'ఆధారాలుంటే తీసుకురండి, మా దగ్గరేమీ మంత్రదండం లేదన్న పోలీసులు', కొడుకు మరణానికి ఆధారాలు సేకరించి తెచ్చిన ఓ అమ్మ కథ..
ఫొటో సోర్స్, Asif Ali
- రచయిత, ఆసిఫ్ అలీ
- హోదా, బీబీసీ కోసం
- చదివే సమయం: 5 నిమిషాలు
దెహ్రాదూన్‌లోని ప్రేమన్‌నగర్ ప్రాంతంలో 18 ఏళ్ల క్షితిజ్ చౌదరి రోడ్డు ప్రమాదంలో మరణించి సుమారు రెండేళ్లు కావస్తోంది.
అయితే, ఈ ఘటనకు కారణమైన అనుమానిత డ్రైవర్‌ను పోలీసులు ఇప్పటివరకు పట్టుకోలేకపోయారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తన ఒక్కగానొక్క కొడుకును కోల్పోయిన లలితా చౌదరి ఈ రెండేళ్లుగా పోలీస్ స్టేషన్లు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.
దర్యాప్తు ప్రారంభ దశలో పోలీసులు నిర్లక్ష్యం వహించారని ఆరోపిస్తూ, తానే స్వయంగా ఆధారాలు సేకరించడం మొదలుపెట్టానని ఆమె చెప్పారు.
ఇటీవల ఒక బహిరంగ సమావేశంలో అధికారులకు తన ఆవేదనను తెలియజేయడంతో, పోలీసులు మళ్లీ విచారణ చేస్తామని లలితా చౌదరికి హామీ ఇచ్చారు.
ఫొటో సోర్స్, Asif Ali
అసలేం జరిగింది?
2024 ఫిబ్రవరి 16 అర్ధరాత్రి సుమారు 2:45 గంటలకు క్షితిజ్ చౌదరి తన స్నేహితుడితో కలిసి ప్రేమన్‌నగర్ ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆ సమయంలో అతివేగంగా వచ్చిన ఒక డంపర్ ఆయన్ను ఢీకొట్టిందని, డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయారని కుటుంబ సభ్యులు చెప్పారు.
ప్రమాదం జరిగిన తర్వాత స్నేహితులు అంబులెన్స్‌కు ఫోన్ చేసినా 45 నిమిషాల వరకు ఎలాంటి సాయం అందలేదని, పోలీసులు కూడా సకాలంలో రాలేదని లలితా చౌదరి ఆరోపించారు.
ఆ తర్వాత గాయాలతో ఉన్న క్షితిజ్‌ను దూన్ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత, పరిస్థితి విషమించడంతో రిషికేశ్‌లోని ఎయిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఫిబ్రవరి 17 సాయంత్రం క్షితిజ్ మరణించారు.
ప్రమాదం జరిగిన రెండు రోజుల తర్వాత ఫిబ్రవరి 19న గుర్తుతెలియని డంపర్ డ్రైవర్‌పై లలిత కేసు పెట్టారు. దానికిముందు, ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు తీసుకోలేదని ఆమె ఆరోపించారు.
ఫొటో సోర్స్, Asif Ali
'ఆధారాలుంటే తీసుకురమ్మని చెప్పారు'
"నా కొడుకు నా కళ్లలో నీళ్లు చూడలేడు. మేం తల్లీకొడుకుల్లా కాదు, స్నేహితుల్లా ఉండేవాళ్లం" అని లలితా చౌదరి చెప్పారు.
ప్రమాదం జరిగిన రోజు తెల్లవారుజామున 3 గంటలకు తనకు ఫోన్ వచ్చిందని ఆమె అన్నారు.
"తీవ్రమైన నొప్పితో బాధపడుతూ మాట్లాడుతున్నప్పుటు, గొంతు కూడా గుర్తుపట్టలేకపోయాను. నేను ఆస్పత్రికి వెళ్లగానే 'మమ్మీ వచ్చేశావా?' అని అడిగాడు" అని ఆమె గుర్తు చేసుకున్నారు.
సమయానికి సహాయం అంది ఉంటే, తన కొడుకు ప్రాణాలు దక్కేవని లలితా చౌదరి భావిస్తున్నారు.
"100, 108 నంబర్లకు చేసిన కాల్స్‌కు సమయానికి స్పందించి ఉంటే, ఈ రోజు నా కొడుకు నాతో ఉండేవాడు" అన్నారామె.
అయితే, అసలు పోరాటం ఆ తర్వాతే మొదలైందని లలితా చౌదరి అంటున్నారు.
కేసు పురోగతి గురించి అడిగినప్పుడు.. "మీ దగ్గర ఏవైనా ఆధారాలు ఉంటే తీసుకురండి, మా దగ్గరేమీ మంత్రదండం లేదు" అని పోలీసులు అన్నట్లు లలితా చౌదరి చెప్పారు.
దీంతో తానే దర్యాప్తు చేయాలని నిర్ణయించుకున్నానని ఆమె చెప్పారు. "నేను చేయకపోతే ఇంకెవరూ చేయరనిపించింది" అని లలితా చౌదరి అన్నారు.
నెలల తరబడి ఆ రోడ్డుపై తిరుగుతూ ప్రజలతో మాట్లాడినట్లు, హోటళ్లు, దుకాణాల్లోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించినట్లు ఆమె చెప్పారు.
"మూడు నెలలు నిత్యం ఆ రోడ్డుపైనే తిరిగాను" అని లలితా చౌదరి చెప్పారు.
ఒక సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా, ఆర్‌టీఓ కార్యాలయానికి వెళ్లి అనుమానం ఉన్న పది వాహనాల నంబర్లను సేకరించి పోలీసులకు ఇచ్చినట్లు చెప్పారామె.
అయినా దర్యాప్తులో ఎలాంటి పురోగతీ లేదని, ఏమీ దొరకలేదని పోలీసులు చెప్పారని ఆమె ఆరోపిస్తున్నారు.
సుమారు ఏడాదిన్నర తర్వాత ఈ కేసుపై ఫైనల్ రిపోర్ట్ సమర్పించారని తెలిసి.. తన కష్టం అంతా వృథా అయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఫొటో సోర్స్, Asif Ali
రైతు సంఘం దృష్టికి విషయం..
సుమారు రెండేళ్ల తర్వాత ఈ కేసు మరోసారి వెలుగులోకి వచ్చింది.
తన కుమారుడికి న్యాయం చేయాలంటూ దెహ్రాదూన్‌లో జరిగిన ఒక నిరసన కార్యక్రమంలో ఆమె గళమెత్తారు. ఈ క్రమంలో ఆమె భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ టికాయత్‌ను కలిశారు. లలిత ఆయనకు జరిగిన విషయాన్ని వివరించారు.
భారతీయ కిసాన్ యూనియన్ వెల్ఫేర్ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు సోమదత్ శర్మ మాట్లాడుతూ, "మేం లలితా చౌదరిని కలిశాం. ఆమె కథ విన్న తర్వాత మద్దతుగా నిలవాలని నిర్ణయించుకున్నాం. ఆమెను తీసుకుని ఎస్ఎస్‌పీని కలిసి, సేకరించిన ఆధారాలన్నీ చూపించాం" అని తెలిపారు.
సోమదత్ శర్మ కథనం ప్రకారం, ఈ కేసులో ఫైనల్ రిపోర్ట్ సమర్పించినట్లు మొదట అధికారులు చెప్పారు. కానీ, ఆధారాలను వారి ముందుంచిన తర్వాత మళ్లీ దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చారు.
"ఒక తల్లి స్వయంగా ఆధారాలు సేకరించాల్సి రావడం దురదృష్టకరం" అన్నారు సోమదత్ శర్మ.
ఈసారి కూడా చర్యలు తీసుకోకపోతే ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు.
"ఇప్పుడు కూడా స్పందన లేకపోతే మేం రోడ్లను దిగ్బంధిస్తాం. భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ టికాయత్ కూడా ఇక్కడికి వచ్చి మాకు అండగా నిలుస్తారు" అని సోమదత్ శర్మ పేర్కొన్నారు.
ఫొటో సోర్స్, Asif Ali
పోలీసులు ఏమన్నారు?
గతంలోనే ఈ కేసుపై దర్యాప్తు జరిగిందని, అయితే ఇప్పుడు అందిన కొత్త ఆధారాల మేరకు మళ్లీ విచారణ జరుపుతామని దెహ్రాదూన్ సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్ఎస్‌పీ) ప్రమేంద్ర డోభాల్ అన్నారు.
ప్రమేంద్ర డోభాల్ బీబీసీ హిందీతో మాట్లాడుతూ, "అందుబాటులో ఉన్న సీసీటీవీ ఫుటేజీలన్నింటినీ అప్పట్లోనే పరిశీలించాం. ఇప్పుడు అందిన సాక్ష్యాల ఆధారంగా సంబంధిత పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్‌కు తిరిగి దర్యాప్తు చేయాలని ఆదేశాలిచ్చాం" అని చెప్పారు.
ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో ఉందని, తదుపరి విచారణ కోసం న్యాయస్థానం అనుమతి తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.
దర్యాప్తులో ఏ దశలోనైనా నిర్లక్ష్యం జరిగినట్లు తేలితే, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని ఎస్ఎస్‌పీ హామీ ఇచ్చారు.
లలితా చౌదరి స్వస్థలం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్‌నగర్. గత కొన్నేళ్లుగా ఆమె ఒంటరిగా కష్టపడుతూ కుటుంబ బాధ్యతలను మోస్తున్నారు. ఆమె కుమార్తె ప్రస్తుతం దిల్లీలో ఇంటర్న్‌షిప్ చేస్తున్నారు.
తన కుమారుడి కోసం తాను చేసిన పోరాటం.. ఒక తల్లిగా తన బాధ్యతని లలితా చౌదరి అంటున్నారు.
"పోలీసులు చేయాల్సిన పని నేను చేశాను."
"అమ్మా నన్ను కాపాడు" అని తన కొడుకు తనతో అన్నాడని లలితా చౌదరి అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
ముఖ్యమైన కథనాలు
ఫీచర్లు
పాపులర్
కంటెంట్ అందుబాటులో లేదు