సైఫ్ అల్ ఇస్లాం గడాఫీ హత్య : పులుల పెంపకం, గద్దలతో వేటను ఇష్టపడే ఈ లిబియా నేతకు అత్యంత క్రూరమైన నేతగా పేరు ఎలా వచ్చింది?

ఫొటో సోర్స్, Reuters

చదివే సమయం: 3 నిమిషాలు

లిబియా మాజీ పాలకుడు కల్నల్ మువమ్మర్ గడాఫీ కుమారుడు సైఫ్ అల్ ఇస్లాం గడాఫీని దుండగులు కాల్చి చంపినట్లు రిపోర్టులు వస్తున్నాయి.

ఒకప్పుడు గడాఫీ వారసుడిగా భావించిన 53 ఏళ్ల సైఫ్ అల్ ఇస్లాం గడాఫీ మరణాన్ని ఆయన రాజకీయ బృందం మంగళవారం ధ్రువీకరించినట్లు లిబియన్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది.

'నలుగురు కమాండోల' బృందం జింటాన్ నగరంలోని నివాసంలో ఆయనను హతమార్చినట్లు ఇస్లాం గడాఫీ న్యాయవాది ఒకరు ఏఎఫ్‌పీ వార్తా సంస్థకు తెలిపారు.

అయితే, దీని వెనుక ఎవరున్నారనేది తెలియాల్సి ఉందని చెప్పారు.

అయితే, ఆయన సోదరి ప్రకటన అందుకు భిన్నంగా ఉంది. అల్జీరియా సరిహద్దుకు సమీపంలో సైఫ్ మరణించినట్లు ఆమె లిబియన్ టీవీకి తెలిపారు.

Sorry, we can’t display this part of the story on this lightweight mobile page.
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గడాఫీ తర్వాత అత్యంత ప్రభావంతమైన వ్యక్తి

1969 నుంచి లిబియాను పాలించిన కల్నల్ గడాఫీ తర్వాత, దేశంలో అత్యంత ప్రభావవంతమైన, భయంకరమైన వ్యక్తిగా సైఫ్ అల్ ఇస్లాం గడాఫీని చెప్పేవారు.

2011లో జరిగిన తిరుగుబాటుతో కల్నల్ గడాఫీ పదవీచ్యుతుడు కావడంతో పాటు హత్యకు గురయ్యారు.

1972లో జన్మించిన సైఫ్ అల్ ఇస్లాం గడాఫీ, 2000 సంవత్సరం నుంచి గడాఫీ పాలన అంతమయ్యే వరకూ పశ్చిమ దేశాలతో లిబియాకు సత్సంబంధాలు నెలకొల్పడంలో కీలకపాత్ర పోషించారు.

ఆయన తండ్రి పదవి దిగిపోవడానికి ముందు, దేశంలో జరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలను అణచివేయడంలో ఇస్లాం అత్యంత క్రూరంగా వ్యవహరించారంటూ ఆరోపణలు వచ్చాయి. కల్నల్ గడాఫీ పదవీచ్యుతుడయ్యాక ఇస్లాంను ప్రత్యర్ధి మిలిషియా ఆరేళ్లపాటు జింటాన్ నగరంలోని జైల్లో పెట్టింది.

2011నాటి నిరసనలను అణచివేయడంలో అమానవీయ నేరాలకు పాల్పడిన ఇస్లాం గడాఫీపై విచారణ జరపాలని అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు భావించింది.

అణచివేతలో ఆయన పాత్రకు గానూ ట్రిపోలీలోని ఒక కోర్టు 2015లో ఇస్లాం గడాఫీకి మరణశిక్ష విధించింది. ఆయన గైర్హాజరీలోనే మరణదండన విధిస్తూ తీర్పునిచ్చింది.

అయితే, ఆమ్నెస్టీ చట్టం ప్రకారం రెండేళ్ల తర్వాత ఆయన్ను మిలీషియా విడుదల చేసింది.

ప్రభుత్వంలో అధికారిక పదవులు లేకపోయినప్పటికీ ఆయన కొన్ని విధానాల రూపకల్పనలో పాలుపంచుకున్నారు. ఉన్నత స్థాయి చర్చలకు నేతృత్వం వహించారు. వాటిలో తన తండ్రి అణ్వాయుధ కార్యక్రమాన్ని నిలిపివేసేందుకు కారణమైనవి కూడా ఉన్నాయి.

అలాంటి ఒప్పందాల కారణంగా లిబియాపై అంతర్జాతీయ ఆంక్షలు ఎత్తివేశారు. దీంతో గడాఫీని కొందరు సంస్కరణవాదిగా, లిబియా నాయకుడిగా రూపాంతరం చెందుతున్న వ్యక్తిగా భావించారు.

తండ్రి అధికారాన్ని వారసత్వంగా పొందాలనుకుంటున్నారన్న వాదనలను సైఫ్ అల్ ఇస్లాం గడాఫీ తిరస్కరించేవారు. ‘‘అధికారం వారసత్వంగా పొందే కాలం కాదిది’’ అనే ఆయన తరచూ అనేవారు.

తాను అధ్యక్ష పదవికి పోటీ చేయబోతున్నట్లు 2021లో ఆయన ప్రకటించారు. అయితే, తర్వాత ఎన్నికలు నిరవధికంగా వాయిదాపడ్డాయి.

ఫొటో సోర్స్, MAHMUD TURKIA/AFP via Getty Images

పులుల పెంపకం హాబీ

సైఫ్ అల్ ఇస్లాం గడాఫీకి ఇంగ్లిష్‌పై మంచి పట్టుంది. తన ఆకర్షణీయమైన జీవన శైలి ఆయన్ను లిబియాలో సంస్కరణలు తీసుకురాగలిగిన నేతగా కనిపించేలా చేసింది.

సైఫ్ పులులను పెంచుకునేవారు. అరబ్ రాజకుటుంబాలకు సంప్రదాయ హాబీ అయిన ఎడారిలో గద్దల వేటను ఆస్వాదించేవారు. పెయింటింగ్‌పై కూడా ఆసక్తి చూపేవారు.

2008లో, ఆయన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి పీహెచ్‌డీ పట్టా పొందారు. రాజకీయ సంస్కరణలపై దృష్టి పెట్టారు. పీహెచ్‌డీలో ఆయన థీసిస్ కూడా అదే.

అయితే, నిరసనకారులపై క్రూరమైన అణచివేతకు పాల్పడడంలో ఆయన పాత్ర వెలుగులోకి వచ్చిన తర్వాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ డైరెక్టర్ హోవార్డ్ డేవిస్ రాజీనామా చేశారు. సైఫ్ గడాఫీ ఆ సంస్థకు ఇచ్చిన భారీ విరాళమే అందుకు కారణం.

ఆ విరాళంపై విమర్శలు వినిపించాయి. సైఫ్ పీహెచ్‌డీపై కూడా విచారణ జరిగింది.

ఫొటో సోర్స్, d MARKUS LEODOLTER/AFP via Getty Images

పాశ్చాత్య దేశాలతో సత్సంబంధాలు

లిబియాను పశ్చిమ దేశాలకు చేరువ చేయడంలో సైఫ్ కీలకపాత్ర పోషించారు.

పాశ్చాత్య దేశాలతో సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు సైఫ్ తన తండ్రి సంపదను వినియోగించారని, గడాఫీ అణ్వాయుధ కార్యక్రమాలను నిలిపివేసేలా ఆయనతో చర్చించారని కూడా చెబుతారు.

లిబియన్ ఆస్పత్రిలో చిన్నారులకు హెచ్‌ఐవీ సోకేందుకు కారణమయ్యారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరుగురు బల్గేరియన్ వైద్యుల విడుదలకు సాయం చేశారు.

ఇది ఆయన్ను పశ్చిమ దేశాలకు దగ్గర చేసింది.

సైఫ్‌కు లండన్‌లో ఇల్లు కూడా ఉంది. బ్రిటిష్ రాజకీయ ప్రముఖులతో పరిచయాలున్నాయి. రాజకుటుంబంతో కూడా సంబంధాలు ఉన్నాయి.

లిబియాలోని అపారమైన చమురు నిల్వల కారణంగా పశ్చిమ దేశాలకు చెందిన ప్రముఖులు కూడా సైఫ్‌తో మంచి సంబంధాలు కోరుకున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)