తెలంగాణ కులగణన: కాపులకు 12, ఎస్సీ డక్కల్‌కు 116.. ఏమిటీ 'సీబీఐ' పాయింట్లు?

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, సీపెక్ సర్వే కోసం 3,54,77,554 మందికి సంబంధించిన సమగ్ర వివరాలను సేకరించామని ప్రభుత్వం ప్రకటించింది.
    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 7 నిమిషాలు

తెలంగాణ ప్రభుత్వం 2024 నవంబరులో నిర్వహించిన సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్య, రాజకీయ, కుల సర్వే వివరాలను విడుదల చేసింది.

బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ వివరాలను విడుదల చేశారు. సర్వే సమగ్ర వివరాలను ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉంచింది.

ఈ సర్వే కోసం 3,54,77,554 మందికి సంబంధించిన సమగ్ర వివరాలను సేకరించామని ప్రభుత్వం తెలిపింది.

''ఈ సర్వే కోసం 97శాతం జనాభాకు సంబంధించిన 75 రకాల వివరాలను ప్రభుత్వం సేకరించింది'' అని సర్వే వివరాల అధ్యయనానికి నియమించిన కమిటీ ప్రకటించింది.

తెలంగాణలో 242 ఉపకులాలకు చెందిన జనాభా నుంచి వివరాలు సేకరించామని ప్రభుత్వం వెల్లడించింది.

‘‘సమగ్ర కులగణన నిరంతరం జరగాలి, దాని ఆధారంగా ప్రభుత్వ కార్యక్రమాల రూపకల్పన జరగాలి’’ అని సీనియర్ జర్నలిస్టు దుర్గం రవీందర్ బీబీసీతో అన్నారు.

ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
Sorry, we can’t display this part of the story on this lightweight mobile page.

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, తెలంగాణలో అన్ని విభాగాల్లో వెనుకబడిన కులాన్ని గుర్తించేందుకు ప్రభుత్వం 'కాంపోజిట్ బ్యాక్‌వర్డ్‌నెస్ ఇండెక్స్‌'ను ఉపయోగించుకుంది.

ఎస్సీ డక్కల్ - బాగా వెనుకబడిన కులం

సర్వేలో 'అత్యంత వెనుకబడిన, తక్కువగా వెనుకబడిన' కులాన్ని నిర్ధరించేందుకు కాంపోజిట్ బ్యాక్‌వర్డ్‌నెస్ ఇండెక్స్ ను ప్రభుత్వం వినియోగించుకుంది.

ఈమేరకు 42 పారామీటర్ల (ప్రమాణాల) ఆధారంగా బాగా వెనుకబడిన కులం 'ఎస్సీ డక్కల్' అని ప్రభుత్వం ప్రకటించింది.

విద్య, వృత్తి, ఆదాయం, స్థిరాస్తులు, జీవన స్థితిగతులు, లింగ భేదం, సామాజిక వివక్ష, విద్యాసంస్థల్లో చేరికలు.. ఇలా వివిధ అంశాల ఆధారంగా కాంపోజిట్ బ్యాక్‌వర్డ్‌నెస్ ఇండెక్స్ (సీబీఐ)ను ప్రభుత్వం నిర్ణయించింది. దీని ఆధారంగా 0 నుంచి 126 మధ్య స్కోర్ (మార్కులు) కేటాయించింది. ఎంత ఎక్కువ స్కోర్ వస్తే, అంత వెనుకబడిన కులంగా భావిస్తారు.

116 పాయింట్లతో 'డక్కల్' బాగా వెనుకబడిన కులంగా తేలిందని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.

డక్కల్, డక్కల్ వార్ కులాల కుటుంబాలు తెలంగాణలో 1630 ఉన్నట్లు సమగ్ర కులగణనలో తేలింది. వీరి జనాభా 5053 మంది. మొత్తం ఎస్సీ జనాభాలో వీరు 0.08 శాతం.

వీరి తర్వాత బాగా వెనుకబడిన కులాలుగా ఎస్సీ బేడ (సీబీఐ స్కోర్ 113), ఎస్టీ నక్కల (112), ఎస్సీ సింధోళ్లు (112), బీసీ-ఈ తురక ముస్లిం (111) ఉన్నారు.

ఫొటో సోర్స్, NurPhoto via Getty Images

ఫొటో క్యాప్షన్, మొత్తం అన్ని కులాల సీబీఐ సగటు స్కోరు 81 అని ప్రభుత్వం ప్రకటించింది.

తక్కువ వెనుకబడిన కులం - కాపు

తక్కువ వెనుకబడిన కులం 'కాపు' అని సర్వేలో వెల్లడైనట్లు ప్రభుత్వం ప్రకటించింది. సీబీఐ ప్రకారం, కాపులకు 12 పాయింట్లు వచ్చాయని పొన్నం ప్రభాకర్ తెలిపారు.

తెలంగాణలో 81,310 కాపు కుటుంబాలు ఉండగా, 2,41,882 మంది జనాభా ఉన్నట్లు సమగ్ర కుల గణన ద్వారా తేలిందని ప్రభుత్వం ప్రకటించింది.

కాపు కులం 'ఓసీ' కేటగిరీలో ఉంది. మొత్తం ఓసీ కేటగిరీ జనాభాలో కాపులు 4.32శాతం ఉన్నారు.

కాపుల తర్వాత తక్కువ వెనుకబడిన కులాల జాబితాలో ఓసీ జైన్ (సీబీఐ స్కోర్ 13), ఓసీ రాజు (17), ఓసీ వెలమ (19), కమ్మ (19), అయ్యంగార్ (19) ఉన్నారు.

''సీబీఐ అనేది తెలంగాణలో కులాలలో వెనుకబాటును తెలియజేసే సూచిక మాత్రమే. ఇది పూర్తి స్థాయిలో వెనుకబాటును లేదా దేశంలో ఇతర కులాలతో పోలికను తెలియజేస్తుందని చెప్పడం లేదు'' అని పొన్నం ప్రభాకర్ చెప్పారు.

అన్ని కులాల సగటు సీబీఐ స్కోరు మొత్తం 81 వచ్చిందని ప్రభుత్వం ప్రకటించింది.

''ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కులగణన శాస్త్రీయంగా లేదన్న విమర్శలున్నాయి. కులాల వారీగా సమగ్ర అధ్యయనం జరగాలి. కులాల్లోనే వయసుల వారీగా, విద్యార్హతలపై క్షేత్రస్థాయి పరిశీలన జరగాలి. అక్కడ కనుగొన్న లోపాల పరంగా పరిష్కార మార్గాలు గుర్తించి చర్యలు తీసుకోవాలి'' అని దుర్గం రవీందర్ చెప్పారు.

పాత సంప్రదాయ వృత్తుల్లో చాలామంది కొనసాగడం లేదని, వృత్తులవారీగా అవసరమైన రక్షణ చర్యలు ఉండాలని సూచించారు.

ఫొటో సోర్స్, facebook.com/Exmpkarimnagr

ఫొటో క్యాప్షన్, కులగణన సర్వే వివరాలను బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.

అధ్యయనానికి కమిటీ

కులగణన ఆధారంగా కొన్ని ముఖ్యమైన వివరాలను నిపుణుల కమిటీ క్రోడీకరించింది.

కుల గణనపై అధ్యయనం చేసేందుకు 2025 మార్చిలో తొమ్మిది మందితో ఇండిపెండెంట్ ఎక్స్‌పర్ట్ వర్కింగ్ గ్రూప్ (ఐఈడబ్ల్యూజీ)ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి చైర్మన్‌గా వ్యవహరించారు.

ఈ కమిటీ కులగణనపై అధ్యయనం చేసి కొన్ని ముఖ్యమైన వివరాలను పొందుపరిచింది.

  • సీబీఐ స్కోరు ప్రకారం జనరల్ కేటగిరీ కులాలతో పోల్చితే ఎస్సీ, ఎస్టీలు మూడు రెట్లు వెనుకబడి ఉన్నారు.
  • జనరల్ కేటగిరీ కులాలతో పోల్చితే బీసీలు 2.7 రెట్లు వెనుకబడ్డారు.
  • రాష్ట్ర సగటు సీబీఐ స్కోర్ 81 కంటే ఎక్కువగా 135 కులాలు ఉన్నాయి. ఇందులో 69 బీసీ కులాలు, 41 ఎస్సీ కులాలు, 25 ఎస్టీ కులాలు ఉన్నాయి.
  • ఓసీ కేటగిరీలోని 18 కులాల సీబీఐ స్కోర్ రాష్ట్ర సగటు కంటే తక్కువగా ఉంది. ఈ 18 కులాల జనాభా రాష్ట్ర జనాభా (సర్వేలో పాల్గొన్నవారు)లో 12శాతం.
  • దినసరి కూలీలుగా పనిచేస్తున్న వారిలో సుమారు సగంమంది ఎస్సీ కేటగిరీకి చెందినవారే ఉన్నారు. జనరల్ కేటగిరీకి చెందిన వారు పదిమందిలో ఒకరు ఉన్నారు.
  • ప్రైవేటు రంగంలో నిపుణులైన వారిలో 30శాతం మంది జనరల్ కేటగిరీకి చెందిన వారు కాగా, కేవలం ఐదు శాతం మంది ఎస్టీలు ఉన్నారు.
  • జనరల్ కేటగిరీకి చెందిన పిల్లల్లో మూడోవంతు మంది ప్రైవేటు పాఠశాలలకు వెళుతుండగా, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు చెందిన పిల్లలు పదిశాతం లోపే ఉన్నారు.
  • సొంతింట్లో ఉండే ఎస్టీ కుటుంబాల్లో మూడోవంతు మందికి మరుగుదొడ్డి లేదా నల్లా నీటి సౌకర్యం లేకపోగా, జనరల్ కేటగిరీ పరంగా 5శాతం మంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు.

సర్వేలో మరో ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చిందని నిపుణుల కమిటీ కన్వీనర్ ప్రవీణ్ చక్రవర్తి వివరించారు.

'ప్రతి వెనుకబడిన కులం.. సమానంగా వెనుకబడినట్లుగా లేదు. 107 కులాల సీబీఐ స్కోర్ రాష్ట్ర సగటు స్కోర్ కంటే తక్కువగా ఉంది. ఇందులో 18 జనరల్ కేటగిరీ కులాలు (ఓసీలు), 64 బీసీ కులాలు, 18 ఎస్సీ కులాలు, ఏడు ఎస్టీ కులాలు ఉన్నాయి'' అని వివరించారు.

ఈ కులాలన్నీ రాష్ట్ర జనాభాలో 29శాతం ఉన్నాయన్నారు ప్రవీణ్ చక్రవర్తి.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కులం చెప్పడానికి నిరాకరించే వారి కోసం 'నో కాస్ట్', అలాగే ప్రభుత్వం ప్రకటించిన 242 కులాల వారు కాకుండా ఇతర కులాల వారు ఉంటే.. వారికి 'అదర్' అనే ఆప్షన్‌ను ఇచ్చారు.

13 లక్షల మందికి 'కులం'తో సంబంధం లేదు.

సర్వేలో కులం పేరు చెప్పడంతోపాటు, మరో రెండు రకాల ఆప్షన్లను ప్రభుత్వం ఇచ్చింది.

కులం చెప్పడానికి నిరాకరించే వారి కోసం 'నో కాస్ట్', అలాగే ప్రభుత్వం ప్రకటించిన 242 కులాల వారు కాకుండా ఇతర కులాల వారు ఉంటే.. వారికి 'అదర్' అనే ఆప్షన్‌ను ఇచ్చారు.

సర్వేలో ఈ రెండు ఆప్షన్లను 13.7 లక్షల మంది ఎంచుకున్నారని ప్రభుత్వం ప్రకటించింది.

Sorry, we can’t display this part of the story on this lightweight mobile page.

ఎస్సీ కేటగిరీ వివరాలు

ఎస్సీల విషయానికి వస్తే, మొత్తం 19,47,603 కుటుంబాలు సర్వేలో పాల్గొన్నాయి. అంటే రాష్ట్రంలో సర్వేలో పాల్గొన్న మొత్తం కుటుంబాల్లో ఇది 17.37శాతం.

ఎస్సీ కేటగిరీలో 59 ఉపకులాలు ఉన్నట్లు ప్రభుత్వం సర్వేలో ప్రస్తావించింది. వీరిలో మాదిగ, మాల, ఆది ఆంధ్ర సహా అనేక కులాలున్నాయి.

Sorry, we can’t display this part of the story on this lightweight mobile page.

ఎస్టీ కేటగిరీ వివరాలు

ఎస్టీల విషయానికి వస్తే తెలంగాణలో 11,20,470 కుటుంబాలపై సర్వే జరిగింది. వీరు సర్వేలో పాల్గొన్న మొత్తం కుటుంబాల్లో 9.99శాతం.

జనాభా విషయానికి వస్తే, 37,05,929 మంది సర్వేలో పాల్గొన్నారు, వీరు 10.45శాతం.

ఎస్టీలలో మొత్తం 32 ఉపకులాలు ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

Sorry, we can’t display this part of the story on this lightweight mobile page.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బీసీలలో ముస్లిం మైనార్టీలు ఒక కేటగిరీగా, ముస్లిమేతర బీసీలను మరో కేటగిరీగా విభజించారు.

బీసీ కేటగిరీ వివరాలు..

బీసీల పరంగా చూస్తే... వీరిని రెండు వర్గాలుగా ప్రభుత్వం విభజించింది.

బీసీలలో ముస్లిం మైనార్టీలు ఒక కేటగిరీగా, ముస్లిమేతర బీసీలను మరో కేటగిరీగా విభజించి సర్వే నిర్వహించింది.

దీని ప్రకారం, బీసీలలో ముస్లిం మైనార్టీల పరంగా 10,10,408 కుటుంబాలు సర్వేలో పాల్గొన్నాయి. వీరి జనాభా 35,76,588.

ముస్లిం మైనార్టీలను కలపకుండా బీసీలను చూస్తే, 52,31,769 కుటుంబాలు సర్వేలో పాల్గొన్నాయి. వీరి జనాభా 1,64,09,179 గా ఉంది.

మొత్తం బీసీలలో 134 ఉప కులాలు ఉన్నట్లుగా సర్వేలో ప్రభుత్వం ప్రకటించింది.

బీసీలు

Sorry, we can’t display this part of the story on this lightweight mobile page.
Sorry, we can’t display this part of the story on this lightweight mobile page.

ఓసీల పరంగా మొత్తం 19,04,884 కుటుంబాలను సర్వే చేయగా, 56,01,539 మంది సర్వేలో పాల్గొన్నారు.

వీరిలో మొత్తం 18 ఉపకులాలు ఉన్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. అలాగే 12,04,024 మంది తమ కులం ఓసీగా చెప్పినప్పటికీ, వారి ఉపకులం వెల్లడించలేదని సర్వే వివరాలు స్పష్టం చేస్తున్నాయి.

ఓసీలు

Sorry, we can’t display this part of the story on this lightweight mobile page.

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, బీసీలలో ముస్లిం మైనార్టీల పరంగా 10,10,408 కుటుంబాలు సర్వేలో పాల్గొన్నాయి.

90 శాతం జనాభా 56 కులాలవారే

మొత్తం సర్వేలో పాల్గొన్న 242 కులాల్లో కొన్ని కులాలకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారని సమగ్ర కులగణనలో తేలింది.

56 కులాలకు చెందిన వారు ఆయా కులాల్లో 50వేల మందికి పైబడి ఉన్నారని తేలింది. వీరి ప్రాతినిధ్యం రాష్ట్ర జనాభాలో 90శాతమని సర్వేలో తేలింది.

కులం చెప్పడానికి ఇష్టపడని వారు, 'ఇతరులు' వీరితో కలిస్తే రాష్ట్ర జనాభాలో 94శాతం వాటా అని ప్రభుత్వం ప్రకటించింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)