‘‘చనిపోయిన అమ్మ కలలో కనిపించి వైద్యపరీక్షలు చేయించుకోమని చెప్పకపోయుంటే, నాకు క్యాన్సర్ ఉన్నట్టు తెలిసేది కాదు’

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, కేట్ బోవీ
    • హోదా, గ్లోబల్ హెల్త్, బీబీసీ వరల్డ్ సర్వీస్
  • చదివే సమయం: 7 నిమిషాలు

అడిలైన్‌కు 2011లో వచ్చిన ఓ కల ఆమె జీవితాన్నే మార్చేసింది.

మూడేళ్ల కిందట చనిపోయిన తన తల్లిని తలుచుకుంటూ అడిలైన్ డిప్రెషన్‌తో బాధపడేవారు.

"ఓ రోజు రాత్రి మా అమ్మ నాకు కలలో కనిపించింది" అని హాంగ్‌కాంగ్‌కు చెందిన అడిలైన్ (పేరు మార్చాం) చెబుతున్నారు.

"నాకింకా గుర్తుంది, 'అమ్మా.. ఎట్టకేలకు నిన్ను కలిశాను, ఎలా ఉన్నావు?' అని అడిగా. అందుకు ఆమె 'నేను బానే ఉన్నాను, కానీ నీకొక విషయం చెప్పాలి. వీలైనంత త్వరగా వైద్య పరీక్షలు చేయించుకో' అని చెప్పారు’’

ఆ 'బలమైన సందేశంతో', డాక్టర్ అపాయింట్‌మెంట్ తీసుకున్నట్లు అడిలైన్ చెబుతున్నారు. ఆ తర్వాత, ఆమెకు క్యాన్సర్ మొదటి దశలో ఉన్నట్లు నిర్ధరణ అయింది. క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించడం వల్ల చికిత్స సాధ్యమైంది.

"నేను చాలా అదృష్టవంతురాలిని" అంటున్నారు అడిలైన్. " అమ్మ కలలో కనిపించి చెప్పకపోతే నేను వైద్య పరీక్షలు చేయించుకునే దానిని కాదు."

వివిధ సంస్కృతులకు చెందిన ప్రజలు తమ కలలను విశ్లేషించుకోవడమనేది వందల సంవత్సరాలుగా ఉంది.

ప్రాచీన ఈజిప్టియన్, గ్రీక్, బాబిలోనియన్ నాగరికతలు కలలు భవిష్యత్తు గురించి చెబుతాయని విశ్వసించాయి.

అబ్రహామిక్ మతాల్లో(యూదు, క్రైస్తవ, ఇస్లాం) కలలను దేవుడి సందేశాలు, భవిష్యత్ మార్గదర్శకాలుగా పరిగణిస్తారు. కొన్ని స్థానిక సమూహాలు కలలను 'ఆత్మ సహాయకులు' తమను సందర్శించే సందర్భాలుగా చూస్తారు.

Sorry, we can’t display this part of the story on this lightweight mobile page.
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఆన్‌లైన్‌లోనూ కలలపై చర్చ

కలల ద్వారా పూర్వీకులు సందేశాలు అందిస్తారనే సంప్రదాయ చైనీస్ విశ్వాసాల గురించి తనకు తెలుసని, కానీ అది తనకు జరుగుతుందని ఎప్పుడూ అనుకోలేదని అడిలైన్ చెబుతున్నారు.

కలలపై ఉన్న ఈ ఆసక్తి ఇప్పుడు ఆన్‌లైన్‌‌కూ విస్తరించింది.

హాంగ్‌కాంగ్‌కు చెందిన డిస్కస్(DISCUSS) ఫోరమ్ వినియోగదారులు తమ కలల గురించి పంచుకుంటుండగా, వందల సంఖ్యలో రెడ్డిట్ యూజర్లు తమ కలలను విశ్లేషించేందుకు చాట్‌జీపీటీని ఆశ్రయిస్తున్నట్టు చెబుతున్నారు.

అయితే, అడిలైన్‌కు వచ్చిన కలలు మనకు ఏం చెబుతున్నాయి?

వాటిని ఎంతవరకూ పరిగణనలోకి తీసుకోవచ్చనే విషయంపై శాస్త్రవేత్తలు, సైకాలజిస్టులు ఏం చెబుతున్నారు?

అసలు కలలు ఎందుకొస్తాయి?

కలలు కనడాన్ని మన మెదడు బాగా ఇష్టపడుతుంది. మనం నిద్రలో రాపిడ్ ఐ మూవ్‌మెంట్ (ఆర్ఈఎమ్) దశలో ఉన్నప్పుడు "దాదాపు కలలు కంటూనే ఉంటాం" అని లండన్‌లోని యూకే ఇంపీరియల్ కాలేజీ న్యూరోసైంటిస్ట్ డాక్టర్ అబిదెమి ఒటైకు అంటున్నారు.

అంటే, మనం నిద్రించే మొత్తం సమయంలో దాదాపు మూడింట ఒకవంతు కలలు కంటూ ఉండవచ్చు.

నిజానికి గాఢనిద్ర పట్టకపోవడం వల్ల మనకు కలలు రాకపోతే ఆ తర్వాత మనం నిద్రపోయినప్పుడు మన మెదడు కలలను మరింత స్పష్టంగా చూపుతుంది. ఈ ప్రక్రియను ఆర్ఈఎమ్ రీబౌండ్‌గా వ్యవహరిస్తారు.

"శరీరం కలలు కనాలనుకుంటుంది, అవకాశం దొరికినప్పుడు వాటిని తిరిగి పొందుతుంది" అని ఒటైకు అంటున్నారు.

అసలు మనమెందుకు నిద్రపోతామన్నది శాస్త్రీయంగా ఇప్పటికీ ఓ మిస్టరీనే. ఇంకా వివరంగా చెప్పాలంటే.. మెదడు కోలుకోవడానికి, రోజువారీ జ్ఞాపకాలను క్రమబద్ధీకరించుకోవడానికి నిద్ర తగిన సమయంగా పరిశోధకులు విశ్వసిస్తున్నారు.

నిద్రలో మన మెదడులో సెట్టింగ్స్ మారిపోతున్నట్లు, మనం మన కలలను అనుభూతి చెందే విధానం మారిపోతున్నట్లు బ్రెయిన్ స్కాన్లు చూపిస్తాయి.

మనం కలలు కంటున్న సమయంలో, మనల్ని హేతుబద్ధంగా ఆలోచింపజేసే మెదడు భాగాలైన ఫ్రంటల్ లోబ్స్ దాదాపుగా పనిచేయవు. అదే సమయంలో, భావోద్వేగాలకు సంబంధించిన లింబిక్ సిస్టమ్ చాలా చురుగ్గా ఉంటుంది.

"అందుకే మన కలలు చాలా వింతగా, అర్ధరహితంగా ఉంటాయి" అని ఒటైకు చెప్పారు.

నిర్ణయాలు తీసుకోవడంలో కలలు సాయపడతాయా?

మనకు కలల్లో కనిపించే విషయాలు, మనం మేల్కొని ఉన్నప్పుడు మెరుగైన నిర్ణయాలు తీసుకునేలా ప్రోత్సహిస్తాయని పరిశోధనలు సూచిస్తున్నాయి.

పొగతాగడం గురించి కలలు కన్న మాజీ ధూమపాన ప్రియులు మళ్లీ పొగతాగే అవకాశం తక్కువని ఒక అధ్యయనంలో తేలింది. విడాకులు తీసుకున్న వారిలోనూ ఇదే తరహా ఫలితాలు కనిపించాయి. తమ మాజీ భాగస్వాముల గురించి కలలు కన్నవారు ఏడాది తర్వాత మానసికంగా మరింత ఆరోగ్యంగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.

"అంటే, వారు భావోద్వేగపరంగా కష్టతరమైన ఒక విషయాన్ని అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరీముఖ్యంగా, వచ్చిన కల సానుకూలమా? ప్రతికూలమా? అన్నది ఇక్కడ ప్రధానం కాదు" అని అమెరికాకు చెందిన కలల పరిశోధకులు, సైకాలజిస్ట్ డాక్టర్ డైలాన్ సెల్టర్‌మాన్ అంటున్నారు.

నిజానికి, ఈ రెండు అధ్యయనాలు కూడా సానుకూలమైన కలల కంటే, ప్రతికూలమైన కలలే సమస్యలను మరింత సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు సాయపడగలవని చూపాయి.

"మీరు దానిని విశ్లేషించుకుంటున్నారు, ఒక నిర్మాణాత్మక పద్ధతిలో దానిని పరిష్కరించుకుంటున్నారు" అని సెల్టర్‌మాన్ చెబుతున్నారు.

సమస్యల పరిష్కారంలోనూ కలలు మనకు సాయపడతాయి. ఒక చిక్కుముడిని పరిష్కరించాలని అడిగినప్పుడు, దాని గురించి కలలు కన్నవారు మెరుగ్గా రాణించినట్లు హార్వర్డ్ అధ్యయనంలో తేలింది.

ఒక సమస్యను విశ్లేషించుకునేందుకు మెదడుకు అదనపు సమయం దొరకడం, దానిని మరింత సృజనాత్మకంగా చూసేందుకు అవకాశం కల్పించడం అనే అంశాల 'శక్తిమంతమైన కలయిక'వల్ల ఇలా జరగొచ్చని సెల్టర్‌మాన్ అంటున్నారు.

మన రోజువారీ జీవితంలో, మనం మేల్కొని ఉన్న సమయంలో బాగా ఆలోచిస్తున్న విషయం గురించి ఈ కలలు హఠాత్తుగా ఓ స్ఫూర్తిగానూ నిలవొచ్చు.

"కల, ఆ దిశగా వారికి ఒక చిన్న కిక్‌స్టార్ట్ ఇవ్వొచ్చు" అని సెల్టర్‌మాన్ అంటారు.

ఫొటో సోర్స్, Getty Images

కలలు మీ అసలైన భావాలను తెలుపుతాయా?

కలలు మనలోని నిజమైన భావాలను వెల్లడిస్తాయా అంటే మనసులో దాగివున్న లేదా నిజమైన భావోద్వేగాలను అవి ప్రతిబింబిస్తాయని అర్థం కాదు. మీరు మేల్కొని ఉన్నప్పుడు ఆలోచిస్తున్న విషయాల గురించి, నిద్రలో ఉన్నప్పుడు కూడా మీ మెదడుకు ఆసక్తి ఉంటుందని మాత్రమే దీనర్థం.

కలల అధ్యయనంలో పాల్గొన్నవారు, కలల కారణంగా తమ భాగస్వాముల నుంచి విడిపోవడం తాను గమనించానని సెల్టర్‌మాన్ చెప్పారు. అయితే, అంతకుముందే తమ రిలేషన్‌షిప్‌లో సమస్యలు ఉన్నట్లు వారు చెప్పారు.

"కలలు వారికి అవసరమైన చిన్న ప్రోత్సాహాన్నిచ్చాయి. వారు తమ గురించి తాము కొంత అవగాహన పొందుతున్నట్లు భావించారు. కానీ, అది అంతకుముందు నుంచే వారు విశ్వసిస్తున్న దానికి అనుగుణంగా ఉంది" అని ఆయన వివరిస్తున్నారు.

అయితే, అనూహ్యంగా ఎవరి గురించో కలలు వస్తే ఏం చేయాలి? ఆందోళన చెందాలా?

"మీరు సంతోషకరమైన, ప్రేమపూర్వక రిలేషన్‌షిప్‌లో ఉండి.. అనుకోకుండా ఏదో ఒక రాత్రి మరొకరితో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు కల వస్తే, ఫర్వాలేదు. అది సర్వసాధారణం" అని సెల్టర్‌మాన్ అంటున్నారు.

"దాని గురించి అపరాధభావంతో బాధపడాల్సిన పనిలేదు. అది ఏదో చెడు జరగబోతోందన్న సంకేతమేమీ కాదు" అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Dr Abidemi Otaiku

ఫొటో క్యాప్షన్, "మీకు వచ్చిన కలలు నిజజీవితానికి దగ్గరగా లేకపోతే, మీరు వాటిని మర్చిపోతారు" అని న్యూరోసైంటిస్ట్ ఒటైకు చెప్పారు.

కలలు భవిష్యత్తును అంచనా వేయగలవా?

కలలు భవిష్యత్తును సూచిస్తున్నట్లు అనిపించినప్పుడు, నిజజీవిత సంఘటనలకు అవి దగ్గరగా ఉన్నప్పుడు వాటిని గమనించేందుకు మెదడు సిద్ధంగా ఉంటుంది.

"మీకు వచ్చిన కలలు నిజజీవితానికి దగ్గరగా లేకపోతే, మీరు వాటిని మర్చిపోతారు" అని న్యూరోసైంటిస్ట్ ఒటైకు చెప్పారు.

కానీ, కలలు మానసిక సంబంధిత అంశాలుగా అనిపించేందుకు మరో కారణం కూడా ఉండొచ్చు, ఇది మెదడుకు సంబంధించిన ఇంటరోసెప్షన్ సామర్థ్యాలతో ముడిపడి ఉన్నట్లు ఒక సిద్ధాంతం చెబుతోంది.

"కొందరు దీనిని సిక్త్స్ సెన్స్ అని కూడా పిలుస్తారు. ముఖ్యంగా, శరీర అంతర్గత స్థితిని గ్రహించగల మెదడు సామర్థ్యం" అని ఒటైకు చెప్పారు.

ఇంటరోసెప్షన్‌లో భాగమయ్యే మెదడులోని భాగాలు, కలలు కనే ప్రక్రియలో భాగమయ్యే భాగాలతో కలుస్తాయి, కొన్ని కలలు మన అనారోగ్యాన్ని ముందుగానే సూచిస్తున్నట్లు ఎందుకు అనిపిస్తుందో ఇది వివరించగలదని పరిశోధకులు అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మీకు పీడకలలు ఎక్కువగా వస్తున్నట్లయితే, డిమెన్షియా లేదా పార్కిన్సన్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదంఎక్కువగా ఉండవచ్చు

పీడకలలపై శ్రద్ధ అవసరమా?

ఒటైకు వంటి న్యూరోసైంటిస్టుల దగ్గరి నుంచి ఈ రంగంలో పెరుగుతున్న పరిశోధనల వరకు.. మనకు వచ్చే కొన్ని కలలు మెదడు రుగ్మతల వంటి ప్రమాదాలకు సంకేతాలు కావచ్చని సూచిస్తున్నాయి.

"మీకు పీడకలలు ఎక్కువగా వస్తున్నట్లయితే, డిమెన్షియా లేదా పార్కిన్సన్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదంఎక్కువగా ఉండవచ్చు" అని ఆయన అంటున్నారు.

దీనికి సంబంధించి ఆయన వద్ద మూడు సిద్ధాంతాలున్నాయి. పీడకలలు వ్యాధులకు ముందస్తు సంకేతాలు కావొచ్చు లేదా పీడకలల వల్ల ఆరోగ్యం దెబ్బతినొచ్చు, లేదంటే పీడకలలు, వ్యాధులు రెండింటికీ మన జన్యువుల వంటి మరో ఉమ్మడి కారణం ఉండొచ్చు. అయితే, వీటిలో ఏది నిజమో తెలుసుకునేందుకు మరిన్ని పరిశోధనలు అవసరం.

అయితే, ఆ పరిశోధనల ఫలితాలు మనల్ని నిరాశపరచకూడదని, ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు కలిగిన మంచి అవకాశంగా ఉండాలని ఒటైకు అంటున్నారు. ఒత్తిడిని దూరం చేయడం, నాణ్యమైన నిద్ర, నిద్రపోయే ముందు భయానక సినిమాలు చూడకపోవడం వంటివి అందుకు సాయపడతాయి.

ఇంకా తీవ్రమైన కేసుల కోసం కొన్ని ఇతర మార్గాలు కూడా ఉన్నాయి. పదేపదే వస్తున్న పీడకలలకు ముగింపు పలికేందుకు ఇమేజ్ రిహార్సల్ థెరపీ ఉపయోగపడుతుంది. అలాగే, బీపీకి వాడే ఔషధం ప్రాజాసిన్ మామూలు కలలకు ఇబ్బంది లేకుండా, పీడకలలను మాత్రం నిరోధించగలదు.

"పీడకలలకు చికిత్స తీసుకోవడం వల్ల తక్షణ, దీర్ఘకాలిక ప్రయోజనాలు కూడా ఉంటాయనడంలో సందేహం అక్కర్లేదు" అని ఒటైకు చెప్పారు.

కలలను విశ్లేషించుకోవాలా?

కలలు వారి వారి వ్యక్తిగత అనుభవాల ఆధారంగా మారుతుంటాయి, కాబట్టి ఒకే విధమైన ప్రతీకాత్మక అర్థాల కోసం అన్వేషించడం సరికాదని సెల్టర్‌మాన్ అంటున్నారు.

అయితే, కలల్లోని ఇతివృత్తాల కోసం అన్వేషించడం మనల్ని మనం బాగా అర్ధం చేసుకోవడానికి సాయపడుతుందని ఆయన అంటున్నారు.

"బహుశా మీరు చనిపోయిన మీ ఆత్మీయుల గురించి ఎక్కువగా కలలు కంటుండొచ్చు, లేదా భవిష్యత్తులో చేయాలనుకుంటున్న ఉద్యోగం గురించి, లేదా మీ స్నేహితులు, మీ సన్నిహితుల గురించి కావొచ్చు."

కలల్లో కనిపించే ఇతివృత్తాలను గమనిస్తూ ఉండడం.. మనకు మన గురించి, మన సంబంధాల గురించి లోతైన అవగాహన కల్పిస్తుందని సెల్టర్‌మాన్ అంటున్నారు.

"కలలకు ఏదైనా ప్రాముఖ్యం ఉంటే, అది మన సామాజిక జీవితంలోనే ఉండే అవకాశం ఎక్కువ."

అడిలైన్ మాట్లాడుతూ.. తాను ఇప్పుడు తన కలలపై మరింత శ్రద్ధ పెడుతున్నానని, తన భావాలతో పోల్చుకోవడానికి వాటిని ఒక రిమైండర్‌లా ఉపయోగించుకుంటున్నట్లు చెప్పారు.

"మన కలలు మనకు ఏం సందేశమిస్తున్నాయనే విషయంలో మన అంతర్ దృష్టిని నమ్మాలి. మీ అంతరాత్మను మీరు లోతుగా పరిశీలిస్తే, సమాధానం మీకే దొరుకుతుంది" అని ఆమె అంటున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)