స్, Getty Images

చదివే సమయం: 9 నిమిషాలు

యుద్ధాలు, రాజకీయ గందరగోళం, సంపన్నులకే అనుకూలమైన ఆర్థిక విధానాలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం ఇలాంటి ప్రతికూల పరిస్థితుల మధ్య భవిష్యత్తుపై ఆశలు పెట్టుకోవడం అంత తేలిక కాదు.

అయితే ఇలాంటి ప్రతికూల పరిస్థితుల మధ్య కూడా భవిష్యత్‌పై ఆశతో ఉండేందుకు కొన్ని అంశాలున్నాయి.

అలాంటి వాటిలో ఐదింటిని బీబీసీ మీ ముందుకు తెస్తోంది.

వివిధ రంగాల్లో దశాబ్ధాలుగా చేస్తున్న కృషికి ఫలితం లభిస్తోందని చెప్పడానికి ఇవన్నీ నిదర్శనంగా నిలుస్తున్నాయి.

ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
Sorry, we can’t display this part of the story on this lightweight mobile page.

1. తగ్గిన తీవ్ర దారిద్య్రం

1990 నుంచి 2025 వరకు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర దారిద్య్రంలో జీవిస్తున్న వారి సంఖ్య 230 కోట్ల నుంచి 83.1 కోట్లకు తగ్గిందని ప్రపంచ బ్యాంక్ బృందం తెలిపింది.

"ఈ అంకెల అర్థం ఏంటంటే 140 కోట్ల మంది దారిద్య్రం నుంచి తప్పించుకున్నారు. ప్రత్యేకంగా 1990 నుంచి 2010 వరకు ప్రపంచ దారిద్య్ర నిష్పత్తి 47 శాతం నుంచి 10శాతానికి పడిపోయింది" అని యూరోపియన్ యూనివర్సిటీలో ఎకనమిక్స్ ప్రొఫెసర్ జోస్ మాన్యుయెల్ కొర్రాలెస్ బీబీసీతో చెప్పారు.

తూర్పు, దక్షిణాసియాల్లో విస్తృతమైన అభివృద్ధి వల్ల ఈ తగ్గుదల సాధ్యమైంది. ప్రత్యేకంగా భారత్, చైనాల్లో సమ్మిళిత వృద్ధి, మార్కెట్ సంస్కరణలు, ఆర్థిక అవకాశాల వల్ల పేదరికం తగ్గిందని ప్రొఫెసర్ చెప్పారు.

"ఉపాధి అవకాశాలు, మౌలిక రంగంలో పెట్టుబడులు, విద్య, ఆరోగ్యం, సామాజిక భద్రత వ్యవస్థ వంటివి ఇందులో నిర్ణయాత్మకంగా ఉన్నాయి" అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, CFOTO/Future Publishing via Getty Images

ఫొటో క్యాప్షన్, ఇటీవలి దశాబ్దాలలో చైనా గణనీయమైన ఆర్థిక వృద్ధిని సాధించింది.

వాళ్లను కూడా బయటకు తీసుకురాగలమా?

పేదరికం మీద యుద్ధంలో ప్రపంచ బ్యాంక్ గణాంకాలు ఆశావహంగా ఉన్నప్పటికీ 83.1 కోట్ల మంది, అంటే ప్రపంచంలోని ప్రతి 10 మందిలో ఒకరు రోజుకి 270 రూపాయల కంటే తక్కువ మొత్తంతో జీవిస్తున్నారు.

"అవును. అందుకు తగిన సంకేతాలు ఉన్నాయి" అని కొర్రాలెస్ చెప్పారు.

"ప్రపంచ జనాభాలో సగానికంటే ఎక్కువ మందికి ప్రస్తుతం సామాజిక భద్రత అందుతోంది. దీంతో పాటు లక్షల మంది పేదరికం నుంచి బయటపడేందుకు, సంక్షోభాలను తట్టుకునేందుకు ఐక్యరాజ్య సమితి ప్రతిపాదనలు ఉపయోగపడుతున్నాయి. తీవ్ర దారిద్య్రం నుంచి ఎక్కువ మంది బయటపడాలంటే విద్య, వైద్యంలో పెట్టుబడులు అవసరమని ’’ అనేక మంది నిపుణులు చెప్పినట్లే ప్రొఫెసర్ కూడా చెప్పారు.

ఈ పెట్టుబడులు కూడా తీవ్ర దారిద్య్రం ఉన్న ప్రాంతాల్లో పెట్టడం కీలకం.

"సబ్ సహారన్ ఆఫ్రికన్ దేశాల్లో 75శాతం కంటే ఎక్కువ మంది తీవ్ర దారిద్య్రంలో ఉన్నారు"

సమ్మిళిత వృద్ధితో పాటు పర్యావరణ హిత ఎకానమీ, మానవహక్కులు, సామాజిక సమానత్వాన్ని సాధించేలా ప్రభుత్వ విధానాలు ఉండాలి. లేకపోతే పేదరికం అలాగే ఉంటుంది" అని కొర్రాలెస్ చెప్పారు.

"కేవలం ఆర్థిక వృద్ధి ఒక్కటే సరిపోదు. బలమైన సామాజిక భద్రత, తీవ్రమైన దారిద్య్రాన్ని తరిమికొట్టేలా సంపూర్ణ వ్యూహం అవసరం. ప్రపంచవ్యాప్తంగా తీవ్ర దారిద్య్రం నుంచి ప్రజలను బయటకు తీసుకు రావడంలో చెప్పుకోదగ్గ వృద్ధి సాధించినప్పటికీ ఈ ప్రక్రియ ఇప్పుడు నెమ్మదించింది. ప్రస్తుత అంచనాల ప్రకారం ఇది 2030 నాటికి ఆగిపోతుంది లేదా తిరోగమిస్తుంది" అని కొర్రాలెస్ భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, క్యాన్సర్‌ను నివారించడానికి సమర్థవంతమైన చికిత్సలను కనుగొనేందుకు ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి.

2. క్యాన్సర్‌ నివారణ పరిశోధనల్లో ముందడుగు

ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణాలలో క్యాన్సర్ ఒకటి.

2020లో దాదాపు కోటి మంది క్యాన్సర్‌తో చనిపోయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

ఈ వాస్తవం ఆందోళన కలిగిస్తున్నప్పటికీ, అనేక క్యాన్సర్లను ముందుగా గుర్తిస్తే నయం చేయవచ్చు. అడ్వాన్స్ కేసుల్లో క్యాన్సర్ వ్యాప్తిని నెమ్మదింప చేయవచ్చు.

అమెరికాలోని జాన్ హాప్కిన్స్ హాస్పిటల్‌కు చెందిన వైద్య పరిశోధన, శిక్షణ కేంద్రానికి 125 ఏళ్ల పైబడిన చరిత్ర ఉంది.

ఈ క్యాన్సర్ సెంటర్‌కు చెందిన వెబ్‌సైట్ పేజ్ ఓపెన్ చేయగానే "క్యాన్సర్ లేని ప్రపంచాన్ని ఊహించుకోండి" అనే వ్యాఖ్య కనిపిస్తుంది.

"అదృష్టత్తువశాత్తూ, వైద్యశాస్త్రంలో ఆవిష్కరణలు, ఆధునికత వల్ల క్యాన్సర్ అనేది ఇకపై ఏ మాత్రం మరణ శిక్ష కాదు" అని ఇమ్యూనోథెరపీ అండ్ ప్రిసిషన్ మెడిసన్ అనే అంశాలపై ఈ సంస్థ రాసిన వ్యాసాల్లోని ఓ వ్యాసంలో తెలిపింది. ఈ మాట ఆశలు రేపుతోంది.

లండన్‌కు చెందిన క్యాన్సర్ పరిశోధకుల్లో ఒకరైన డాక్టర్ డాని స్కిర్రౌ ఈ వాక్యాలతో ఏకీభవిస్తున్నారు.

బ్రిటన్‌లో క్యాన్సర్ నుంచి బయట పడిన వారి సంఖ్య గత 50 ఏళ్లలో రెట్టింపైంది. దీనర్ధం ఏంటంటే ప్రతీ నలుగురు క్యాన్సర్ బాధితుల్లో ఇద్దరు తమకు క్యాన్సర్ ఉందని తెలిసిన తర్వాత పదేళ్లు అంత కంటే ఎక్కువ కాలం జీవించారు. ఈ గణాంకాలు బ్రిటన్‌లో ఆశలు నింపుతున్నాయి.

"క్యాన్సర్‌కు చికిత్స చేయడానికి అనేక మార్గాలున్నాయి. ముందుగానే గుర్తిస్తే అది విస్తరించుకుండా చికిత్స చేయవచ్చు. క్యాన్సర్‌ను త్వరగా గుర్తించడం అనేది దాన్ని నయం చేయడంలో ఎక్కువ అవకాశాలను అందిస్తుంది" అని నిపుణుడొకరు బీబీసీతో చెప్పారు.

జీవనశైలి ముఖ్యమే అయినప్పటికీ ధూమపానానికి దూరంగా ఉండటం, సమతుల ఆహారం తీసుకోవడం, ఉత్సాహంగా ఉండటం లాంటివి కూడా కీలకం. ప్రస్తుతం క్యాన్సర్‌కు ఆశాజనకమైన వైద్య పరిష్కారాలు ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్న రోగులకు సహాయం చేయడానికి పరిశోధకులు ఇమ్యునోథెరపీ, ప్రిసెషన్ మెడిసన్ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు.

ఉదాహరణకు కొన్ని రకాల క్యాన్సర్లు అభివృద్ధి చెందకుండా నియంత్రించడానికి అవి సోకిన వారికి ఇచ్చే వ్యాక్సిన్లను అభివృద్ది చేయడం ఒకటని స్కిర్రౌ చెప్పారు.

ఈ వ్యాక్సిన్ల లక్ష్యం ఏంటంటే ప్రస్తుతం ఎలాంటి క్యాన్సర్ లక్షణాలు లేకున్నా భవిష్యత్‌లో క్యాన్సర్ కారకంగా మారగల కణాలను గుర్తించేలా వ్యాధి నిరోధక వ్యవస్థకు నేర్పించడం.

"వ్యాధి నిరోధక వ్యవస్థ వాటిని గుర్తిస్తుంది. అవి క్యాన్సర్‌గా మారక ముందే వాటిని వేటాడి శరీరం నుంచి తొలగిస్తుంది" అని ఆయన వివరించారు.

గతంతో పోలిస్తే ప్రస్తుతం క్యాన్సర్ చికిత్సలు చాలా కచ్చితమైనవిగా మారాయని డాక్టర్ చెప్పారు

"కొన్నేళ్ల క్రితం, క్యాన్సర్ చికిత్స ఎక్కువగా వేగంగా విస్తరిస్తున్న క్యాన్సర్ కణాలను తొలగించడంపై దృష్టి పెట్టేది. దాని వల్ల అనేక సైడ్ ఎఫెక్ట్స్ ఉండేవి" అని సిర్రౌ అన్నారు.

"ఇప్పుడు మనకు క్యాన్సర్ గురించి మరింత తెలుసు. ఇప్పుడు మనం క్యాన్సర్ కణాల వివరాలు, అవి పెరగడానికి మార్గాలు, జీవ ప్రక్రియ గురించి మనం తెలుసుకుంటున్నాం. ఈ సమాచారంతో వాటిని నిరోధించడానికి నిర్దిష్టమైన మందుల్ని కనుక్కోవచ్చు"

ఇలాంటి కచ్చితమైన చికిత్సలు మరింత ప్రభావవంతంగా ఉంటాయని, దీర్ఘకాలం పని చేస్తాయని, వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా తక్కువని నిపుణులు చెబుతున్నారు.

అభివృద్ధి చెందిన దేశాల్లో క్యాన్సర్‌పై పరిశోధనలు, చికిత్స విషయంలో పురోగతి వేగంగా ఉన్నా, ప్రపంచవ్యాప్తంగా చూస్తే భారీ అసమానతలు ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది.

అల్పాదాయ దేశాల్లో ప్రజలకు క్యాన్సర్‌కు కనీస చికిత్స కూడా అందుబాటులో లేదు.

2024లో ప్రపంచ ఆరోగ్య సంస్థ115 దేశాల్లో సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో క్యాన్సర్ కేర్ సేవలకు కొన్ని సరైన నిధుల కేటాయింపులు కూడా లేవు. కనీసం ఉపశమన సంరక్షణకు కూడా నిధులు సమకూర్చడం లేదని తేలింది.

"ఒక వ్యక్తి ఎక్కడ నివసిస్తున్నాడనేది అతని జీవితాన్ని నిర్ణయించే అంశం కాకూడదు" అని యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ డైరెక్టర్ కేరీ ఆడమ్స్ చెప్పారు.

"ప్రభుత్వాలు క్యాన్సర్ రోగులకు అండగా నిలివడానికి, ప్రతి ఒక్కరికీ సరసమైన, నాణ్యమైన సేవలు అందించడానికి అనుమతించే మార్గాలున్నాయి. ఇది కేవలం నిధులకు సంబంధించినది కాదు. రాజకీయ సంకల్పానికి సంబంధించినది" అని ఆడమ్స్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2000 నుంచి ప్రపంచవ్యాప్తంగా 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల మరణాల రేటు 52% తగ్గింది.

3. తగ్గిన శిశు మరణాలు

ఇటీవలి దశాబ్ధాలలో వైద్య రంగం సాధించిన గొప్ప విజయాలలో ఒకటి శిశు మరణాల సంఖ్యను తగ్గించడం.

శిశు మరణాల సంఖ్య 2024లోనే 50 లక్షల కంటే తక్కువకు పడిపోవడం అనేది చరిత్రాత్మక మైలు రాయి అని యునిసెఫ్ చెప్పింది.

ఈ అసాధారణ పురోగతి 1990ల నుంచి మొదలైంది. ఆ ఏడాది ప్రతీ 11 మందిలో ఒకరు ఐదేళ్లలోపే చనిపోయేవారు. 2023లో ఇది 27 మందిలో ఒకరుగా ఉంది.

ప్రపంచవ్యాప్తంగా ఐదేళ్లలోపు పిల్లల మరణాల సంఖ్య రికార్డు స్థాయిలో తగ్గినట్లు యునిసెఫ్ 2025 మార్చ్‌లో గుర్తించింది.

ఐదేళ్ల లోపు చిన్నారుల మరణాల సంఖ్య 2000 నుంచి 52శాతం తగ్గింది.

కాంబోడియా, మలావి, మంగోలియా, రువాండాలోనూ ఇది 75 శాతం కంటే ఎక్కువగా తగ్గింది.

ఈ గణాంకాలు సాధించడానికి వరుస నిర్ణయాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా కృషి చేసిన ఆరోగ్య కార్యకర్తలు, వైద్య సిబ్బంది ఉన్నారు.

Sorry, we can’t display this part of the story on this lightweight mobile page.

మరో అంశం ఏంటంటే వ్యాక్సిన్లు కూడా ఇందులో కీలక పాత్ర పోషించాయని యునిసెఫ్, నిపుణులు చెబుతున్నారు.

"ఐదేళ్లలోపు పిల్లల్లో మరణానికి కారణమయ్యే పోలియో, డిఫ్తీరియా, టెటనస్, పొంగు, తట్టు, మెంజైటిస్ వంటివి రాకుండా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని 1970ల చివరి, 1980ల తొలి నాళ్లలో విస్తృతంగా చేపట్టారు" అని యూరోపియన్ యూనివర్సిటీలో పీడియాట్రిక్‌ కార్డియాలజిస్ట్ జోస్ మార్టిన్ గోమెజ్ బీబీసీతో చెప్పారు.

అనేక దేశాల్లో మహిళ గర్భం ధరించగానే వైద్యుల పర్యవేక్షణ, పుట్టిన బిడ్డకు తొలి రోజుల్లో అందుతున్న వైద్య రక్షణ లాంటివి కూడా కీలకం.

కొన్ని దేశాల్లో పుట్టిన బిడ్డల కోసం ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు, యాంటీ బయాటిక్స్ అందుబాటులోకి రావడం, నాణ్యమైన తాగునీరు, పోషకాహారం లాంటివి గతంతో పోల్చుకుంటే మెరుగయ్యాయి.

ఇదంతా ఎలా ఉన్నప్పటికీ, 2023లో 48 లక్షల మంది ఐదేళ్ల లోపు చిన్నారులు చనిపోయినట్లు ఐక్యరాజ్య సమితి 2025 మార్చ్‌లో తెలిపింది.

ఇందులో చాలా మరణాలు నివారించదగిన, చికిత్స అందుబాటులో ఉన్న వ్యాధుల వల్ల సంభవించాయని నిపుణులు చెబుతున్నారు.

"ప్రజలు జీవన పరిస్థితుల మధ్య వ్యత్యాసాన్ని మనం మర్చిపోకూడదు. అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చుకుంటే ఆఫ్రికా, ఆసియా దేశాల్లో ఐదేళ్ల లోపు పిల్లలు పిల్లలు చనిపోవడానికి 14రెట్లు ఎక్కువ ప్రమాదం ఉంది" అని గోమెజ్ చెప్పారు.

"తీవ్ర పేదరికం, అంతర్యుద్ధాలు లాంటి వాటి వల్ల కొన్ని దేశాల్లో ఎక్కువ మంది పిల్లలు చనిపోతున్నారు. ఇలాంటి వాటిని అరికట్టేందుకు మనం మనవంతు కృషి చేయాలి. అలాగే మనం ఇప్పటి వరకు సాధించిన దానికి గర్వించాలి. అలాగే ఆయా దేశాలకు చేయూత అందించాలి" అని ఆయన అన్నారు.

కొన్ని దేశాలు, సంస్థలు అందిస్తున్న అంతర్జాతీయ సాయంలో కోత విధించడంవల్ల వినాశనకరమైన ప్రభావం పడే అవకాశం ఉందని మానవీయ సంస్థలు, నిపుణులు హెచ్చరించారు.

ప్రపంచవ్యాప్తంగా పిల్లల ఆరోగ్యానికి నిధులు పెంచడం చాలా ముఖ్యమని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇంధన వాడకంలో పునరుత్పాదక ఇంధన వనరులు బొగ్గును అధిగమించిన ఏడాదిగా 2025 రికార్డులకెక్కింది.

4. ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వృద్ధి

"ప్రపంచ వ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన వనరుల విస్తరణ వేగంగా ఉంది" అని అంతర్జాతీయ ఇంధన సంస్థ ప్రచురించిన వరల్డ్ ఎనర్జీ అవుట్‌లుక్ 2025 నివేదిక తెలిపింది.

కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు ప్రపంచం ప్రయత్నిస్తున్న సమయంలో ఇది కచ్చితంగా శుభవార్త.

వాతావరణ మార్పుల వల్ల సంభవిస్తున్న ఉత్పాతాల వల్ల ప్రపంచవ్యాప్తంగా కోట్లమంది ప్రభావితం అవుతున్నారు.

"ఇంధనం కోసం పరితపిస్తున్న" ప్రపంచంలో నూతన సాంకేతికతలను ప్రపంచం వేగంగా అందిపుచ్చుకుంటోంది.

"పునరుత్పాదక ఇంధనం 2024లో వరుసగా 23వ ఏట కొత్త విస్తరణ రికార్డులను బద్దలు కొట్టింది" అని వరల్డ్ ఎనర్జీ అవుట్‌లుక్ 2025 నివేదిక తెలిపింది.

పునరుత్పాదక ఇంధనం వల్ల కర్బన ఉద్గారాలను తగ్గించడంతో పాటు ఇంధన అవసరాల కోసం చేసే ఖర్చు కూడా తగ్గింది.

అనేక ప్రభుత్వాలు, సంస్థలు, కంపెనీలు ఇప్పటికే తమ కార్యకలాపాల నిర్వహణలో పునరుత్పాదక ఇంధనాన్ని చేర్చే మార్గాలను అన్వేషించాల్సిన అవసరం గురించి తెలుసుకున్నాయి.

2025 తొలి అర్థభాగం నాటికి విద్యుదుత్పత్తిలో పవన, సౌర, ఇతర పునరుత్పాదక ఇధన వనరులు తొలిసారిగా బొగ్గును అధిగమించాయని గ్లోబల్ ఎనర్జీ థింక్ టాంక్ ఎంబర్ తెలిపింది.

ప్రాంతాల వారీగా ఇది వేర్వేరుగా ఉన్నా, పునరుత్పాదక ఇంధనం, ముఖ్యంగా సోలార్ పవర్ "మరే ఇతర ఇంధనం కన్నా వేగంగా ఎదుగుతోంది" అని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజన్సీ తెలిపింది.

ఉద్గారాలను తగ్గించేందుకు జాతీయ అంతర్జాతీయంగా తీసుకున్న చర్యలు ఇంకా సరైన ఫలితాలు ఇవ్వడ లేదని సంస్థ గుర్తించింది.

వాతావరణ మార్పుల వల్ల పెరుగుతున్న ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

చరిత్రలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరంగా 2024 రికార్డులకెక్కింది. ప్రపంచ ఉష్ణోగ్రతలు పారిశ్రామికీకరణకు ముందు స్థాయిల కంటే 1.5 డిగ్రీల సెల్సియస్‌ను దాటిన మొదటి సంవత్సరంగా నిలిచింది.

2025 స్పష్టమైన సందేశంతో వీడ్కోలు పలికింది. వాతావరణ మార్పుల వల్ల ఎదురయ్యే ప్రమాదాలను ఎలా తగ్గించాలో మనకు తెలుసు. ఇప్పుడు మనం చేయాల్సిందిల్లా మన నిబద్ధతను చాటుకోవడమే.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, "బాలికల విద్య వృద్ధిపై ఆశలు ఉన్నాయి" అని యూఎన్ విమెన్ చెబుతోంది.

5. అమ్మాయిల చదువు

"ప్రపంచవ్యాప్తంగా స్కూళ్లలో నమోదు, స్కూలు విద్యను పూర్తి చేసే విషయంలో అమ్మాయిలు అబ్బాయిలను వెనక్కి నెట్టేశారు" అని ఐక్యరాజ్య సమితి మహిళా 'జెండర్ పనోరమా 2025' నివేదిక స్పష్టం చేసింది.

ప్రపంచవ్యాప్తంగా విద్యలో సాధిస్తున్న పురోగతి గత 50 ఏళ్లలో సాధించిన వాటిలో అత్యంత స్ఫూర్తి దాయకమైన విజయాల్లో ఒకటని ప్రపంచ బ్యాంక్ బృందం 2024లో ప్రకటించింది.

"భవిష్యత్ మీద ఆశ పెట్టుకోవడానికి తగిన కారణాలున్నాయి" అని ఐక్యరాజ్య సమితి మహిళా విభాగం తెలిపింది

"గతంలో స్కూళ్లలో తక్కువగా ఉండే అమ్మాయిలు, చదువులో అబ్బాయిలతో పోటి పడే విషయంలో వెనుకపడిన అమ్మాయిలు, ప్రస్తుతం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక సంఖ్యలో ఉన్నారు" అని యూఎన్ ఉమెన్ పేర్కొంది.

ఇటీవలి దశాబ్దాలలో స్కూళ్లలో ప్రాథమిక, మాధ్యమిక విద్యార్థుల నమోదులో లింగ సమానత్వం విషయంలో స్థిరమైన పురోగతి ఉందని ఈ సంస్ధ చెబుతోంది.

అయితే ప్రాంతాల వారీగా చూస్తే కొన్ని తేడాలు ఉన్నాయి. ఈ పరిస్థితి గురించి యూఎన్ విమెన్ గ్రూప్ కూడా హెచ్చరించింది.

"ప్రపంచ వ్యాప్తంగా విద్యలో అన్ని స్థాయిల్లో లింగ వివక్షను అధిగమించినప్పటికీ, ఎనిమిదిలో మూడు ప్రాంతాల్లో ఉన్నత విద్యలో అంతరాలు ఇప్పటికీ కనిపిస్తున్నాయి" అని యూఎన్ విమెన్ గ్రూప్ తెలిపింది.

ప్రస్తుతం 119.3 మిలియన్ల మంది బాలికలు ఇప్పటి వరకు స్కూలుకెళ్లలేదని ఐక్యరాజ్య సమితికి చెందిన సంస్థ తెలిపింది.

బాలికల్లో ఎక్కువ మంది తమ స్కూల్ విద్యను పూర్తి చేస్తున్నప్పటికీ వారు ఉన్నతంగా ఎదిగేందుకు ఉన్న అడ్డంకులు తొలగిపోలేదని సంస్థ హెచ్చరించింది.

ఉదాహరణకు 70 దేశాలపై జరిపిన ఒక విశ్లేషణలో వాటిలోని 65 దేశాలలో మహిళలు టీచర్లు కాగలుగుతున్నప్పటికీ వారిలో చాలా మందికి హైస్కూల్ ప్రిన్సిపాల్ అయ్యే అవకాశం దక్కడం లేదు.

ఈ రంగంలో మహిళల ఆధిపత్యం ఎక్కువగా ఉన్నప్పటికీ కొద్ది మంది మాత్రమే నాయకత్వ స్థానానికి చేరుకుంటున్నారు.

పేదరికం మహిళలపై చూపుతున్న ప్రభావాన్ని యూఎన్ విమెన్ ఎత్తి చూపింది. 2025లో 9.2 శాతం మహిళలు తీవ్ర దారిద్ర్యంలో జీవిస్తున్నారు.

"చదువు, అవకాశాలకు తలుపులు తెరుస్తుంది. అయితే బాల్య వివాహాలు, మహిళల జననావయవ విచ్ఛేదనలు, హింస, వివక్ష లాంటివి ఆ అవకాశాలపై ముసుగు వేశాయి. ఇవి మహిళలకు నాయకత్వ అవకాశాలు అందకుండా చేస్తోంది"

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)