ఒంటరిగా మహిళలు పర్యటించేందుకు ‘అత్యంత సురక్షితమైన’ 5 దేశాలివే

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, లిండ్సే గేలోవే
  • చదివే సమయం: 5 నిమిషాలు

ప్రపంచవ్యాప్తంగా ఒంటరిగా ప్రయాణించాలనుకునే మహిళల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ ట్రెండ్ వేగంగా పెరుగుతోంది.

ఒంటరి ప్రయాణాల గురించి సమాచారాన్ని మహిళలు ఇప్పుడు అంతకుముందు కంటే ఎక్కువగా వెతుకుతున్నారు.

గత ఐదేళ్లలో ఇలాంటి సమాచారాన్ని వెతికే మహిళల సంఖ్య బాగా పెరిగింది.

మహిళలు ఒంటరి ప్రయాణాలను ప్లాన్ చేస్తున్నారు. కానీ, వారి భద్రతపై ఇప్పటికీ ఆందోళనలు అలానే ఉన్నాయి.

2026 ఫిబ్రవరిలో చేపట్టిన సర్వేలో 59 శాతం మంది మహిళలు రాత్రిపూట ఒంటరిగా నడవడం అంత సురక్షితం కాదని భావిస్తున్నట్లు వెల్లడైంది.

భద్రతా కారణాల రీత్యా పురుషుల కంటే ఎక్కువగా మహిళలు ప్రయాణాలకు దూరంగా ఉంటున్నారు.

ఇలాంటి పరిస్థితిలో.. ఒంటరిగా ప్రయాణించేటప్పుడు ప్రపంచంలో ఏ దేశాలు సురక్షితమో తెలుసుకోవడం మహిళలకు చాలా అవసరం.

ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఫొటో సోర్స్, stock photo/Getty Images

ఒంటరిగా వెళ్లే మహిళలకు ఏ దేశం సురక్షితమో తెలిపే ఒక్క ప్రపంచ జాబితా కూడా లేదు.

జార్జ్‌టౌన్ యూనివర్సిటీ ఉమెన్, పీస్ అండ్ సెక్యూరిటీ (డబ్ల్యూపీఎస్) ఇండెక్స్‌ను, గ్లోబల్ పీస్ ఇండెక్స్‌ను బీబీసీ అధ్యయనం చేసింది.

అలాగే, ఒంటరిగా ప్రయాణించే కొందరు మహిళలతో మాట్లాడింది.

ఇలా మాట్లాడినప్పుడు, ఒంటరిగా మహిళలు ప్రయాణించేటప్పుడు సురక్షితమని భావించదగ్గ అయిదు దేశాలను గుర్తించింది.

Sorry, we can’t display this part of the story on this lightweight mobile page.

కోస్టా రికా

కోస్టా రికా సెంట్రల్ అమెరికాలో ఉంది. ప్రపంచంలో సంతోషకరమైన దేశాల జాబితా.. డబ్ల్యూపీఎస్ ఇండెక్స్‌లో 34వ స్థానం ఈ దేశానిది.

డిజిటల్ నోమాడ్ వీసాతో రిమోట్ వర్కర్లను కోస్టా రికా ఆకర్షిస్తోంది.

'రిమోట్ వర్క్ వీసా' అని కూడా దీన్ని పిలుస్తారు. రిమోట్ వర్కర్లు మరో దేశంలో నివసిస్తూనే తమ కంపెనీ లేదా క్లయింట్ల కోసం ఆన్‌లైన్‌లో పనిచేయడానికి చట్టబద్ధంగా ఈ వీసా అనుమతిస్తుంది.

'' ఒంటరి మహిళలు అపరిచితులను కలవడానికి ప్రపంచంలోనే అత్యంత సులభమైన ప్రదేశాల్లో కోస్టా రికా ఒకటి'' అని ట్రావెల్ ఏజెంట్ మోలీ గనన్ చెప్పారు.

శాంటా థెరెసా, నోసెరా వంటి పట్టణాలలో సర్ఫింగ్, యోగా, బీచ్‌ వాక్‌లలో తేలికగా ఇతరులతో సంభాషించేందుకు వీలవుతుంది.

''బీచ్‌లో లభించే ప్రశాంతత, వాతావరణం నాకు సరికొత్త అనుభూతిని ఇచ్చింది. రోజంతా నేను ఫోటోలు తీసుకుంటూనే ఉన్నా. వర్షం పడినప్పుడు ఒక ప్రశాంతమైన చోట కూర్చుని, స్నాక్స్ తింటూ, స్కెచ్‌లు వేసుకునేదాన్ని'' అని ఈ ప్రాంతాన్ని సందర్శించిన యాష్లే హంటర్ చెప్పారు.

ఫొటో సోర్స్, Artur Widak/Anadolu via Getty Images

ఎస్టోనియా

డబ్ల్యూపీఎస్ ఇండెక్స్‌లో ఎస్టోనియా 11వ ర్యాంకును పొందింది. ఆ దేశానికి ఇప్పటివరకు లభించిన అత్యుత్తమ ర్యాంకు ఇదే.

మహిళల ఆరోగ్యం, ఆర్థిక భాగస్వామ్యం, సామాజిక భద్రత విషయాలలో ఎస్టోనియా అగ్ర స్థానంలో ఉంది. గ్లోబల్ పీస్ ఇండెక్స్‌లో ఎస్టోనియా 24వ స్థానంలో ఉంది.

''ఎస్టోనియాలో నాకు ఎప్పుడూ అభద్రత అనిపించలేదు'' అని బ్లాగర్ వెరోనికా రోమానే చెప్పారు.

ఎస్టోనియా రాజధాని టాలిన్. ఇక్కడి.. యునెస్కో గుర్తింపు పొందిన ఓల్డ్ టౌన్ ఒంటరి ప్రయాణాలకు సరైన ప్రదేశం.

టాలిన్ రాజధాని, యునెస్కో గుర్తింపు పొందిన పాత పట్టణం మహిళలు ఒంటరి ప్రయాణాన్ని ప్రారంభించడానికి సరైన ప్రదేశం.

ఇక్కడ గుళకరాళ్లతో వీధులు ఉన్నాయని రోమానే వివరించారు. ఇక్కడున్న చిన్న చిన్న దుకాణాలు సంప్రదాయ వస్తువులను, ఆహారాన్ని అమ్ముతుంటాయని చెప్పారు.

''ఎక్కడ చూసిన కనువిందు చేసే కళారూపాలు, టాలిన్ పాత వీధుల చరిత్ర వల్ల.. ఒంటరిగా తిరగడం పూర్తిగా సౌకర్యంగా అనిపించింది" అని ఆమె వివరించారు.

రాజధాని టాలిన్‌కు పశ్చిమాన తబసలు ప్రకృతి ఉద్యానం ఉంది.

''ఇక్కడ ఒంటరిగా ప్రయాణించడం చాలా సౌకర్యంగా అనిపించింది'' అని రొమానే తెలిపారు.

ఇక్కడ ప్రజలు చాలా మంచివారని, ఆప్యాయంగా స్వాగతించారని చెప్పారు.

ఫొటో సోర్స్, Allison Joyce/Getty Images

వియత్నాం

గ్లోబల్ పీస్ ఇండెక్స్‌లో 38వ స్థానంలో ఉన్న వియత్నాం డబ్ల్యూపీఎస్ ఇండెక్స్‌లో తన పొరుగు దేశాల కంటే మెరుగ్గా ఉంది.

''ఇక్కడ ప్రతిరోజూ సంభాషణలు చాలా ఆత్మీయంగా ఉంటాయి'' అని గతేడాది ఈ దేశాన్ని సందర్శించిన మోలీ గనన్ చెప్పారు.

''కేఫ్ ఓనర్‌తో మాట్లాడినా, స్ట్రీట్ ఫుడ్ వెండర్ వద్ద టేబుల్‌పై కూర్చున్నా లేదా బస్సు ఎక్కినా.. ప్రతి దగ్గరా మీరు తేలికగా కలిసిపోవచ్చు'' అని అన్నారు.

''నేను చాలాసార్లు వియత్నాం వెళ్లాను'' అని రచయిత ట్రేసీ స్మిత్ తెలిపారు.

"నేను సాపాలో ట్రెక్కింగ్ చేశాను. మెకాంగ్ డెల్టాలోని ఒక హోమ్‌స్టేలో ఉన్నాను. ఒక స్థానిక కుటుంబంతో కలిసి టెట్ (వియత్నాం ప్రజలకు నూతన సంవత్సరం) పండుగను జరుపుకొన్నాను. ప్రతిసారీ, నాకు సురక్షితంగా ఉన్నట్లు, నన్ను అందరూ చాలా ఆప్యాయంగా ఆహ్వానించినట్లు అనిపించింది" అని చెప్పారు.

మీ చెక్‌లిస్ట్‌లోని ప్రదేశాలను సందర్శించడమే కాకుండా... స్థానిక గైడ్‌లతో కోఆర్డినేట్ చేసుకోవడం, హోమ్‌స్టేలలో ఉండటం, నెమ్మదిగా ప్రయాణాన్ని ఆస్వాదించడం వంటివి చేయాలని ట్రేసీ చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Ivanna INFANTOZZI/AFP via Getty Images

ఉరుగ్వే

డబ్ల్యూపీఎస్ సూచికలో ఈ ఏడాది ఉరుగ్వే పైకి వచ్చింది. గతంలో 59వ స్థానంలో ఉన్న ఈ దేశం ఇప్పుడు 35వ స్థానంలో ఉంది.

న్యాయ, భద్రత రంగాలలో ఈ దేశం కనబర్చిన మంచి పనితీరు .. ముఖ్యంగా మహిళలపై హింస రేటు తగ్గడం దీనికి కారణం.

గ్లోబల్ పీస్ ఇండెక్స్‌లో దక్షిణ అమెరికా ఖండంలో రెండో అత్యంత ప్రశాంత దేశం ఇది. తొలిస్థానం అర్జెంటీనాది.

''ఉరుగ్వే చాలా శాంతియుత దేశం. ప్రజలు చాలా బాగా స్వాగతిస్తారు. పర్యటకులు పెద్దగా లేని సమయంలో నేను మార్చ్‌లో వెళ్లాను. చాలా మంది స్థానికులను కలిశాను, వారు చాలా బాగా మాట్లాడారు. తమ దేశం, చరిత్ర, సంస్కృతి గురించి చెప్పేందుకు వారు సిద్ధంగా ఉన్నారు'' అని క్లాడియా తవాని తన బ్లాగ్‌లో రాశారు.

ఉరుగ్వే నైరుతి ప్రాంతంలోని కొలోనియా డెల్ సాక్రమెంటో సందర్శించేందుకు ఒక గొప్ప ప్రదేశం. బారియో హిస్టోరికో మాదిరిగానే, దేశంలో అత్యంత ఎక్కువ మంది సందర్శించే అనేక ఆకర్షణలకు ఇది నిలయమైంది.

"గులకరాళ్ల వీధులు, సున్నం పూసిన గోడలు, వీధులకు ఇరువైపులా రంగురంగుల పువ్వులతో ఒక చిట్టడవిలా ఉంటుంది" అని ఆ ప్రాంతం గురించి తవాని వివరించారు.

"అక్కడి పాతకాలపు కార్లు దీనిని మరింత ప్రత్యేకంగా చేస్తాయి" అని అన్నారు.

ఫొటో సోర్స్, Thomas Trutschel/Photothek via Getty Images

నార్వే

డబ్ల్యూపీఎస్ ఇండెక్స్‌లో నార్వే మూడో స్థానంలో ఉంది. సంక్షేమ కార్యక్రమాలు, సమాన వేతనం, సామాజిక భద్రత వంటి రంగాలలో మంచి పనితీరు కనబరుస్తుంది.

2017 నుంచి ఇది తరచూ టాప్ 3లో ఉంటోంది. దీని బలమైన సామాజిక భద్రత వ్యవస్థ మహిళలు పనిచేయడానికి, ప్రభుత్వంలో చురుగ్గా పాల్గొనడానికి వీలు కల్పిస్తుంది.

ఒంటరిగా ప్రయాణించే మహిళలకు ఈ ప్రదేశం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏంటంటే... భద్రత, ప్రకృతికి సంబంధించిన అందమైన దృశ్యాలు.

''ఇక్కడ ఒంటరిగా ప్రయాణించడం చాలా తేలిక'' అని ట్రావెలర్ జానిస్ లింట్జ్ చెప్పారు. ''నా క్రూయిజ్ ప్రయాణం చాలా అద్భుతమైన అనుభవాల్లో ఒకటి'' అని తెలిపారు.

"రాత్రిపూట ఆకాశాన్ని ఫోటోలు తీయడానికి బయటకు వెళ్లినప్పుడు కూడా నార్వేలో నాకు సురక్షితంగా అనిపించింది" అని ది వాండరింగ్ లెన్స్ ట్రావెల్ ఫోటోగ్రఫీ క్లబ్ వ్యవస్థాపకురాలు లీసా మిషెల్ బర్న్స్ చెప్పారు.

తను రెండుసార్లు ఒంటరిగా నార్వేను సందర్శించారు. అక్కడున్న సౌకర్యవంతమైన హోటళ్లు కూడా బర్న్స్‌కు నచ్చాయి.

''రోర్‌బుయే (క్యాబిన్లుగా మార్చిన పాత ఇళ్లు), స్కాండినేవియన్ ఇంటీరియర్ డిజైన్‌ను చాలా ఇష్టపడటంతో.. నేనెప్పుడూ నార్వే తిరిగి వెళ్లాలనుకుంటాను'' అని చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)