'ఈరోజు ఒక నాగరికత అంతానికి.. 47 ఏళ్ల సామ్రాజ్యానికి ముగింపు' అని ట్రంప్ పోస్ట్, ఏం జరగబోతోంది?

ఫొటో సోర్స్, EPA/Shutterstock

చదివే సమయం: 3 నిమిషాలు

మంగళవారం రాత్రికల్లా 'ఒక నాగరికత మొత్తం అంతరించిపోతుంది' అంటూ ఇరాన్‌ను సూటిగా హెచ్చరించారు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్.

హార్ముజ్ విషయంలో ఒక ఒప్పందానికి వచ్చేందుకు అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 8 గంటల వరకు ట్రంప్ ఇరాన్‌కు గడువిచ్చారు. భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 5.30 గంటల వరకు.

అయితే, ఇప్పటివరకూ ఇరాన్ ఎలాంటి ఒప్పందానికీ రాలేదు.

మరోవైపు, ఇప్పటివరకూ తాము సంయమనం పాటించామని ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ (ఐఆర్‌జీసీ) ఒక ప్రకటన విడుదల చేసింది.

ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ట్రూత్ సోషల్‌లో ట్రంప్ ఏం రాశారు?

అధ్యక్షుడు ట్రంప్ మంగళవారం తన సోషల్ మీడియా అకౌంట్ ట్రూత్ సోషల్‌లో ఒక పోస్ట్ చేశారు. మొత్తం నాగరికత అంతరించిపోవడం గురించి ఆ పోస్టులో ఆయన రాశారు.

"ఈరోజు రాత్రికి ఒక నాగరికత మొత్తం అంతరించిపోతుంది. ఇక ఎప్పటికీ కనిపించదు. అలా జరగాలని నేను కోరుకోవడం లేదు. కానీ, అదే జరగొచ్చు" అని ట్రంప్ రాశారు.

"అయితే, ప్రస్తుతం పూర్తిస్థాయిలో పాలన మార్పు జరిగింది కాబట్టి.. విభిన్నమైన, మరింత వివేకవంతులైన, మూర్ఖపు పట్టుదల లేని ఆలోచనాపరులు ముందుకొచ్చారు కాబట్టి.. బహుశా అనూహ్యంగా ఏదైనా జరగొచ్చు, ఎవరికి తెలుసు?"

"ఏం జరుగుతుందో ఈ రాత్రికి తేలిపోతుంది. ఈ ప్రపంచపు సుదీర్ఘ, సంక్లిష్టమైన చరిత్రలో నమోదైన అత్యంత కీలక ఘట్టాలలో ఇదొకటి."

"అవును, అదే జరుగుతుంది. 47 ఏళ్ల దోపిడీ, అవినీతి, చావుల కథ ముగిసిపోనుంది. ఇరాన్ ప్రజలను దేవుడు రక్షించుగాక" అని ట్రంప్ రాశారు.

ఫొటో సోర్స్, EPA

ఐఆర్‌జీసీ ఏమంది?

ట్రంప్ ప్రకటనకు ఇరాన్ నుంచి నేరుగా స్పందన రాకపోయినప్పటికీ, అమెరికా సహా ఈ ప్రాంతంలోని దాని మిత్రదేశాలపై ప్రతీకార చర్యలకు సంబంధించి ఇప్పటివరకూ చాలా సంయమనం పాటించామని, "లక్ష్యాలను ఎంచుకుని సిద్ధంగా ఉన్నాం" అని ఐఆర్‌జీసీ తాజా ప్రకటనలో పేర్కొంది.

"ఇక అన్నీ పక్కకు పోతాయి" అని ఆ ప్రకటనలో పేర్కొంది.

అమెరికా బలగాలు కనుక "రెడ్‌లైన్ దాటితే" తమ ప్రతిఘటన కేవలం ఈ ప్రాంతానికే కాదని, మరింత విస్తరిస్తుందని కూడా ఐఆర్‌జీసీ తెలిపింది.

అమెరికా, దాని మిత్రదేశాల మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటామని, ఫలితంగా ఈ ప్రాంతంలో చమురు, గ్యాస్ సరఫరాకు చాలా ఏళ్లపాటు అంతరాయం కలగొచ్చని కూడా హెచ్చరించింది.

సోమవారం మీడియా సమావేశంలో ట్రంప్ ఏమన్నారు?

దీనికిముందు, అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ సోమవారం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ, "ఇరాన్‌ను రాత్రికి రాత్రే నాశనం చేయొచ్చు" అని హెచ్చరించారు.

గడువులోగా ఒప్పందం కుదుర్చుకోవడంలో ఇరాన్ విఫలమైతే, అది రేపు (మంగళవారం) రాత్రే జరగొచ్చని ట్రంప్ అన్నారు.

ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20 శాతం హార్ముజ్ జలసంధి ద్వారానే జరుగుతుంది, నౌకల రాకపోకలకు వీలుగా ఈ జలసంధిని తెరిచేందుకు ఒప్పందానికి ముందుకు రావాలని ట్రంప్ కోరుతున్నారు.

ఈ కాన్ఫరెన్స్‌లో ట్రంప్‌తో పాటు యూఎస్ జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ డాన్ కేన్, రక్షణ మంత్రి పీట్ హెగ్సేత్ కూడా పాల్గొన్నారు.

గత వారమే దక్షిణ ఇరాన్‌లో కూల్చివేసిన ఎఫ్ 15 యుద్ధ విమానంలోని ఇద్దరు వైమానిక అధికారులను అమెరికా భద్రతా దళాలు రక్షించాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)